జొన్న కొనుగోలు ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-06-15T05:49:04+05:30 IST

ఈ యేడు యాసంగిలో జొన్న పంటను పండించిన రైతులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

జొన్న కొనుగోలు ఎప్పుడో?
జొన్న పంటను కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులు (ఫైల్‌)

పంటను కొనుగోలు చేయాలని రోడ్డెక్కుతున్న అన్నదాతలు

కేంద్రాల ఏర్పాటుపై నోరు మెదపని ప్రజా ప్రతినిధులు

అత్యవసరాల పేరిట దళారులకు అమ్మేసుకుంటున్న వైనం

హైకోర్టును ఆశ్రయించిన రైతు స్వరాజ్య వేదిక నేతలు

జారీకాని ప్రభుత్వ ఆదేశాలు.. ఆందోళనలో జొన్న  రైతులు 

ఆదిలాబాద్‌, జూన్‌14 (ఆంధ్రజ్యోతి) : ఈ యేడు యాసంగిలో జొన్న పంటను పండించిన రైతులు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోళ్లపై ప్రభుత్వానికి పట్టింపే లేక పోవడంతో అన్నదాతలు దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి. చేతికొచ్చిన పంటను చేనుల్లోనే నిల్వ చేసుకుంటూ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వానాకాల సీజన్‌ మొదలైన జొన్నల కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకాక పోవడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈయేడు వేసవిలో 31,396ఎకరాల్లో జొన్న పంట సాగైంది. ఈ సారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, సరిపడా నీటి తడులు అందడంతో దిగుబడులు ఆశాజనకంగానే వచ్చాయి. దీంతో ఎకరానా 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో 4లక్షల 90వేల క్వింటాళ్లకు పైగా దిగుబడులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో రైతులు మద్ధతు ధరకు దూరమవుతున్నారు. గతేడు కూడా ఎన్నో రకాల ఆందో ళనలు చేపట్టిన తర్వాతనే ప్రభుత్వం దిగి వచ్చి జొన్న పంటను కొనుగో లు చేసింది. ఈ ఏడాది కూడా నెల రోజులుగా రైతులు ఎదురుచూస్తున్న పంట కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కావడం లేదు. దీంతో తాజాగా కలెక్టరేట్‌ ఎదుట రైతులు ఆందోళన చేపట్టి కొమురంభీం చౌక్‌లో పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. అ యినా ప్రభుత్వానికి పట్టింపు లేకుండానే పోయింది. అన్నదాతల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారులు దండుకోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పండించిన పంటలకైౖనా మద్ధతు ధరను చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడం పై అన్నదాతలు మండిపడుతున్నారు.కాగా జిల్లా వ్యాప్తంగా పండించిన జొన్న పంటను కొనుగోలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపుబొర్రన్న హైకోర్టును ఆశ్రయించారు. రైతుల నుంచి ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేసే విధంగా ఆదేశించాలని కోరారు.

కొనుగోళ్లు అనుమానమే..

ఈ యేడు జొన్న పంటను కొనుగోలు చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే వానాకాల సీజన్‌ ప్రారంభం కావడంతో కొనుగోళ్లకు వాతావరణ పరిస్థితులు అనుకూలించేలా లేవు. దీంతో ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికే నిల్వ చేసుకునే అవకాశం లేని రైతులు సగం పంటను దళారులకు అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యేడు జొన్న పంట కొనుగోళ్లు ఉండవనే అధికారులు చెబుతున్నారు. పంట చేనుల్లోనే నిల్వ చేసుకున్న రైతులు రాత్రి, పగలు పం టకు కాపలగా పడికాపులు కాస్తున్నారు. నిత్యం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంట కుప్పల పైపాలథిన్‌ కవర్లు వేసిన ఈదురు గాలుల బీభత్సవానికి చెదిరిపోయి పంటదిగుబడులు తడిచి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదరబాదరగా అమ్మేసుకుంటూ..

రైతులు అత్యవసరాల పేరిట ఆదరబాదరగా అమ్మేసుకోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక పోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. పండించిన పంటను నిల్వ చేసుకునే అవకాశం లేక కొంత మంది రైతులు వచ్చిన ధరకే విక్రయిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో తడిసిన జొన్నలు నాణ్యత లేవంటూ తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఈ సారి క్వింటాల్‌ జొన్న పంటకు ప్రభుత్వం మద్దతు ధరగా రూ.2620గా ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో బయట మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1200ల నుంచి రూ.1500 వరకు రైతులు పంటను అమ్ముకుంటున్నారు. వానాకాల సీజన్‌ ప్రారంభం కావడంతో దళారులు ఇంటికే వచ్చి రైతులను మభ్య పెడుతూ తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని ఉదరగొట్టే ప్రసంగాలు చేసే ప్రజా ప్రతినిధులు పత్తా లేకుండా పోయారని రైతులు మండిపడుతున్నారు.

అధికార పార్టీ నేతల మౌనం..

వరి ధాన్యం కొనుగోళ్లపై హడావుడి చేసిన అధికార పార్టీ నేతలు జొన్న పంట కొనుగోళ్లపై మౌనం వహిస్తున్నారు. ప్రతిపక్షాలు మండిపడుతున్న తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైతుల కష్టం దళారుల పాలవుతున్న ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేక పోతున్నారు. గతేడు జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకొచ్చిన జిల్లా ఎమ్మెల్యేలు ఈ యేడు ప్రభుత్వాన్ని ఒప్పించలేక చేతులేత్తేస్తున్నారు. ఎమ్మెల్యేల పర్యటనలో రైతులు అడుగడుగునా అడ్డుకుంటున్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా బోథ్‌ నియోజకవర్గంలోని తలమడుగు, తాంసి, బోథ్‌, బజార్‌హత్నూర్‌, భీంపూర్‌ మండలాల్లో ఎక్కువగా జొన్న పంటను సాగు చేశారు. ఇన్నాళ్లు ఇదిగో అదిగో అంటూ కాలం గడిపిన ప్రజా ప్రతినిధులు తాజాగా జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం నో చెప్పడంతో కొనుగోలు కేంద్రాల ఊసెత్తడం లేదు. ఇప్పటికే ఎదురు చూసే ఓపిక లేక కొంత మంది రైతులు దళారులకు అమ్మేసుకుని వానాకాల సీజన్‌ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. రైతుల పక్షాన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలబడుతుందని గొప్పలు చెప్పే అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబతారోనని రైతులు ప్రశ్నిస్తున్నారు.

సర్కారు కొంటలేదు.. ఇంట్లో జాగలేదు..

- తాటిపెల్లి సునంద (మహిళా రైతు, తలమడుగు)

ఆరుగాలం కష్టపడి పంటను పండించిన సర్కారు కొనుగోలు చేయడం లేదు. ఇంట్లో నిల్వ చేసుకుందామంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులను అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియడం లేదు. పండించిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయమంటే ఎవరికి చెప్పుకోవాలి.సన్న చిన్నకారు రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారు.ప్రభుత్వం జొన్నలకు మద్దతు ధరను ఎందుకు ప్రకటించిందో అర్థం కావడం లేదు.


ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు..

- శ్రీనివాస్‌ (జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌)

జొన్న పంటను కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆదేశాలు అందగానే జొన్న కొనుగోళ్లను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో చేపడతాం. రైతులు ఆందోళన చెందకుండా మద్దతు ధరకే పంటను విక్రయించుకోవాలి.  రైతులు తొందరపడి దళారులకు పంటను అమ్ముకొని నష్ట పోవద్దు. 


Updated Date - 2022-06-15T05:49:04+05:30 IST