పీఏసీఎస్‌లకు ఎన్నికలు ఎప్పుడో?

ABN , First Publish Date - 2021-08-27T05:22:47+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) పదవీ కాలం ముగిసి మూడేళ్లు పూర్తయింది. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి త్రిసభ్య కమిటీలను పునరద్ధరిస్తూనే ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించడం లేదు. తాజాగా మరోసారి త్రిసభ్య కమిటీలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు వరకు సహకార ఎన్నికలు లేనట్టేనని తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పీఏసీఎస్‌లకు ఎన్నికలు ఎప్పుడో?
ఇచ్ఛాపురంలోని పీఏసీఎస్‌ కార్యాలయం

 ముగిసిన పాలకమండళ్ల గడువు

 మూడేళ్లుగా త్రిసభ్య కమిటీలతో పొడిగింపు

 ఆశావహుల ఎదురుచూపు

(ఇచ్చాపురం రూరల్‌)

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) పదవీ కాలం ముగిసి మూడేళ్లు పూర్తయింది. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి త్రిసభ్య కమిటీలను పునరద్ధరిస్తూనే ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించడం లేదు. తాజాగా మరోసారి త్రిసభ్య కమిటీలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు వరకు సహకార ఎన్నికలు లేనట్టేనని తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో 49 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రణస్థలంలో ఒక ఎఫ్‌ఏసీఎస్‌.. మొత్తం 50 వరకు ఉన్నాయి. వీటి పాలక వర్గాల పదవీ కాలం 2018 జూలై 30వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ఈ సంఘాల పరిపాలనా భాధ్యతలను ప్రభుత్వం త్రిసభ్య కమిటీలకు అప్పగిస్తూ వస్తోంది.  పదవీ కాలం ముగిసినా అప్పటి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నిమిత్తం వీటిని వాయిదా వేసింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం పీఏసీఎస్‌ల ఎన్నికల విషయంలో ఆసక్తి చూపలేదు. అప్పటి నుంచి కొన్నాళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో సహకార సంఘాలు నడిచాయి. ఈ దశలో కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తర్వాత త్రిసభ్య కమిటీలను నియమించి ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వస్తున్నారు.  త్రిసభ్య కమిటీలలో ఎవరైనా రాజీనామా చేసినా.. మరణించినా... వారి స్థానంలో కొత్తవారిని తీసుకుని అవే కమిటీలను కొనసాగించడం లేదా మార్చడం కేవలం ఎమ్మెల్యేలపై ఆధారపడి ఉందని అధికారులు చెబుతున్నారు. 


ఆశావహుల్లో నిరుత్సాహం 

ఎప్పుడో పదవీ కాలం పూర్తయినా, త్రిసభ్య కమిటీల పేరుతో పొడిగించిన పీఏసీఎస్‌లకు ఇటీవల స్థానిక సమరం అనంతరం ఎన్నికలు జరుగుతాయని ఆశావహులు భావించారు. మళ్లీ త్రిసభ్య కమిటీలకు బాధ్యతలు అప్పగించడంతో ఆశావహులు నిరుత్సాహం చెందుతున్నారు. ఎన్నికల నిర్వహణకు వెనుకంజ వేయడానికి కరోనా వ్యాప్తి లేదా ఇతర కారణాలు ఉన్నాయోమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలని ఆశావహులు కోరుతున్నారు. 


 ఉత్తర్వులు రాలేదు 

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ప్రస్తుతం త్రిసభ్య కమిటీలతో పాలనా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఉన్నతాధికారుల సూచనలతో త్రిసభ్య కమిటీల ద్వారా పాలనా వ్యవహారాలు  కొనసాగిస్తున్నాం. 

- కె.మురళీకృష్ణారావు, జిల్లా ప్రాథమిక సహకార పరపతి సంఘం అధికారి, శ్రీకాకుళం

Updated Date - 2021-08-27T05:22:47+05:30 IST