వాట్సాప్‌ కొత్తపాలసీ 3 నెలలు వాయిదా!

ABN , First Publish Date - 2021-01-17T07:41:29+05:30 IST

వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి తేనున్న కొత్త ప్రైవసీ పాలసీని మరో మూడు నెలల పాటు వాయిదా వేసింది. మే 15

వాట్సాప్‌ కొత్తపాలసీ 3 నెలలు వాయిదా!

మే 15 నుంచి అమల్లోకి.. పాలసీని 

వినియోగదారుల్లోకి తీసుకెళ్తామన్న సంస్థ

వారిలో అపోహలు తొలగిస్తామంటూ ప్రకటన

అప్పటివరకు ఏ ఖాతానూ తొలగించమని వెల్లడి

 

న్యూఢిల్లీ, జనవరి 16: వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి తేనున్న కొత్త ప్రైవసీ పాలసీని మరో మూడు నెలల పాటు వాయిదా వేసింది. మే 15 నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగిస్తామని, ఎవరి ఖాతాలూ తొలగించబోమని స్పష్టం చేసింది. గత వారం వాట్సాప్‌.. కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని, దానికి అంగీకారం తెలిపిన వారి ఖాతాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆమోదం తెలపని వారి ఖాతాలను తొలగిస్తామని పేర్కొంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.




ఇదే సమయంలో.. అనేక మంది దీనికి ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు. సిగ్నల్‌, టెలిగ్రామ్‌ లాంటి యాప్‌ల వైపు అధిక శాతం మంది మొగ్గు చూపించారు. దీంతో.. వాటి డౌన్‌లోడ్‌లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అదే స్థాయిలో వాట్సాప్‌ కుదేలైంది. దీనిపై స్పందించిన ఆ సంస్థ సీఈవో.. తాము బిజినెస్‌ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే షేర్‌ చేస్తామని, సాధారణ అకౌంట్ల జోలికి వెళ్లబోమని వివరణనిచ్చారు. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు. దీంతో.. ఇక చేసేది లేక వాట్సాప్‌ నిర్ణయాన్ని మూడు నెలల పాటు వాయిదా వేసుకుంది. ఈ సమయంలో తాము వినియోగదారుల్లో పాలసీకి సంబంధించిన అపోహలు తొలగిస్తామని ప్రకటించింది.


మరోవైపు.. వాట్సాప్‌ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ.. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, దాన్ని వెంటనే వాపసు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇలాంటి పాలసీలను నియంత్రించేలా పటిష్ఠమైన చట్టాలను రూపొందించేందుకు కేంద్రానికి కూడా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.


Updated Date - 2021-01-17T07:41:29+05:30 IST