ఆ సమస్యకు వాట్సాప్ చెక్...

ABN , First Publish Date - 2021-01-12T23:36:43+05:30 IST

లీకేజీ సమస్యను వాట్సాప్ ఎట్టకేలకు పరిష్కరించింది. వివరాలిలా ఉన్నాయి. వాట్సాప్‌లో గ్రూప్‌ల సమాచారం లీక్ సమస్యను ఆ సంస్థ పరిష్కరించింది.

ఆ సమస్యకు వాట్సాప్ చెక్...

మెన్లోపార్క్(అమెరికా) : లీకేజీ సమస్యను వాట్సాప్ ఎట్టకేలకు పరిష్కరించింది. వివరాలిలా ఉన్నాయి. వాట్సాప్‌లో గ్రూప్‌ల సమాచారం లీక్ సమస్యను ఆ సంస్థ పరిష్కరించింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ గ్రూపులు, యూజర్ ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయ్న వార్తలతో ఆ సంస్థ అప్రమత్తమైంది. కొత్తగా కనిపించిన బగ్‌ సమస్యను వెంటనే పరిష్కరించినట్లు వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీస్ రూల్స్‌తో వినియోగదారుల నుంచి వాట్సాప్‌ విమర్శలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... డేటా లీకేజ్ వార్తలు ఆ సంస్థను మరింత ఇబ్బంది పెట్టాయి. తన మాతృసంస్థ ‘ఫేస్‌బుక్‌’తో యూజర్ డేటాను పంచుకునేందుకు అనుమతిస్తేనే వాట్సాప్ ను వినియోగించాలన్న నిబంధన విషయంలో వినియోగదారుల నుంచి పెద్దఎత్తున సందేహాలు, ప్రశ్నలు, విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 


 ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్ హోమ్ నేపధ్యంలో పలు కంపెనీలు ఉద్యోగావసరాలకు వాట్సాప్ గ్రూప్‌లను వినియోగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... డేటా లీకేజీ వార్తలతో చాలా కంపెనీలు... సున్నితమైన సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేసుకోవద్దని, అంతేకాకుండా బిజినెస్ కాల్స్‌ చేసుకోవద్దని కూడా ఉద్యోగులను కోరినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. 


వాట్సాప్‌లో ఈ బగ్‌ను సైబర్ సెక్యూరిటీ రిసెర్చర్ రాజ్‌శేఖర్ రాజహరియా గుర్తించారు. గ్రూప్ ఇన్వైట్ లింక్ ద్వారా బయటి వ్యక్తులెవరైనా గ్రూప్‌లో చేరవచ్చని, దీని వల్ల యూజర్ల డేటా దుర్వినియోగమయ్యే ప్రమాదముందని రాజశేఖర్ తెలిపారు. 


‘గూగుల్ సెర్చ్‌లో 1,700 కు పైగా గ్రూప్ ఇన్వైట్ లింకులు, 7 వేల కంటే ఎక్కువ ప్రొఫైల్స్ కనిపిస్తున్నాయి. కానీ కాసేపటి తరువాత ఇవి గూగుల్‌ సెర్చ్‌లో కనిపించలేదు. ఈ బగ్‌ను పరిష్కరించాం’ అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘గతేడాది మార్చి నుంచి వాట్సాప్ డీప్ లింక్ పేజీలలో 'నో-ఇండెక్స్' ట్యాగ్‌ను యాడ్ చేశాం. ఈ ట్యాగ్ ఉన్న లింక్‌లను గూగుల్ తన ఇండెక్సింగ్ నుంచి మినహాయించింది. సెర్చ్‌ లిస్ట్‌లో ఇలాంటి చాట్‌లను ఇండెక్సింగ్ చేయవద్దని గూగుల్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చాం. దీంతోపాటు ఇన్వైట్ లింక్ ద్వారా వేరే వ్యక్తి గ్రూప్‌లో చేరితే, గ్రూప్ సభ్యులకు రిమైండర్‌ వచ్చే ఏర్పాట్లు చేశాం. ఎవరైనా బయటి వ్యక్తులు వాట్సాప్ గ్రూప్‌లో చేరితే అడ్మిన్ వెంటనే గుర్తించి, ఆ లింక్‌ను మార్చవచ్చు’ అని ఆ ప్రతినిధి వివరించారు. 

Updated Date - 2021-01-12T23:36:43+05:30 IST