Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లాలో ప్రాజెక్టు పనులకు మోక్షమెప్పుడో?

-పూర్తికాని జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణం

-కుమరం భీం ఎడమ కాల్వకు ప్రారంభంలోనే అడ్డంకులు

-ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు అధికారుల కసరత్తు

-త్వరగా పనులు పూర్తి చేయాలంటున్న రైతులు

కాగజ్‌నగర్‌, డిసెంబరు 3: సిర్పూరు నియోజకవర్గంలోని జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణం, కుమరం భీం ప్రాజెక్టు ఎడమ కాల్వల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కావడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనుల విషయంలో తుది నివేదికలను రూపొందించారు. అలాగే కుమరం భీం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులు త్వరితగతిన కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ను తప్పించి ప్రత్యామ్నాయంగా మరొకరికి అప్పజెప్పేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు పనులు పూర్తికాక పోవడంతో ఈ ప్రాంత రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. ఈ ప్రాజెక్టులతో పంటలు పండించేందుకు అవకాశాలు న్నప్పటికీ కూడా అధికారుల ముందుచూపు లేకపోవడంతో సిర్పూరు నియోజక వర్గంలోని వివిద గ్రామాల రైతులు ఇప్పటికీ వర్షాధార పంటలపైనే ఆధారప డాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో అధికారులు తుది నివేదికలు రూపొందించారు. వీటి విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకు నేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

కుమరం భీం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులపై దృష్టి..

ఆసిఫాబాద్‌ అడ వద్ద కుమరం భీం ప్రాజెక్టు రూ.425 కోట్ల వ్యయంతో 2009లో ప్రారంభించి పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. అయితే కాల్వల నిర్మాణం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. సిర్పూరు నియోజకవర్గానికి ఎంతగానో ఉపయోగపడే ఎడమ కాల్వపై ఇక్కడి రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. కొమురం భీం ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వ పనులు ప్రస్తుతం సిర్పూరు(టి) మండలంలోని వేంపల్లి వరకు వచ్చింది. పనులు పూర్తిగా నత్తనడక జరుగుతుండటంతో రైతులు ఆగ్రహిస్తున్నారు. వాస్తవంగా ఆసిఫాబాద్‌ అడ ప్రాజెక్టు మీదుగా ఎడమ కాల్వ కాగజ్‌నగర్‌ మండలంలో చేపట్టాల్సి ఉండగా ఈ పనులకు అటవీశాఖ అధికారుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. దీంతో ఈ పనులు ప్రారంభంలోనే బ్రేక్‌ పడింది. చివరకు పూర్తి స్తాయిలో ప్రక్రియలు, సర్వేలు ఇతర కార్యక్రమాలు జరిగిన తర్వాత పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. పనులు గత రెండేళ్ల నుంచి ప్రారంభించారు. అయితే పనులు చేపట్టే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లింపులు కాకపోవడంతో పనులు నత్తనడకనే చేస్తున్నట్టు సమాచారం. అయితే అధికారులు ఈ విషయంలో ప్రస్తుతం పనులు చేపడుతున్నట్టు కాంట్రాక్టర్‌ను తప్పించి మరో కాంట్రాక్టర్‌తో చేపట్టేందుకు శ్రీకారం చుడు తున్నట్టు తెలిసింది. ఇందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు పంపించినట్టు సమాచారం. 

ముందుచూపు లేకపోవడంతోనే..

-దేశ్‌ముఖ్‌ శ్రీనివాస్‌, కాగజ్‌నగర్‌ 

సిర్పూరు నియోజకవర్గంలో పూర్తిగా వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కుమరం భీం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కాల్వలు ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పురోగతి లేదు. కొమురం భీం ప్రాజెక్టు కాల్వ పరిస్థితి అలానే ఉంది. 2009లో ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే కాల్వలు నిర్మాణం నేటికీ కొనసాగుతోంది. ఇక జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు తీరు మాత్రం దారుణమైంది. 

ఏళ్లు గడుస్తున్నా ఇదే దుస్థితి..

-గుళ్లపల్లి ఆనంద్‌, కాగజ్‌నగర్‌ 

సిర్పూరు నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టు పరిస్థితి అధ్వానంగా ఉంది. కుమరం భీం ప్రాజెక్టు కాల్వ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు కాల్వలు పరిస్థితి అలాగే ఉంది. ఏటా దేవుడిపై భారం వేసి కాలం గడపాల్సిన పరిస్థితి. అధికారులు స్పందించి పనులు వేగంగా చేపడితే మేలు జరుగుతుంది.

Advertisement
Advertisement