క్యాంపు కార్యాలయానికి మోక్షమెప్పుడో...?

ABN , First Publish Date - 2022-06-20T05:46:28+05:30 IST

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు.

క్యాంపు కార్యాలయానికి మోక్షమెప్పుడో...?
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించే స్థలం ఇదే

-  నిధులు మంజూరై ఐదేళ్లు.. భూమిపూజ చేసి ఏడాదిన్నర

-  ఇప్పటికీ మొదలు కాని నిర్మాణ పనులు

-  ఇబ్బందులు పడుతున్న ప్రజలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నిధులు మంజూరై ఐదేళ్లు కాగా, నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటివరకు పనులు మొదలుకాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పనులు కాకపోవడంతో ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తొలి విడతలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగింది. ఎమ్మెల్యేలను ప్రజలు సులువుగా కలిసేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో గానీ, మరోచోట గానీ క్యాంపు కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు 10 నుంచి 20 గుంటల భూమిని సేకరించారు. 2017లో ఒక్కో భవనానికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరుచేసింది. అదే ఏడాది టెండర్లను కూడా ఆహ్వానించింది. 

అడుగడుగునా ఆటంకాలు..

జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజక వర్గాలకు భవనాలు మంజూరయ్యాయి. రామగుండం, మంథని నియో జవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలను 2018లోనే పూర్తిచేశారు. అప్పటి ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధూకర్‌లు అక్కడి నుంచే పాలన సాగించారు. పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో మాత్రం భవన నిర్మాణాన్ని చేపట్టలేదు. ఇక్కడ భవన నిర్మాణానికి రైల్వేస్టేషన్‌ రోడ్డులో గల గోశాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలాన్ని అప్పటి కలెక్టర్‌ భవనానికి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఇది గోశాల స్థలమని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదని దేవాదాయ శాఖ లీగల్‌ నోటీసులు జారీ చేసింది. ఇంతలో 2018లో సీఎం కేసీఆర్‌ సెప్టెంబర్‌లో ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి రెండవసారి గెలుపొందారు. కొద్దిరోజుల తర్వాత ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకు అయ్యప్ప దేవాలయం వద్దగల వ్యవసాయ శాఖ గోదాం స్థలాన్ని క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించింది. అయినా నిర్మాణం చేపట్టకపోవడంపై 2019 డిసెంబర్‌లో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో 2020 జనవరి 8వ తేదీన భవన నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో భూమిపూజ చేయించారు. కానీ పనులను మాత్రం చేపట్టలేదు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం గానీ, రేషన్‌ కార్డులు, పింఛన్ల మంజూరు కోసం గానీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల మంజూరు కోసం ఎక్కువ మంది ఎమ్మెల్యే కోసం వస్తుంటారు. భవనం పూర్తి చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేను కలిసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

డిజైన్‌ మార్పు వల్లనే..

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రభుత్వం రూపొందించిన భవన నిర్మాణ డిజైన్‌లో గాకుండా అందులో కొన్ని చేర్పులు, మార్పులు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారని సమాచారం. సంబంధిత అధికారులు చేర్పులు, మార్పులు చేసి ఆమోదం కోసం పంపించారు. కానీ దానికి ఆమోదం లభించనట్లు తెలుస్తున్నది. మొదట డిజైన్‌ చేసిన భవన నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించారు. ఆ డిజైన్‌ ప్రకారం కూడా భవనాన్ని నిర్మించేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు వచ్చే సూచనలు కనబడడం లేదు. ఐదేళ్ల క్రితం రూపొందించిన అంచనాలకు, ప్రస్తుత అంచనాలకు తేడా ఉంటుంది. అప్పటి ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రకారం అంచనాలు రూపొందించారు. కొత్త ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రకారమైతే కాంట్రాక్టర్‌ ముందుకు వచ్చే అవకాశాలుంటాయి. ఏడాది క్రితం భూమి పూజ చేసినప్పుడు పాత డిజైన్‌ ప్రకారమే అయితే భవన నిర్మాణం పూర్తయి ఉండేది. డిజైన్‌ మార్పు వల్లనే ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తున్నది. అక్కడ భవన నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ స్థలం మందు బాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై రోడ్లు భవనాల శాఖ ఈఈ నర్సింహాచారిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, భవన నిర్మాణ డిజైన్‌లో కొన్ని చేర్పులు, మార్పులు చేశామన్నారు. దానికి ఆమోదం లభించిన తర్వాత పనులు ప్రారంభిస్తామని, లేకుంటే పాత డిజైన్‌ ప్రకారం పనులు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2022-06-20T05:46:28+05:30 IST