Abn logo
Sep 22 2021 @ 23:38PM

పురపోరు ఎప్పుడో?శ్రీకాకుళం కార్పొరేషన్‌ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు

రాజాం మునిసిపాల్టీకీ గ్రీన్‌సిగ్నల్‌

ఆమదాలవలసకు మాత్రం ఇప్పట్లో లేనట్టే

రెండో విడత ఎలక్షన్‌కు నేతల ఎదురుచూపు

(రాజాం రూరల్‌)

జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌, రాజాం మునిసిపాల్టీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో మార్గం సుగమమైంది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆమదాలవల మునిసిపాల్టీ విషయంలో వార్డుల విభజన చిక్కుముడి వీడలేదు. దీంతో అక్కడ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఇప్పటికే తొలి విడతగా ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి ఎన్నికలు పూర్తయ్యాయి. పాలకవర్గాలు కొలువుదీరాయి, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పుర ఎన్నికలు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో శ్రీకాకుళం కార్పొరేషన్‌, రాజాం మునిసిపాల్టీ ఎన్నికలకు చకచకా అడుగులు పడుతున్నాయి. 

శ్రీకాకుళం నగర పాలక సంస్థగా రూపాంతరం చెందిన తరువాత అసలు ఎన్నికలే జరగలేదు. మునిసిపాల్టీగా ఉన్న శ్రీకాకుళంను కార్పొరేషన్‌గా మార్చారు. కానీ సమీప పంచాయతీల విలీన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కుముడులు ఉండడంతో ఎన్నికలు మాత్రం జరగలేదు. శ్రీకాకుళం  రూరల్‌ మండలంలోని పెదపాడు, పాత్రునివలస, చాపురం, ఖాజీపేట, కిల్లిపాలెం, ఎచ్చెర్ల మండం కుశాలపురం, తోటపాలెం పంచాయతీలను శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీసం చేశారు. దీంతో అక్కడ డివిజన్ల సంఖ్య 50కు చేరుకుంది. ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,51,521 మంది ఓటర్లున్నారు. ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, బీసీలకు 17, మహిళలు (జనరల్‌) 15, అన్‌ రిజర్వుడ్‌ 12 కార్పొరేటర్‌ స్థానాలను కేటాయించారు.  ఎన్నికల ప్రకటన వెలువడడమే తరువాయి అన్నట్టు ఇక్కడ ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. 

 రాజాం మున్సిపాలిటీలో.. 

రాజాం మునిసిపాల్టీలో కూడా ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. 2005లో మేజర్‌ పంచాయతీగా ఉన్న రాజాంను నగర పంచాయతీగా మార్చారు. సమీప ఐదు పంచాయతీలను విలీనం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొత్తవలస, కొండంపేట, పొనుగుటివలస పంచాయతీల సర్పంచ్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరులో వివాదానికి పరిష్కార మార్గం చూపిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నగర పంచాయతీని థర్డ్‌ గ్రేడ్‌ మునిసిపాల్టీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకూ 20 వార్డులుండగా...24కు పెంచి రిజర్వేషన్లు సైతం ఖరారు చేసింది. ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, బీసీలకు 8, జనరల్‌కు 7, ఇతరులకు 5 వార్డులను కేటాయించారు. ఎన్నికలకు అడుగులు పడుతుండడంతో ప్రధాన రాజకీయ పక్షాల్లో సందడి ప్రారంభమైంది. ఆశావహులు టిక్కెట్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అనధికారికంగా తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు.

 ఆమదాలవలసలో నో ఛాన్స్‌

ఆమదాలవలస మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక్కడ వార్డుల విభజనలో తలెత్తిన వివాదం కొనసాగుతోంది. రెండో గ్రేడ్‌ మునిసిపాల్టీగా  ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో 23 వార్డుల నుంచి 27కు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధికారుల నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన బోర గోవిందరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వార్డుల విభజన పక్షపాత రహితంగా చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ నేపఽథ్యంలో మరోమారు చేపట్టిన విభజనలో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల ఊసే లేకుండా పోయింది. 


111111111111111111111111111111111111