రెండో డోసు ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-04-19T04:55:38+05:30 IST

‘కొవిడ్‌ టీకా వేసుకున్న వారు నాలుగు వారాల్లో రెండో డోసు వేసుకోవాలి. లేకుంటే వ్యాక్సిన్‌ పనితీరుపై ప్రభావం చూపుతుంది’..అంటూ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ 28 రోజులు దాటుతున్నా రెండో దశ వ్యాక్సిన్‌ ఇంతవరకూ వేయలేదు. వేలాది మందికి ఎదురుచూపులు తప్పడం లేదు.

రెండో డోసు ఎప్పుడు?



రెండో డోసు ఎప్పుడు?

ఎదురుచూస్తున్న వేలాది మంది

తొలి డోసు వేసుకొని 28 రోజులు దాటడంతో ఆందోళన

ఫర్వాలేదని చెబుతున్న అధికారులు

మార్గదర్శకాలు మారాయని వెల్లడి

సాలూరు రూరల్‌:

‘కొవిడ్‌ టీకా వేసుకున్న వారు నాలుగు వారాల్లో రెండో డోసు వేసుకోవాలి. లేకుంటే వ్యాక్సిన్‌ పనితీరుపై ప్రభావం చూపుతుంది’..అంటూ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ 28 రోజులు దాటుతున్నా రెండో దశ వ్యాక్సిన్‌ ఇంతవరకూ వేయలేదు. వేలాది మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. తాత్సారం జరుగుతుండడంతో తొలి డోసు వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలినాళ్లలో వ్యాక్సిన్‌ పట్ల ప్రజలు పెద్దగా ఆసక్తిచూపలేదు.  ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సైతం పూర్తిస్థాయిలో వేసుకోలేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ భయంతో చాలామంది విముఖత చూపారు. కానీ కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతమవుతున్న వేళ కేసులు గణనీయంగా పెరిగాయి. మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్‌కు డిమాండ్‌ ఏర్పడింది.  తొలుత జిల్లాకు 1,45,500 కొవిషిల్డ్‌, 49,280 కోవాగ్జిన్‌ డోస్‌లు వచ్చాయి. ఈ నెల రెండో వారంలో టీకా ఉత్సవ్‌ నాటికి దాదాపు అన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్లు నిండుకున్నాయి.


మాట మార్చుతున్న అధికారులు

 గత నెలలో తొలి డోసు వేసుకున్న వేలాది మంది రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. తొలుత నాలుగు వారాల్లో రెండో డోసు తీసుకోవాలని చెప్పిన వైద్యవర్గాలు ఇప్పుడు మాట మారుస్తున్నాయి. 28 రోజులు దాటినా ఫర్వాలేదని..సరికొత్త మార్గదర్శకాలు వచ్చాయని చెప్పుకొస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేసుకున్న వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాకు తాజాగా 21,300 కొవిషిల్డ్‌ డోసులు, 5000 కోవాగ్జిన్‌ డోసులు చేరుకున్నాయి. వీటిని ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌తో పాటు తొలి విడత వారికే ప్రాధాన్యమివ్వనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రెండో డోసు ఇప్పట్లో లేనట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీనిపై డీఎంహెచ్‌ఎం ఎంవీ రమణకుమారి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. తాజాగా వచ్చిన డోసులు తొలి విడత వ్యాక్సిన్లు వేసుకున్న వారికే ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలిపారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. 28 రోజులు దాటినా ఫర్వాలేదని..ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. 



Updated Date - 2021-04-19T04:55:38+05:30 IST