వికారాబాద్‌ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటయ్యేదెప్పుడో ?

ABN , First Publish Date - 2021-01-18T09:32:30+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రతిపాదనలకే పరిమితమైంది. లాజిస్టిక్‌ పార్కుల పేరిట ప్రతిపాదించిన డ్రైపోర్టుతో ప్రత్యకంగా, పరోక్షంగా సుమారు 2,000 మందికి

వికారాబాద్‌ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటయ్యేదెప్పుడో ?

రెండేళ్ల క్రితమే ప్రభుత్వ నిర్ణయం.. కార్యరూపం దాల్చని ప్రతిపాదన లు 

నేటికీ ప్రారంభం కాని పనులు.. ఏర్పాటైతే 2 వేల మందికి ఉపాధి  


వికారాబాద్‌, జనవరి 17 ((ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రతిపాదనలకే పరిమితమైంది. లాజిస్టిక్‌ పార్కుల పేరిట ప్రతిపాదించిన డ్రైపోర్టుతో ప్రత్యకంగా, పరోక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం రాష్ట్రంలో దశలవారీగా 24 డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, అందులో వికారాబాద్‌ జిల్లా కూడా ఉంది. డ్రైపోర్టు నిర్మాణం, నిర్వహణ తదితర వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థకు అప్పగించారు. పూడూరు, పరిగి, మోమిన్‌పేట్‌, మర్పల్లి, తాండూరు తదితర ప్రాంతాల్లో డ్రైపోర్టు ఏర్పాటుకు 400 ఎకరాల భూమి అనువుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే, ఏర్పాటు ప్రక్రియ ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటువుతుందా? లేక వేరే చోటకు తరలిపోనుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో..

డ్రైపోర్టు నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో చేపడతారు. డ్రైపోర్టు నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను ప్రైవేట్‌ సంస్థలు సమకూరిస్తే.. అవసరమైన అనుమతులను కేంద్ర ప్రభుత్వం నుంచి జారీ చేయించేలా, నిర్మాణానికి అవసరమైన రుణ సహాయం మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 


ఏర్పాటైతే ఎన్నో వసతులు 

డ్రైపోర్టులో సరుకుల ఎగుమతి, దిగుమతులకు వసతులు ఏర్పాటు చేయడంతో పాటు కోల్డ్‌ సోరేజీలు, గోదాములు, కంటైనర్‌ కేంద్రాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వాణిజ్య సదుపాయాల కేంద్రం, వ్యవసాయ మార్కెట్‌, ట్రాన్స్‌పోర్టు సదుపాయాలు కల్పిస్తారు. ట్రక్కులు, ఇతర గూడ్స్‌ వాహనాల పార్కింగ్‌కు వీలుగా ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తారు. రవాణాకు సంబంధించిన అన్ని అనుమతులు ఒకేచోట లభించేలా చర్యలు తీసుకుంటారు. రవాణా వ్యయం, సమయం తగ్గేలా వసతులు కల్పిస్తారు. రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌, కస్టమ్స్‌ అనుమతుల విభాగాలు కూడా ఏర్పాటు చేస్తారు. డ్రైపోర్టు నిర్వహణ బాఽధ్యతలను పర్యవేక్షించేందుకు పరిపాలనా భవనం కూడా నిర్మిస్తారు. 

Updated Date - 2021-01-18T09:32:30+05:30 IST