జేఎస్‌ఎల్‌ను తెరిచేదెప్పుడో?

ABN , First Publish Date - 2021-06-14T05:06:33+05:30 IST

జిల్లాలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. వేలాది మంది కార్మికులు వీధిన పడుతున్నారు. రకరకాల కారణాలు చూపుతూ యాజమాన్యాలు పరిశ్రమలను తెరిచేందుకు ముందుకు రావడం లేదు. అప్పన్నపాలెంలోని జేఎస్‌ఎల్‌ (జిందాల్‌ స్టెయిన్‌లెస్‌) కర్మాగారం దుస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో పరిశ్రమ మూతపడగా..అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇంతవరకూ తెరవలేదు.

జేఎస్‌ఎల్‌ను తెరిచేదెప్పుడో?
అప్పన్నపాలెంలో ఉన్న జేఎస్‌ఎల్‌ కర్మాగారం

ఏడాదిన్నర కిందట పరిశ్రమ మూత

పట్టించుకోని యాజమాన్యం

ఆందోళనలో కార్మిక కుటుంబాలు

(కొత్తవలస)

జిల్లాలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. వేలాది మంది కార్మికులు వీధిన పడుతున్నారు. రకరకాల కారణాలు చూపుతూ యాజమాన్యాలు పరిశ్రమలను తెరిచేందుకు ముందుకు రావడం లేదు. అప్పన్నపాలెంలోని జేఎస్‌ఎల్‌  (జిందాల్‌ స్టెయిన్‌లెస్‌) కర్మాగారం దుస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో పరిశ్రమ మూతపడగా..అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇంతవరకూ తెరవలేదు. దీంతో దాదాపు 1000 మంది కార్మిక కుటుంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఒకప్పుడు జేఎస్‌ఎల్‌ పరిశ్రమలో ఉపాధి అంటే... ప్రభుత్వ ఉద్యోగంగా భావించేవారు. పరిశ్రమలో పని చేసేందుకు నిరుద్యోగ యువత ఆసక్తి కనబరిచేవారు. గత ఏడాది కరోనా నియంత్రణలోకి వచ్చాక పరిశ్రమను తెరుస్తామని యాజమాన్య ప్రతినిధులు ప్రకటించారు. తరువాత రాష్ట్రంలో చాలా పరిశ్రమలు తెరిచినా జేఎస్‌ఎల్‌ను మాత్రం తెరవలేదు. ఇంతలో సెకెండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. ఈసారైనా తెరుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 

చర్చల్లో కానరాని పురోగతి

పరిశ్రమ తెరవకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు కార్మిక సంఘాల ప్రతినిధులు జిల్లా కార్మిక శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. యాజమాన్యం నుంచి సుముఖత వ్యక్తం కాలేదు. దీంతో ఈ అంశం విశాఖలోని కార్మిక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అక్కడ కూడా ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులను జేఎస్‌ఎల్‌ అనుబంధ సంస్థలకు బదలాయించారు. కొంతమంది వెళ్లగా..మరికొంతమంది చేరలేదు. కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరింత బాధాకరం. వారిని పట్టించుకునే వారు కరువయ్యారు. స్థానిక నాయకుడు, కొప్పలవెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కలనాయుడుబాబు సమస్యను ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కర్మాగారాన్ని తెరిచి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఇంతవరకూ ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ కర్మాగారం తెరవకపోతే కనీసం సెటిల్‌మెంట్‌నైనా చేయాలని కార్మికులు కోరుతున్నారు. 



Updated Date - 2021-06-14T05:06:33+05:30 IST