గతుకుల్లో ‘చక్రం’!

ABN , First Publish Date - 2021-01-17T08:46:35+05:30 IST

ఏపీఎస్‌ ఆర్టీసీ.. నష్టాల సుడిగుండం నుంచి ఒడ్డున పడే ప్రయత్నంలో.. పీటీడీ పేరిట ప్రభుత్వంలో విలీనమైనా కష్టాలు మాత్రం వీడడంలేదు.

గతుకుల్లో ‘చక్రం’!

  • ‘ప్రజారవాణా’ గాడినపడేదెప్పుడో?
  • డొక్కు బస్సులు.. సిబ్బంది బకాయిలు
  • అప్పుల వడ్డీలు.. కారుణ్య నియామకాలు
  • ఆదాయం పెంపు.. ఆస్తుల పరిరక్షణ
  • ఆర్టీసీ కొత్త ఎండీకి సవాళ్లు స్వాగతం


(అమరావతి, ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీ.. నష్టాల సుడిగుండం నుంచి ఒడ్డున పడే ప్రయత్నంలో.. పీటీడీ పేరిట ప్రభుత్వంలో విలీనమైనా కష్టాలు మాత్రం వీడడంలేదు. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద ప్రజా రవాణా సంస్థగా పేరొందిన ఆర్టీసీ(పీటీడీ) ప్రస్తుతం ఉనికి కోసం పాట్లు పడుతోంది. డీజిల్‌ ధరల పెరుగుదల, నిర్వహణ భారం, అప్పుల కుప్ప అన్నీ కలిపి సంస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆ తర్వాత  సంస్థ ఉన్నతాధికారులు కూడా సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కొన్ని ప్రయాత్నాలు చేసినా.. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి చందంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పటి వరకు పనిచేసిన ఎండీ కృష్ణబాబు బదిలీ అయి.. కొత్త ఎండీగా ఆర్పీ ఠాకూర్‌ బాధ్యతలు స్వీకరించారు. దీంతో.. గతుకుల్లో ఉన్న పీటీడీ చక్రాన్నిఆయన ఎలా గట్టెక్కిస్తారోనని సిబ్బందిలో చర్చ సాగుతోంది. ఆర్టీసీ...  ప్రజారవాణ సంస్థ (పీటీడీ)లో విలీనం అయ్యాక..  సిబ్బంది జీతాల వరకూ ప్రభుత్వం చెల్లిస్తున్నా.. ఉద్యోగుల పాత బకాయిలు.. లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ చెల్లింపులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. సంస్థ చెల్లించాల్సింది రూ.1200కోట్లు ఉండగా కార్మికులు పొదుపు చేసుకున్న ఎస్‌ఆర్బీఎస్‌, ఎస్బీటీ, సీసీఎస్‌ నిధులు రూ.800కోట్లు ఉన్నాయి. మొత్తం 2వేల కోట్ల పైగానే స్బిందికి ఆర్టీసీ నుంచి చెల్లింపులు చేయాల్సి ఉంది.


ఇదిలా ఉండగా మెడికల్‌ అన్‌ఫిట్‌ సిబ్బంది పిల్లలు 180మంది, చనిపోయిన వారి వారసులు 800మంది నియామకాల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. వీరికి తోడు కాంట్రాక్టు కార్మికులు సైతం  రెగ్యులరైజేషన్‌ చేయాలని పదే పదే యాజమాన్యానికి విన్నవిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు గత ఎండీ సురేంద్ర బాబు డిసెంబరు 2019 లోపే పూర్తిచేస్తామని రాత పూర్వకంగా భరోసా ఇచ్చారు. అయితే ఉద్యోగుల పదవీ విరమణ రెండేళ్లు ఆగిపోవడంతో అడుగు ముందుకు పడలేదు. ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందన్న ఆశతో ఏర్పాటు చేసిన కార్గో.. అంచనాలు అందుకోలేక పోతోంది. 


విలీనం జరిగినా..?

ఆర్టీసీలో పనిచేస్తున్న 52 వేల మందిని పీటీడీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో విలీనం చేసి ఏడాది గడిచి పోయినా ఇప్పటి వరకూ సర్వీస్‌ రూల్స్‌ అమలు కాలేదు.  తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్‌ అమలు చేస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. అది వస్తుందో రాదో తేల్చకుండానే అమల్లో ఉన్న పెన్షన్‌ ఎస్‌ఆర్‌బీఎస్‌ యాజమాన్యం తీసేసింది. దీంతో తాము రెంటికీ చెడ్డ రేవడి అయ్యామని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. వైద్యం కోసం గతంలో పరిమితి ఉండేది కాదు, కార్మికుడికి జబ్బు చేస్తే ఎన్ని లక్షలైనా ఆర్టీసీ భరించేది. ఇప్పుడు ఐదు లక్షలు దాటితే కోత, మందుల కొనుగోళ్లలోనూ ఆంక్షలు పెడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే బిల్లులో భారీగా తగ్గిస్తున్నారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి కొత్త ఎండీ తీసుకెళ్లి పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు.

 

డొక్కు బస్సులు.. ప్రైవేటు పోటీ..

రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి.. పన్నెండు రీజియన్లలో 11,500 బస్సులు నడుపుతున్న ఆర్టీసీకి 9,500 సొంత బస్సులు ఉన్నాయి. వాటిలో 6వేల బస్సులు కాలం చెల్లి(12లక్షలకు పైగా) కదల్లేక పోతున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత కొత్త బస్సులు కొనుగోలు చేయాలని యాజమాన్యం భావించినా వీలుకాలేదు. దీంతో వాటినే రోడ్లు ఎక్కిస్తుండటంతో ఎక్కడ బడితే అక్కడ తోయాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రానికి బస్సుల తగ్గింపు, ఆక్యుపెన్సీ పెరిగినా ఆశించిన ఆదాయం రాకపోవడం లాంటి సమస్యలు ఆర్టీసీ ముందున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు  బస్సులతో పోటీ తత్వాన్ని ఎలా అధిగమిస్తారన్నది కొత్త ఎండీ ముందున్న సవాలు.


ఇదిలాఉంటే.. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖరీదైన స్థలాల ఆధునికీకరణలో అధికార పార్టీ దూరదృష్టితో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఆ ఒత్తిళ్లతోపాటు ఎలక్ట్రిక్‌ బస్సుల అద్దె విషయంలో సంస్థకు నష్టం రాకుండా ఎలా డీల్‌ చేయగలుగుతారన్నది ఇప్పుడు అతి పెద్ద సవాలు. కి.మీ. ఆదాయం కన్నా ఎలక్ట్రిక్‌ బస్సుల అద్దె ఎక్కువగా ఉండటంతో ఎప్పటికప్పుడు ఏడాదికి పైగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే టీటీడీకి పర్యావరణ రహిత బస్సులిచ్చేందుకు ప్రభుత్వ అనుమతి కోరిన ఆర్టీసీ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి మరిన్ని సమస్యలను ఆర్పీ ఠాకూర్‌ ఎలా అధిగమించగలరన్న చర్చ ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది.

Updated Date - 2021-01-17T08:46:35+05:30 IST