బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది.. ఆవేదనను వెళ్లగక్కిన చైనా మహిళ

ABN , First Publish Date - 2020-04-07T22:53:51+05:30 IST

కొవిడ్-19 చైనాలో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. చైనాలో మొదలైన ఈ మహమ్మారి నేడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం

బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది.. ఆవేదనను వెళ్లగక్కిన చైనా మహిళ

న్యూయార్క్: కొవిడ్-19 చైనాలో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. చైనాలో మొదలైన ఈ మహమ్మారి నేడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య పదివేలు దాటింది. ఈ సంఖ్య రెండు నెలల్లో లక్షకు చేరే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికన్లు చైనాపై, చైనా దేశస్థులపై గుర్రుగా ఉన్నారు. చైనా వల్లే అమెరికాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ తమ కోపాన్ని వెల్లగక్కుతున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కరోనా వైరస్‌ను చైనీస్ వైరస్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అమెరికన్లకు చైనీయులంటే మరింత ద్వేషం పెరుగుతోంది. అమెరికాలో కనిపించిన చైనీయులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందంటూ.. అమెరికాలో నివసిస్తున్న ఓ చైనా మహిళ తన ఆవేదనను వెళ్లగక్కింది. 


ఇటీవల నలుగురు అమెరికన్ యువతులు అన్నా ఎన్‌జీ(51) అనే చైనాకు చెందిన మహిళపై దాడికి పాల్పడ్డారు. ఒక యువతి అన్నా తలపై గొడుపు పెట్టి కొట్టడంతో.. అన్నాకు నాలుగు కుట్లు కూడా పడ్డాయి. న్యూయార్క్‌లోన బ్రాంక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పని ముగించుకుని బస్‌ కోసం వేచి చూసే సమయంలో నలుగురు యువతులు తనను ఆపారని, తన స్వదేశం చైనానేనా అని అడిగారని అన్నా తెలిపింది. తాను అవునని సమాధానమిచ్చానని, వెంటనే తనను కరోనా వైరస్ అంటూ పిలవడం మొదలుపెట్టారని పేర్కొంది. అనంతరం తనతో పాటు బస్ ఎక్కారని అన్నా వివరించింది. బస్ ఎక్కిన తరువాత కూడా చైనీస్ వైరస్ అని పిలుస్తూ జాత్యంహకారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. 


తమ స్టాప్ రాగా.. నలుగురు యువతుల్లో ఒక యువతి గొడుగుతో తలపై కొట్టి వెళ్లిపోయిందని అన్నా వివరించింది. తాను ఏడుస్తున్నా పట్టించుకోకుండా చైనీస్ వైరస్ అని పిలుస్తూనే ఉన్నారని తెలిపింది. ఆసుపత్రికి వెళ్లగా నాలుగు కుట్లు వేశారని పేర్కొంది. ఈ ఘటన తరువాత తనకు, తన పిల్లలకు బయటకు వెళ్లాలంటనే భయమేస్తోందని అన్నా ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన నలుగురిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. కరోనా అంశం మొదలైన నాటి నుంచి అమెరికా వ్యాప్తంగా అనేక మంది చైనీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ అధ్యక్షుడు కూడా చైనీస్ వైరస్ అని పిలుస్తుండటం.. అమెరికన్లలో మరింత కసిని పెంచుతున్నట్టు కనపడుతోంది.



Updated Date - 2020-04-07T22:53:51+05:30 IST