రైతు రుణమాఫీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-07-29T04:51:44+05:30 IST

రుణమాఫీ సకాలంలో అమలుకాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2020లో రుణమాఫీ ప్రక్రియను రూపొందించినప్పటికీ అమలులో ఎడతెగని జాప్యం జరుగుతోంది.

రైతు రుణమాఫీ ఎప్పుడు?

- రైతుల్లో పెరుగుతున్న దిగులు

- 64,471మంది మందిలో 8767 మందికి అమలు

- ఇంకా పూర్తి కాని మొదటి, రెండో విడతలు

పెంచికలపేట, జూన్‌ 28: రుణమాఫీ సకాలంలో అమలుకాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2020లో రుణమాఫీ ప్రక్రియను రూపొందించినప్పటికీ అమలులో ఎడతెగని జాప్యం జరుగుతోంది. లక్ష  రూపాయల లోపు పంట రుణాలను నాలుగు విడతల్లో నాలుగేళ్ల లోగా మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. గతేడాది చేపట్టిన మొదటి విడతలోనూ 200 మంది రైతులకు వర్తించకపోగా ఈ ఏడాది రెండో విడతలోనూ అదే పరిస్థితి నెలకొంది. బ్యాంకురుణాలు మాఫీ కాకపోవడంతో వడ్డీ పెరగడంతో పాటు రైతులకు కొత్త రుణాలు అందడం లేదు. దీంతో ఎప్పటిలాగే సాగు పెట్టబడి కోసం అధిక వడ్డీ చెల్లించి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 

2014నుంచి 2018 వరకు

2014 ఏప్రిల్‌ నుంచి 2018డిసెంబరు 13వరకు రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీచేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. అయితే ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 2018నుంచి బ్యాంకర్లు రైతుల నెత్తిన వడ్డీభారం మోపుతున్నారు. జల్లాలో మొత్తం 64,471మంది రైతులకు సంబంధించిన సుమారు రూ.399 కోట్ల రుణ మాఫీ కావాల్సి ఉండగా అందులో 8767 మందికి సంబంధించిన రూ.33.37కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. ఈ లెక్కన ఇంకా 55,704మంది రైతులకు చెందిన రూ.365.63 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 

ప్రారంభమే ఆలస్యం..

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తొలి విడతలో రూ.25 వేలు లోపు, రెండో విడతలో రూ.50వేల లోపు, మూడో విడతలో రూ.75వేల లోపు, నాల్గో విడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయను న్నట్లు చెప్పారు. కానీ తొలివిడతలో రుణమాఫీ 2020డిసెంబరు నుంచి మొదలు పెట్టగా ఇంకా కొనసాగుతోంది. మాఫీ ప్రక్రియను 2019లో ప్రారంభించి ఉంటే ఇప్పటివరకు సగం అయినా పూర్తయ్యేది, మొదటి విడతలో రూ.25వేలకు సంబంధించి కొంతమంది అర్హులకు అందగా రెండో విడతలో మరికొందరికి అందింది. రెండో విడత రూ.50వేల లోపు రుణ మాఫీ ప్రక్రియను 2021ఆగస్టు 16నుంచి 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రెండో విడత ఎంతమంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందోనన్న లెక్కలు వ్యవసాయాధికారుల వద్ద కూడా లేవు.

అధికారులేమంటున్నారంటే..

రుణ మాఫీ నగదు నేరుగా ప్రభుత్వమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు. రెండో విడతకు సంబంధించి ఇంకా బ్యాంకర్ల నుంచి సమాచారం అందలేదన్నారు. నాలుగు విడతల్లో ప్రభుత్వం మాఫీ ప్రక్రియను నిర్వహిస్తోంది. రూ.25వేలు, రూ.50 వేలు, రూ.75వేలు, రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారని ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 

ఇంకా మాఫీ కాలేదు

- బుజాడి సత్తయ్య, ఒడ్డుగూడ

బ్యాంకులో పంటల పెట్టుబడికి రూ.50వేలు రుణం తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ప్రకటించింది. బ్యాంకుకు వెళ్తే మాఫీ కాలేదని వడ్డీ కట్టాలని అంటున్నారు. రుణమాఫీ అయితే వడ్డీ కట్టి మళ్లీ రుణం తీసుకుందామని చూస్తున్నా.

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న..

- మండిగ శంకరయ్య, గుంటపేట్ల

రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకులో కొత్తరుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధికవడ్డీకి అప్పు చేసి పంట లకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం రుణమాఫీ చేస్తే బ్యాంకులో కొత్తగా పంట రుణాలు తీసుకుందామనుకుంటున్నా. 

Updated Date - 2022-07-29T04:51:44+05:30 IST