Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంతటి ప్రజాస్వామ్యవాదిని ఎప్పుడు చూశాము?

మార్టినా నవ్రతిలోవా. రెండు మూడు దశాబ్దాల కిందట టెన్నిస్ ఆటలో ఆమె పేరు మారుమోగిపోతుండేది. ఎన్నో గ్రాండ్ శ్లామ్‌లు గెలుచుకున్న చాంపియన్ ఆమె. నలభైలలో కూడా ఇరవైల క్రీడాకారిణులతో పోటీపడిన జగజ్జెట్టి. ఆమె లైంగిక ప్రాధాన్యాల గురించి మీడియాలో గుసగుస రాతలు, మసాలా రాతలు కనిపించేవి కానీ, ఆమె రాజకీయ భావాలకు పెద్దగా ప్రచారం జరగలేదు. సోవియట్ కూటమిలోని సోషలిస్టు దేశంగా ఉండిన చెకొస్లావేకియాకు చెందిన నవ్రతిలోవా, అక్కడి వ్యవస్థ నచ్చక, 1975లోనే అమెరికాను ఆశ్రయించి, పౌరసత్వం తీసుకున్నారు. అట్లాగని, ఆమె పెట్టుబడిదారీ దేశాల్లో ఉన్న వ్యవస్థను యథాతథంగా ఆమోదించే వ్యక్తి కాదు. డొనాల్డ్ ట్రంప్ రాకడ వల్ల అమెరికన్ ఉదార, ప్రజాస్వామిక వాదులలో కలిగిన కలవరాన్ని నవ్రతిలోవా కూడా పంచుకున్నారు. భారత్‌లో జాతీయ పౌరుల చిట్టా, పౌరసత్వ సవరణచట్టం నేపథ్యంలో ఆమె 2019లో ట్రంప్, నరేంద్రమోదీ ఒకే తానులో ముక్కలని వ్యాఖ్యానించారు. తమ రాజకీయ లక్ష్యాల కోసం వాస్తవికతనే తారుమారు చేయగలిగిన ఘనులని ఆమె ట్రంప్, మోదీలను ఆ ట్వీట్‌లో విమర్శించారు. 


ఆమె మరొకసారి మాట్లాడింది మరి. భారత ప్రధాని గురించి ఆయన అత్యంత సన్నిహితుడు దేశీయ వ్యవహారాల మంత్రి అయిన అమిత్ షా నాలుగురోజుల కిందట చేసిన ట్వీట్‌లో చేసిన ప్రశంసను పరిహాసాస్పదం అని మార్టినా నవ్రతిలోవా తీసిపారేశారు. నరేంద్రమోదీ నియంత కారని, అంతటి ప్రజాస్వామ్యవాది అయిన ప్రధాని భారతదేశానికి మునుపెన్నడూ లేరని అమిత్ షా చేసిన వ్యాఖ్య దేశంలో కలకలానికి కారణమైంది కానీ, పరిహాసానికి లోనయింది మాత్రం నవ్రతిలోవా ట్వీట్ లోనే. ఆశ్చర్యం ఏమిటంటే, ఆమె వ్యాఖ్యను మోదీ, షా అభిమానులు కానీ, భారతీయ జనతాపార్టీ సామాజిక మాధ్యమాల సైన్యం కానీ పెద్దగా పట్టించుకోలేదు. మార్టినా లైంగికతను హేళన చేస్తూ, దూషణలు కుప్పలు తెప్పలుగా వస్తాయని ఊహించినవారికి, ఆశ్చర్యమే ఎదురయింది. విస్మరించడమే ఉత్తమమని, దుమారం వల్ల ప్రతికూల ప్రచారమే ఎక్కువవుతుందని భావించి ఉండవచ్చు. లేదా, నవ్రతిలోవాకు ట్విట్టర్‌లో పెద్ద అనుచరబలం లేదని గ్రహించి ఉండవచ్చు. 


ఈ ఏడాది ఆరంభంలో రిహాన్నా అనే బార్బడోస్, అమెరికన్ పాప్ గాయని చేసిన ట్వీట్లు ఎంతటి సంచలనం కలిగించాయో తెలిసిందే. ఢిల్లీ రైతు ఉద్యమకారులు బైఠాయించిన చోట ఇంటర్నెట్‌ను తొలగించిన వార్తను చూసి ఆమె, ఈ విషయం గురించి మనమంతా ఎందుకు మాట్లాడడం లేదు? అని ట్విట్టర్ ద్వారా ఆశ్చర్యపోయారు. ఆమె ప్రశ్నావ్యాఖ్యకు కొద్ది గంటల వ్యవధిలోనే పది లక్షల ‘లైక్’లు వచ్చాయి, లక్షన్నర వ్యాఖ్యలు తోడయ్యాయి. పదికోట్ల మంది ‘ఫాలోవర్లు’ ఉన్న ‘తార’ రిహన్నా. ఆమెతో పోలిస్తే మార్టినా ‘అనుచరుల’ సంఖ్య తక్కువ. ఆమె ఫాలోవర్లు నాలుగు లక్షలకు లోపే ఉంటారు. రిహన్నా ట్వీట్ వచ్చిన వెంటనే స్వీడిష్ పర్యావరణ యువ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ గొంతు కలిపారు. ఆ తరువాత ఉగాండాకు చెందిన మరో చిన్నారి కార్యకర్త, భారతీయ బాలికా కార్యకర్త లిసిప్రియ.. ఇట్లా రైతు ఆందోళనలకు సంఘీభావం వేగంగా విస్తరించింది. అప్పుడు, వారిపై ఎన్ని రకాల దాడులు జరిగాయో? భారతదేశాన్ని అప్రదిష్ట పాలుచేయడానికి విదేశీయులు కంకణం కట్టుకున్నారని, వారికి స్వదేశీ ద్రోహులు కూడా తోడయ్యారని శాపనార్థాలు పెట్టారు. రిహన్నా వంటి జనాదరణ కలిగిన కళాకారిణి బహిరంగంగా చేసిన విమర్శ, భారత ప్రభుత్వ పెద్దలను, వారిని అన్ని రంగాలలోను సమర్థించే అభిమానులను కుదిపివేసిందనే చెప్పాలి. ఆ తరువాత కొద్దిరోజులకే రిహన్నా పోస్ట్ చేసిన తన అర్ధనగ్న ఛాయాచిత్రం వివాదాస్పదంగా ఉండడంతో, రాజకీయ, ఉద్యమ వివాదాల వేడి చల్లారిపోయింది. అప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, విస్మరించడమే ఎదురుదాడితో సమానం అని ప్రస్తుతం భావించి ఉంటారు. 


ఇంతకీ, నరేంద్రమోదీ నియంత అవునా కాదా? ఆయనను మించిన ప్రజాస్వామ్యవాది ఈ దేశానికి ఇంతవరకు ప్రాప్తించలేదన్న అభిప్రాయం నిలబడేదేనా? సన్‌సద్ టీవీ వారు తాము అడిగే ప్రశ్నలకు ముందే అనుమతి తీసుకుని ఉంటారు, లేదా, ఉభయులూ అంగీకరించిన ప్రశ్నలే ఆ ఇంటర్వ్యూలో అడిగి ఉంటారు. నరేంద్రమోదీ నియంత అవునా కాదా అన్న ప్రశ్న జనం నోళ్లలో నానుతోంది కాబట్టే, దానికి సమాధానం ఇవ్వాలని అమిత్ షా సంకల్పించి ఉంటారు. నాలుగు గోడల మధ్య జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రధాని ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తారో, అందరూ చెప్పేది ఎట్లా ఆలకిస్తారో చెప్పడం ప్రధాని ప్రజాస్వామికతను నిరూపించే ఉదాహరణ కాదు కదా? కశ్మీర్‌లోను, ఈశాన్యంలోనూ చేసినదానికి హోంమంత్రిని దక్షుడని, సమర్థుడని జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ ప్రశంసిస్తారు. ఆ పదవిలో ఉండి, అట్లా మాట్లాడవచ్చా? దేశంలో నెలకొని ఉన్న భావవాతావరణం, అసమ్మతితో, అభిప్రాయభేదంతో వ్యవహరించే పద్ధతి, చట్టాలను, న్యాయప్రక్రియలను వినియోగించుకునే తీరు, ప్రజాస్వామిక నిరసనలకు ఇచ్చే స్పందనలు.. వీటన్నిటిని బట్టి ప్రజాస్వామిక పాలనలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అంచనా వేయవచ్చు. నియంతృత్వం అన్న మాట కూడా ప్రస్తుత పాలనకు సరిపోదని, తీవ్ర జాతీయవాద ఉద్వేగాలతో అత్యధిక జనామోదాన్ని సాధించుకుని, దాని సాయంతో వ్యతిరేకులపై, మైనారిటీ శ్రేణులపై కర్కశంగా వ్యవహరించే ఫాసిజం అన్న పేరే వర్తమాన అధికార స్వభావానికి సరిపోతుందని వాదించేవారు కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నియంత అన్న అభిప్రాయం ఎవరికైనా కలిగిందంటే అందుకు ఏవో వాదనలు ఉంటాయి. వాటిని పూర్వపక్షం చేయడానికి ప్రయత్నిస్తే సబబుగా ఉండేది. అయినా, అమిత్ షా సాక్ష్యం మోదీకి ఎట్లా కిరీటం అవుతుంది? ఇద్దరూ ఒకటే అని లోకానికీ తెలుసు, వారిద్దరికీ కూడా తెలుసు.


అమిత్ షా ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు వచ్చింది? లఖింపూర్ ఖేరీ సంఘటన అలజడిలో ప్రధాని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నప్పుడు వచ్చింది. నలుగురు రైతులను వాహనాలతో తొక్కి చంపిన సంఘటనను మోదీ వెంటనే ఖండించి ఉండాలి. ఈ దేశంలో సామాన్యుల విషయంలో ఎట్లా జరుగుతుందో అట్లాగే, రుజువుల కోసం చూడకుండా, అనుమానితులను వెంటనే అరెస్టు చేసి ఉండవలసింది. ఇవి చేయకపోవడం ఒక ఎత్తు. సంఘటన జరిగిన స్థలానికి సమీపంలో పర్యటించి వెళ్లిపోవడం మరొక ఎత్తు. దీన్ని ప్రజాస్వామ్యం అని కానీ, ప్రజల మాటను ఆలకించడం అని కానీ అనడం కష్టం. ఇంతటి ఘోరంతో ఏదో రకంగా సంబంధం ఉన్న మంత్రిని ఇంకా తన సహచరుడిగానే గుర్తించడం ప్రజాభీష్టాన్ని ఖాతరు చేయబోనని బాహాటంగా చెప్పడమే కదా? 


మన దేశం గురించి బయటివాళ్లు మాట్లాడడమేమిటి? అన్న జాతీయవాద తర్కం ప్రత్యక్షం కావచ్చు. మనం కూడా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల గురించి మాట్లాడి, పోరాడిన రోజులు ఉన్నాయి. కొన్ని దేశాలను బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే, మన గురించిన తీర్పులు కూడా బయటివారు ఇవ్వవచ్చు. అయినా, ప్రపంచీకరణను ఆమోదించేవారికి, ఒంటరి జాతీయ ద్వీపవాసం ఎట్లా కుదురుతుంది? అంతర్గత వ్యవహారాలనేవి అంతరించిపోయి, అన్నిటి తలుపులూ తెరవడమే కదా ఇప్పటి సిద్ధాంతం! కాబట్టి, మన ప్రజాస్వామ్యం నాణ్యత కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో గీటురాయి గీతకు నిలబడవలసిందే. ఈ ఏడాది మార్చిలో స్వీడన్‌కు చెందిన వి-డెమ్ అనే స్వతంత్ర పరిశోధనా సంస్థ, ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు మన దేశ ప్రజాస్వామ్యాన్ని కూడా మదింపు వేసి, పెదవి విరిచింది. భారత్ ప్రజాస్వామ్య దేశం అనే గుర్తింపు కోల్పోవడానికి ఎక్కువ రోజులు పట్టదని వ్యాఖ్యానించింది. ట్రంప్‌ మళ్లీ గెలవాలని ఆశించిన మోదీతో ఎట్లా మాట్లాడగలుగుతున్నావు- అంటూ అమెరికన్ పత్రికలలో బైడెన్‌ను ప్రశ్నిస్తున్నారు కొందరు. అతి పెద్ద విభజన కారుడు- అని శీర్షికతో టైమ్ పత్రిక ముఖచిత్ర కథనమే చేసింది. ఆ దేశాల వారికి, బయటి వ్యాఖ్యాతలకు అన్నివేశలా సదుద్దేశాలే ఉంటాయని నమ్మనక్కరలేదు. కానీ, ఇంట్లోనే కాదు, బయట కూడా ఈగల మోత ఎక్కువవుతున్నదని ఏలినవారు గుర్తించాలి కదా! 


ప్రధాని నియంతా కాదా అన్న ప్రశ్న కంటె దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఉంటుందా అన్నవి సూటి ప్రశ్నలు. ఎన్నికలు జరుగుతున్నంత మాత్రాన, ప్రజలు తమంతట తాము పోలింగులో పాల్గొంటున్నంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాదు. అపహసించడానికి ఆస్కారమున్న అన్ని అవలక్షణాలనూ మన వ్యవస్థ మోస్తూనే ఉన్నది!

కె. శ్రీనివాస్

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...