Abn logo
Sep 19 2021 @ 01:17AM

పంటభూముల జోలికి వస్తే ఊరుకోం

 మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి  

మిర్యాలగూడ, సెప్టెంబర్‌ 18: పారిశ్రామికపార్క్‌ ఏర్పాటు పేరుతో పంటభూముల జోలికి వస్తే ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం ఆలగడపలో జాలుబాయి తండా, రాయినిపాలెం గ్రామాలకు సంబంధించిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 606 సర్వేనెం. 413 మంది రైతులకు సంబంధించిన 421 ఎకరాల పంట భూములను రైతుల అంగీకారం లేకుండా బలవంతంగా భూసేకరణ చేపట్టడం సరైంది కాదన్నారు. ఎటువంటి సమాచారం లేకుండా భూములను సేకరిస్తున్నట్లు గ్రామ పంచాయితీలో లిస్ట్‌ ప్రకటించడం, సాగు భూమల నుంచి పేదలను వెళ్లగొట్టాలను కోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. దీనిని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరారు. పేద రైతులకు సంఘీభావంగా పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులతో కలిసి రైతాంగ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు,  రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,  కాంగ్రేస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డివైఎఫ్‌ఐ నాయకులు రవినాయక్‌,ఎంపీటీసి జగ్గారెడ్డి, వెంకన్నగౌడ్‌, కౌన్సిలర్‌ వెంకన్న, మంగారెడ్డి గోవిందరెడ్డి, నాగేందర్‌, రైతులు బిక్షం, చంద్రయ్య, పట్టేటి వెంకటయ్య, వెంకయ్యనాయక్‌ పాల్గొన్నారు.

మిర్యాలగూడ అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల భూములను పారిశ్రామిక వాడలు, సెజ్‌లపేరిట లాక్కోవడం సరికాదని బీసీ సంక్షేమసంఘం కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్‌ అన్నారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికపార్కు పేరుతో ఆలగడప, జాలుబాయితండ, రాయినిపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలోని సర్వేనెంబర్‌ 413, 421, 606లలో సాగవుతున్న వ్యవసాయ భూములను సేకరించడం అన్యాయమన్నారు. గ్రామసభ నిర్వహించి రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ జరిపి రైతులపొట్టగొట్టే ప్రయత్నం మానుకోవాలని కోరుతూ సీఎస్‌ సోమే్‌షకుమార్‌కు ఈమెయిల్‌ ద్వారా లేఖపంపినట్లు తెలిపారు.