మరో రెండు తుపానులంటూ వాట్సాప్ మెసేజ్‌లు

ABN , First Publish Date - 2020-11-26T23:38:11+05:30 IST

నివర్ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సమయంలోనే మరో రెండు

మరో రెండు తుపానులంటూ వాట్సాప్ మెసేజ్‌లు

చెన్నై : నివర్ తుపాను బీభత్సం సృష్టిస్తున్న సమయంలోనే మరో రెండు తుపానులు రాబోతున్నాయంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. నివర్ తుపాను తీరం దాటక ముందే బలహీనపడిందని, అయినప్పటికీ చెన్నైలో పెనుగాలులు వీస్తున్నాయని ఈ మెసేజ్ పేర్కొంది. దీనినిబట్టి ఈ తుపాను సత్తాను అంచనా వేయవచ్చునని తెలిపింది. దైవ సంకల్పంతోనే ఈ తుపాను బలహీనపడిందని, లేకపోతే నష్టం భారీగా ఉండేదని పేర్కొంది. 


అయితే చెన్నైకి ఈ వర్షాలే చివరివి కాదని, మరో రెండు తుపానులు బంగాళాఖాతంలో రాబోతున్నాయని ఈ వాట్సాప్ మెసేజ్ హెచ్చరించింది. వీటిలో ఒకదాని పేరు బురెవి అని తెలిపింది. ఈ తుపాను వచ్చే నెల 1 లేదా రెండో తేదీల్లో వస్తుందని, మరొక తుపాను డిసెంబరు 10 లేదా 11 తేదీల్లో రావచ్చునని తెలిపింది. 


ఈ మెసేజ్‌పై వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు స్పందిస్తూ, నివర్ తుపాను బలహీనమైనదని చెప్పడం సరికాదన్నారు. కేవలం గాలి వేగం, దిశ మాత్రమే మారిందన్నారు. పశ్చిమంవైపు వెళ్ళడంతో అనుకున్నంత తీవ్రతతో భూమిపైకి రాలేదన్నారు. నవంబరు 29 ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇది తుపానుగా మారుతుందా? మారదా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇది దక్షిణ తమిళనాడు వైపు వెళ్ళవచ్చునన్నారు. తుపాను రావడం గురించి సుమారు 20 రోజుల ముందుగా చెప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ, కచ్చితత్వంతో చెప్పడం సాధ్యం కాదన్నారు. 


అండమాన్ దీవుల సమీపంలోని సుమత్ర తీరంలో మరొక తుపాను ఏర్పడవచ్చునన్నారు. అయితే దీని గురించి స్పష్టంగా ఇప్పుడే చెప్పలేమన్నారు. బహుశా ఇది తుపానుగా మారకపోవచ్చునన్నారు. ఒకవేళ తుపాను వచ్చినప్పటికీ డెల్టా వైపు వెళ్ళవచ్చునని, ఉత్తర తమిళనాడువైపు వెళ్ళకపోవచ్చునని చెప్పారు. 


Updated Date - 2020-11-26T23:38:11+05:30 IST