ఉస్మా‘నయా’ నిర్మాణమెప్పుడు..!

ABN , First Publish Date - 2021-06-24T14:29:54+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ పనులు

ఉస్మా‘నయా’ నిర్మాణమెప్పుడు..!

  • ఖాళీ స్థలం ఉన్నా... నిర్ణయాలు జరిగినా... కొత్త భవనాల పనులకు కలగని మోక్షం 
  • జనరల్‌ వైద్య చికిత్సలకు ఉస్మానియా ఒక్కటే దిక్కు
  • పాతభవనానికి తాళం

హైదరాబాద్‌ సిటీ : ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదు. పాతభవనానికి తాళం వేసి కొత్త భవనంలో పడకలు సర్దుబాటు చేసినా అక్కడ ఎలాంటి పనులూ చేపట్టడం లేదు. దాదాపు పదేళ్లుగా ఇక్కడ కొత్త భవనాల నిర్మాణాలు ఒక కలగా, కాగితాలకే పరిమితమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో ట్విన్‌ టవర్స్‌ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నలుదిశలా నాలుగు ఆస్పత్రులు నిర్మించాలని కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియా ఆస్పత్రిలో ట్విన్‌ టవర్స్‌పై మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇటీవల మజ్లీస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆస్పత్రిని సందర్శించారు. ఖాళీ స్థలంతోపాటూ పాతభవనాలు కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


ప్రస్తుతం జనరల్‌ చికిత్సలకు..

ఉస్మానియా చారిత్రాత్మక ఆస్పత్రి. ఇక్కడ ఏళ్ల తరబడి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆస్పత్రి తెలుగు ఉభయ రాష్ట్రాలలో పేరుగాంచింది. ఆస్పత్రి ప్రాంగణంలో ప్రస్తుతం మూడు భవనాలు ఉన్నాయి. పాతభవనం శిథిలం కావడంతో దానికి తాళం వేశారు. అక్కడి పడకలను కులీకుతుబ్‌షా, ఓపీ భవనానికి తరలించి, రోగులను సర్దుబాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. జనరల్‌ వైద్య సేవలు అందించే ఆస్పత్రులలో ఉస్మానియా, గాంధీ రెండు ప్రధానమైనవి. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చి కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారు. దీంతో ఈ ఆస్పత్రికి సంబంధించిన రోగులకు ఉస్మానియాలో చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. రోగులకు పడకలు సర్దుబాటు చేయలేక అధికారులు, వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. 


ఆది నుంచి అడ్డంకులే..

ఉస్మానియా ఆస్పత్రికి మొదటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మొదట్లో ఇక్కడ కొత్త నిర్మాణాలు హెరిటేజ్‌ భవనాల కంటే ఎత్తు ఉండరాదనే నిబంధన అడ్డుగా మారింది. కొత్త నిర్మాణాల నీడ చారిత్రాత్మక భవనాలపై పడొద్దనే మరో నిబంధనతో నిర్మాణాలకు ఇబ్బందిగా మారింది. దీంతో అప్పట్లో ఏడు ఎకరాలలో కొత్త భవనాల నిర్మాణాలకు దాదాపు రూ.2 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ పనులు మొదలు కాలేదు. కొత్త భవనాల నిర్మాణాల కోసం తవ్వకాలు, పనుల సమయంలో పాత కట్టడానికి నష్టం జరుగవచ్చుననే అభిప్రాయం హెరిటేజ్‌ బృందం నుంచి ఉత్పన్నమైంది. ఈ నిబంధనలతో కొత్త భవనాల నిర్మాణాలు రెండు అంతస్తుల కంటే ఎక్కువ చేయడానికి అవకాశం లేదు. దీంతో కొత్త భవనాల నిర్మాణాలు ముందుకు సాగలేదు. 


తెరవెనకకు ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం?

హెరిటేజ్‌ నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మూడు భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఇక్కడ ట్విన్‌ టవర్స్‌ నిర్మించాలని భావించారు. అందుకు తగిన ప్రణాళిక, మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు. కొత్త భవనాలు, ఆధునిక పరికరాలు, పడకలు ఇలా అనేక మార్పులతో ఉస్మానియా ఆస్పత్రి కార్పొరేట్‌ స్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లకు కసరత్తు మొదలెట్టింది. ఐదు ఎకరాలలో రెండు కొత్తభవనాలను నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్లలో ఈ కొత్త భవనాలను నిర్మించి రోగుల సేవలకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ప్రస్తుతం గ్రేటర్‌లో మరో నాలుగు కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉస్మానియా ఆస్పత్రిలో ట్విన్‌టవర్స్‌ నిర్మాణాల గురించి మళ్లీ ఎలాంటి ప్రకటన రాలేదు.


ఉస్మానియా ప్రాంగణంలోనే..

- ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ పూర్వ విద్యార్థుల సంఘం

మంగళ్‌హాట్‌: ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోని 25 ఎకరాల స్థలంలో ప్రభుత్వం నూతన భవనాన్ని నిర్మించాలని ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ తపాడియా, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌ కృష్ణ మూర్తి డిమాండ్‌ చేశారు. బుధవారం ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ సంఘం పేరుతో కొంతమంది కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, తమ సంఘానికి పాత భవనం విషయంలో ప్రకటనలు చేసిన వ్యక్తికి అసలు సంబంధం లేదన్నారు.  ఈ కార్యక్రమంలో ట్రస్టీ సభ్యులతో పాటు పలవురు నాయకులు పాల్గొన్నారు. 


నూతన భవనాన్ని నిర్మించాలి : ఐఎంఏ తెలంగాణ శాఖ

హైదరాబాద్‌ సిటీ: నిజాం కాలం నుంచి ప్రజలకు సేవలందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి భవనం పాతబడిపోయిందని.. దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలంగాణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో కోరింది. గాంధీ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడంతో ఉస్మానియాపై భారం పెరిగిందన్నారు. ఈ భవనంలో ఎక్కువమందికి చికిత్స అందించలేకపోతున్నామని పేర్కొంది.

Updated Date - 2021-06-24T14:29:54+05:30 IST