Abn logo
Sep 23 2021 @ 23:43PM

మరి వారికెప్పుడు... ప్రత్యక్ష బోధన!?

దామెర మండలం ఓగులాపూర్‌లోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాల

ఇంకా తెరుచుకోని ఆశ్రమ, గురుకులాలు

వేలాదిమంది విద్యార్థులు ఇళ్లకే పరిమితం

సమర్థంగా అమలుకాని ఆన్‌లైన్‌ బోధన

23 రోజులుగా విజయవంతంగా నడుస్తున్న డే స్కూళ్లు

ప్రభుత్వం స్పందించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు


హనుమకొండ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన మొదలై విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. వసతి గృహాలకు మాత్రం ఇంకా అనుమతి రాకపోవడంతో అవి తెరుచుకోలేదు. దీంతో హనుమకొండ జిల్లాలో 16 వేల మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమవుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై ఇప్పటికే 23 రోజులు అయింది. ఆశ్రమ, గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులే దిక్కవుతున్నాయి. ప్రత్యక్ష తరగతులవల్ల కలిగే ప్రయోజనాలను వారు పొందలేక పోతున్నారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని అందులో చదువుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. వీటి పునఃప్రారంభంపై ఆనిశ్చితి కొనసాగుతోంది. కోర్టు ఇచ్చే అనుమతిని బట్టే అవి తిరిగి మొదలు కావడం ఆధారపడి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఎలాంటి  చొరవ తీసుకున్నట్టు కనిపించడం లేదు. 


ఇబ్బందులు

గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది విద్యార్థులకు టీవీలు, చరవాణులు లేకపోవడం, ఉన్నవారిలో రీచార్జి స్థోమత లేకపోవడంతో పాఠాలు సరిగా వినలేక పోతున్నారు. కొందరు వింటున్నా సరిగా అర్థంకాక ఇబ్బంది పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో చదివే వందల మంది విద్యార్థులకు చదువుతోపాటు వసతి ఉంటుంది. కరోనా కాస్త నియంత్రణలోకి రావడంతో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాఠశాలలు తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. హాస్టళ్లలో  ఉండి చదువుకునే విద్యార్థులు కాకుండా మిగతావారంతా స్కూళ్లకు వెళ్ళి ప్రత్యక్ష తరగతులను వింటున్నారు. ఆశ్రమ పాఠశాలను, హాస్టళ్లను మాత్రం ఇప్పుడే తెరువరాదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు నుంచి ఇప్పటి వరకు ఆదేశాలు రాలేదు. దీంతో గురుకులాల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన మొదలు కాలేదు. ఆన్‌లైన్‌ బోధన మాత్రం కొనసాగుతోంది. దీనితో గురుకులాల విద్యార్థులు చదువులో వెనుకబడే ప్రమాదం ఏర్పడనున్నది. నేరుగా ఉపాధ్యాయులు బోధించే తీరు ఆన్‌లైన్‌లో ఉండదు. ఇదే ఇప్పుడు ఆశ్రమ, గురుకుల విద్యార్ధులకు ఇబ్బందిగా మారింది. నేరుగా బదికి వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వసతి గృహాలపై ఆధారపడిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.


ప్రత్యక్షానికి దూరం

హనుమకొండ జిల్లాలో 36 ఆశ్రమ, గురుకుల పాఠశాలలు ఉండగా, వీటిల్లో 15,996 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కేజీవీబీ పాఠశాలలు 9 ఉన్నాయి. వీటిలో 2,336 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ఒకటి ఉంది. దీనిలో 48 మంది విద్యార్థులు ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలు 3 ఉండగా, వీటిలో 1,687 మంది విద్యార్థులు, బీసీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 10 ఉండగా వీటిలో 4,566 మంది విద్యార్థులు, సాంఘిక్ష సంక్షేమ పాఠశాలలు 10 ఉండగా, వీటిలో 5,266 మంది విద్యార్థులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 2 ఉండగా వీటిలో 286 మంది, ఒక మైనారిటీ ఆశ్రమ పాఠశాలలో 1,807 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. వీటిలో విద్యార్ధులు వసతి పొందుతూ బయట విద్యా సంస్థల్లో చదువులు కొనసాగిస్తున్నారు. వసతిగృహాలు తరచుకోకపోవడం, చరవాణులు లేక అంతర్జాల తరగతులకు దూరమవుతున్నారు. కొందరు సమీప పాఠశాలలకు వెళ్ళి చదువుకుంటున్నారు.


తెరిస్తేనే మేలు

జిల్లాలో పలుచోట్ల స్మార్ట్‌పోన్ల సమస్య ఉంది. సంకేతాలు అందక అవస్థ పడుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులను బోధిస్తున్నా వందశాతం అమలు కావడం లేదు. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు వర్క్‌బుక్‌లను పంపిణీ చేశారు. కానీ పాఠంలో సందేహాలు పరిష్కరించుకోవాలంటే సంబంధిత ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండాలి. ఇది సాధ్యపడాలంటే ఆశ్రమ, గురుకుల పాఠశాలలను తెరవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలను తెరవకపోవడంతో వీటిలో ఉండి చదువుకునే విద్యార్థులు ఇళ్ల వద్ద ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఇంతకు ముందు తరగతి వారీగా టీవీ పాఠాల షెడ్యూల్‌ ఉపాధ్యాయులకు చేరేది. ఈసమాచారాన్ని వారు విద్యార్థులకు అందించేవారు. కొద్ది రోజుల నుంచి పాఠ్యాంశాల సమాచారం ఇవ్వడం మానేశారు. దీంతో వసతి గృహాల విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడుతోంది.