Abn logo
Jul 1 2020 @ 01:48AM

మనోధైర్యం కోల్పోయిన వేళ..

ప్రతి వ్యక్తి తన కోసమే గాక, సమాజం కోసం కూడా పని చేయాలి. అందరి కోసం ఒక్కడు నిలబడాలి, ఒక్కడి కోసం అందరూ నిలబడాలి. మన కాలం సృష్టిస్తున్న ఒత్తిళ్లు, ఆందోళనలు, వ్యాకులతలను అధిగమించేందుకు అదే ఉత్తమ, సరైన మార్గం.


ప్రతిభా సంపన్నుడైన బాలీవుడ్ యువ నటుడు ఒకరు నిరాశా నిస్పృహలతో జీవితాన్ని అంతం చేసుకోవడం నన్ను అమితంగా బాధించింది. ఇంకా ఎంతో జీవితం మిగిలివున్న ఒక యువకుడు, అందునా భౌతిక శాస్త్రంలో జాతీయ ఒలింపియాడ్ విజేత, మెకానికల్ ఇంజనీరింగ్ వృత్తిలో ఉజ్వల భవిష్యత్తును వదులుకొని, జనప్రియ నటుడుగా ఆవిర్భవించి కూడా జీవితాన్ని అలా అంతం చేసుకోవడం జాతి యావత్తుకు తీరని నష్టం. ఆ యువ కళాకారుడు ‘నేషన్ ఇండియా ఫర్ వరల్డ్’ అనే సంస్థను ప్రారంభించదలుచుకున్నాడని, ‘జీనియసెస్ అండ్ డ్రాపవుట్స్’ అనే ఒక సామాజిక ప్రాజెక్టుపై పని చేస్తున్నాడని నేను పత్రికలలో చదివాను.


నైరాశ్యం, వ్యాకులత, అంతరంగిక ఘర్షణ, అర్థంలేని భయం, అనిశ్చితితో జీవితం ఒక్కొక్కప్పుడు నిండి పోతుంది. ఇటువంటి పరిస్థితులు అనేక ఆందోళనకర సంవేదనలకు దారితీసి, వ్యక్తులు తమకుతామే కొత్తగా భావించుకునే వింత మానసికస్థితికి లోను కావడం కద్దు. నవీన జీవనశైలుల మూలంగా తీవ్ర ఒత్తిళ్లకు లోనైన వ్యక్తుల జీవితాలలో ‘పరివేదన’ను నింపడంలో కొవిడ్ ఒక ఉత్ప్రేరకంగా పని చేసింది. ఆధునిక జీవితం ప్రతి ఒక్కరినీ తీవ్ర ఒత్తిళ్లకు లోను చేస్తున్నది. వృత్తి జీవితం లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నవీన సాంకేతికతలతో నిరంతర సంబంధం, సహచరులతో తక్కువ కలివిడి, అధ్యయన ప్రక్రియల కంటే ‘విజయం’ సాధించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం, అంతులేని ఆకాంక్షలు, తక్షణ ఫలితాలకోసం ఆరాటం మొదలైనవి దీనికి ప్రధాన కారణాలు. ఇవన్నీ ఆధునిక జీవి తాన్ని తీవ్ర ఒత్తిళ్ల పాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలను సరైన విధంగా అదుపు చేయనిపక్షంలో మానవ జీవితాలు అంతులేని నిరాశా నిస్పృహల్లోకి జారిపోతాయి.


అర్ధవంతమైన లక్ష్యాలు లేకపోవడం, అనుబంధాలు కొరవడటం నైరాశ్యం, వ్యాకులతకు కారణాలని విక్టర్ ఫ్రాంకెల్ అనే మనో వైజ్ఞానికుడు అభిప్రాయపడ్డారు. ఆయన నాజీ నిర్బంధ శిబిరాలలోని రాక్షసత్వాన్ని తట్టుకుని బతికి బయటపడ్డ వ్యక్తి. జీవితానికి అర్థం కొరవడినప్పుడు జీవితోత్సాహం ఎవరికి ఉంటుంది? అయితే, ఎంత కష్టసమయాల్లోనూ తమ జీవితానికొక అర్థాన్ని కనుగొని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించే సంకల్పంతో జీవించగల శక్తిని వ్యక్తులు సమకూర్చుకోగలరని కూడా ఆయన అన్నారు. మరి, జీవితానికి ఒక అర్థాన్ని కనుగొనడం ఎలా? అర్థవంతమైన జీవితానికి మూలాలు ప్రేమ, పనితో ముడివడివుంటాయి. ఇరుగుపొరుగును, సమాజంలోని సహచరులను ప్రేమించడం ముఖ్యం. సహచర మానవుల పట్ల చూపే ప్రేమే ఒక వ్యక్తిని కార్యాచరణకు పురిగొల్పుతుంది. కుటుంబ సభ్యుల పట్ల, సమాజంలోని వారిపట్ల ప్రేమానురాగాలే ప్రేరణగా మన పనులు, ఆచరణలు ఉన్నప్పుడే మనం జీవితానికి ఒక ప్రభావశీలమైన అర్థాన్ని కనుగొనగలం. ఇతరులకోసం బతకడంలోనే ‘జీవన కళ’ ఉద్భూతమవుతుంది.


వ్యాకులత, విచారం, నైరాశ్యం నుంచి ఉపశమనం పొందడం ఎలా? ఈ విషయమై గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ రచనలలో పలు మానవీయ సూచనలు ఉన్నాయి. ప్రగాఢమైన సామాజిక బాంధవ్యాలు, అనుబంధాలు కలిగివుండడమే మానసిక వైమనస్యతకు విరుగుడు అని రవీంద్రుడు విశ్వసించారు. వంద సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి బారిన పడి విలవిల విలలాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేందుకు, బాధితులు ఆ మహమ్మారిని మనో స్థైర్యంతో ఎదుర్కొనేం దుకు ఆయన ఆ సూచనల నిచ్చారు. ఆ భయంకర వ్యాధి విద్యార్థిలోకంలో తీవ్ర కలవరాన్ని కలిగిస్తుందన్న వాస్తవాన్ని ఆయన గుర్తించారు. అందుకే విద్యార్థుల మధ్య సామాజిక బాంధవ్యాలను పెంపొందించడానికి పూనుకున్నారు. ఇందుకుగాను శాంతినికేతన్‌లో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్లేగు బాధితులు, ఆ వ్యాధి బారినపడనివారి మధ్య ఉల్లాసకరమైన అనుబంధాలను పెంపొందించేందుకు కృషి చేశారు. ఆరోగ్య వంతులుగా ఉన్నవారికి వ్యాధిగ్రస్తులు శత్రువులు కారు, వ్యాధి మాత్రమే విరోధి అని, కనుక పరస్పర ఆత్మీయ సంబం ధాలతో ప్రతి ఒక్కరూ ఆ సంక్షోభం నుంచి బయటపడవచ్చని ఆయన భావించారు. తన కృషిలో ఆయన సఫలమయ్యారు. ప్రస్తుత కరోనా విపత్తు సందర్భంలో కూడా గురుదేవ్ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం ద్వారా మనం ఆ మహమ్మారి సృష్టించిన మానసిక ఆందోళనలను అధిగమించవచ్చు. మరింత స్పష్టంగా చెప్పాలంటే మనం కలిసికట్టుగా వ్యవహరించాలి. రుగ్వేద రుషులు ప్రవచించిన ‘యత్రా విశ్వం భవతి ఏకనిదం’ (ప్రపంచమంతా ఒక గూడు); ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒక కుటుంబం) సత్యాలలో సమున్నత సమష్టి, సమైక్యతా, సహకార జీవన సూత్రాలే అంతర్నిహితమై వున్నాయని గురుదేవ్ నొక్కి చెప్పారు.


పరుల శ్రేయస్సు కోసం అపేక్షతో, స్వార్థరహితంగా కృషి చేయడంలో జీవితానికి అర్థం అన్వేషించాలి. సామాజిక బాంధవ్యాలను నెలకొల్పుకోవడం కూడా చాలా ముఖ్యం. వ్యాకులత, విచారం, నిరాశానిస్పృహల నుంచి బయటపడేందుకు స్పష్టమైన అవగాహనతో, నిరంతర సంభాషణలతో సామాజిక సంబంధాలను పెంపొందించు కోవాలి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా అభ్యర్థన ఏమిటంటే మీలో ఎవరు ఎటువంటి ఒత్తిడి, వ్యాకులత, ఆందోళన ఎదుర్కొంటున్నా మీ స్నేహితులు, బంధువులు లేదా మానవీయ దృక్పథంతో వ్యవహరించే ఉదాత్తుల వద్దకు వెళ్ళి మాట్లాడండి. మీ సమస్య చెప్పండి. వారు చెప్పేది వినండి. ఇతరుల యోగక్షేమాల గురించి మాట్లాడండి. మీరు మీ మానసిక క్లేశాల నుంచి తప్పక ఉపశమనం పొందుతారు. మరో వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నైరాశ్యానికి లోనైన వ్యక్తి ఎవరినీ కలవడానికి ఇష్టపడడు. ఎవరితోనూ మాట్లాడడు. అంటీ ముట్టనట్టుగా ఉంటాడు. ఇలా నిరంతరం విచారమగ్నులై, అందరికీ దూరంగా వుంటూ, సాధారణ జీవిత కార్యకలాపాలలో శ్రద్ధాసక్తులు కోల్పోయిన వారెవరైనా మీ కుటుంబంలో, ఆప్తులలో ఉన్నారేమో గమనిస్తూ ఉండాలి. అలా జీవితోత్సాహం కోల్పోయిన వ్యక్తులకు తక్షణమే అన్ని విధాల సహయపడండి. వారి సామాజిక ప్రపంచం విస్తృతం, విశాలం అయ్యేలా చూడండి. ఇది ప్రతి ఒక్కరి మానవతా కర్తవ్యం. మానసిక ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులను మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలి. అంతేగాని వారిపై నిందలు వేయకూడదు. వారేదో కళంకితులు అన్నట్లుగా మాట్లాడకూడదు. మనోస్వస్థత కోల్పోవడమనేది ఒక సహజ విషయం. అటువంటి దురవస్థకు లోనైనవారు ఆ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు సానుభూతితో సహకరించాలి, ప్రేమానురాగాలు చూపాలి. వారిని సంరక్షించుకోవాలి. అలా మానవీయంగా వ్యవహరించడంలోనే మన బతుకులకు ఒక సార్థకత సమకూరుతుంది.


ప్రతి భారతీయ పౌరుడూ ఒక అద్వితీయ వ్యక్తే. ప్రతి బాలుడు/ బాలికలోని విశిష్ట ప్రతిభా పాటవాలను గుర్తించి, వాటి వికాసానికి సహయపడవలసిన బాధ్యత సొంత కుటుంబ సభ్యులదే. అప్పుడే ఏ ఒక్కరూ తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావానికి, ఒంటరివారమైపోయామన్న ఆవేదనకులోను కారు. చెప్పవచ్చినదేమిటంటే, ప్రతి వ్యక్తి కేవలం తన కోసమే గాక, సమాజం కోసం కూడా పని చేయాలి. అప్పుడే విశాల సమూహాలలో భాగస్వామి కాగలుగుతారు. అందరి కోసం ఒక్కడు నిలబడాలి, ఒక్కడి కోసం అందరూ నిలబడాలి. మన కాలం సృష్టిస్తున్న ఒత్తిళ్లు, ఆందోళనలు, వ్యాకులతలను అధిగమించేందుకు అదే ఉత్తమ, సరైన మార్గం.


రమేశ్ పోఖ్రియాల్

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

Advertisement
Advertisement
Advertisement