‘మొక్క’వోని దీక్షకు వేళాయే..

ABN , First Publish Date - 2021-06-18T06:16:28+05:30 IST

మొక్కవోని దీక్షగా హరితహారంలో మొక్కలు నాటడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

‘మొక్క’వోని దీక్షకు వేళాయే..
జిల్లాలోని నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు

- హరిత సందడికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం

- ఏడో విడత లక్ష్యం 48.58 లక్షల మొక్కలు 

- 26 శాఖలకు టార్గెట్‌

- నర్సరీల్లో 64.44 లక్షల మొక్కలు సిద్ధం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మొక్కవోని దీక్షగా హరితహారంలో మొక్కలు నాటడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈసారి రుతుపవనాలు సకాలంలోనే జిల్లాను పలకరించినా, ఏడో విడత హరితహారానికి కరోనా ఎఫెక్ట్‌ భయపెడుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే హరితలక్ష్యాన్ని సాధించడానికి అధికారులు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు, అటవీ ప్రాంతాల్లో 26 శాఖల ద్వారా హరిత లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సన్నద్ధమయ్యారు. ఈసారి హరితహారంలో 48.58 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని నర్సరీల్లో గ్రామీణాభివృద్ధిశాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. 255 నర్సరీల్లో 64.44 లక్షల మొక్కలను పెంచారు.  గ్రామ పంచాయతీల పరిధిలోనే నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా మొక్కల సరఫరాకు కూడా ఇబ్బందులు లేకుండా పోయింది. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సారి పకడ్బందీగా మొక్కలను పెంచే విధంగా దృష్టి పెట్టారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లను సమకూర్చడంతో వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పోయడం, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మొక్కలను తొలగించినా, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడంతో ఎక్కువ మొక్కలు బతికే అవకాశం ఉంది. పూల మొక్కలు, పండ్ల మొక్కలు నీడనిచ్చే చెట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరంలో 52.73 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా 41.45 లక్షల మొక్కలు నాటారు. ఇందులో ఉపాధిహామీ కింద 25.96 లక్షల మొక్కలు, పల్లె పకృతివనం ద్వారా 5.09 లక్షలు, గృహాల్లో 10.38 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో ఉపాధిహామీ కింద నాటిన మొక్కల్లో 92.06 శాతం బతికాయి. 

- హరిత టార్గెట్‌ 48.58 లక్షలు.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడో విడత హరితహారం లో 48.58 లక్షల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.  ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 35 లక్షలు, అటవీ శాఖ ద్వారా 1.65 లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 5.30 లక్షలు, ఎక్సైజ్‌ శాఖ ద్వారా 1.75 లక్షలు, ఇతర శాఖల ద్వారా 4.93 లక్షలు మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం 64.44 లక్షల మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రేజింగ్‌లో 51.48 లక్షలు, కన్వర్షన్‌లో 4.64 లక్షలు, మెయింటనెన్స్‌లో 8.38 లక్షలు ఉన్నాయి. 

బోయినపల్లి మండలంలో 23 నర్సరీల్లో 5.1 లక్షల మొక్కలు, ఇల్లంతకుంట మండలంలో 33 నర్సరీల్లో 6.55 లక్షలు, చందుర్తి మండలంలో 19 నర్సరీల్లో 7.48 లక్షలు, కోనరావుపేట మండలంలో 28 నర్సరీల్లో 7.04 లక్షలు, రుద్రంగి మండలంలో 10 నర్సరీల్లో 2.71 లక్షల మొక్కలు, వేములవాడ అర్బన్‌లో 11 నర్సరీల్లో 2.82 లక్షలు, వేములవాడ రూరల్‌ మండలంలో 17 నర్సరీల్లో 4.46 లక్షలు, గంభీరావుపేట మండలంలో 21 నర్సరీల్లో 5.11 లక్షలు, ముస్తాబాద్‌ మండలంలో 22 నర్సరీల్లో 6.24 లక్షలు, తంగళ్లపల్లి మండలంలో 30 నర్సరీల్లో 6.46 లక్షలు, వీర్నపల్లి మండలంలో 17 నర్సరీల్లో 2.09 లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 7.21 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. 


- మండలాల వారీగా టార్గెట్‌లు 

ఉపాధి హామీలో జిల్లాలో గత సంవత్సరం 27,65,952 మొక్కలు నాటగా 25,46,417 మొక్కలు బతికాయి. ఈ సంవత్సరం ఏడో విడత హరితహారంలో 35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మండలాల వారీ లక్ష్యంలో గంభీరావుపేటలో 3,37,780 మొక్కలు, కోనరావుపేటలో 3,74,917 మొక్కలు, ముస్తాబాద్‌లో 3,69,800 మొక్కలు, తంగళ్లపల్లిలో 3,85,530 మొక్కలు, వీర్నపల్లిలో 2,20,000 మొక్కలు, ఎల్లారెడ్డిపేటలో 4,37,400 మొక్కలు, బోయినపల్లిలో 2,14,000 మొక్కలు, చందుర్తిలో 2,11,450 మొక్కలు, ఇల్లంతకుంటలో 4,62,813 మొక్కలు, రుద్రంగిలో 1,02,550 మొక్కలు, వేములవాడ అర్భన్‌లో 1,45,000 మొక్కలు, వేములవాడ రూరల్‌లో 2,42,760 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


Updated Date - 2021-06-18T06:16:28+05:30 IST