ప్రారంభమెప్పుడో?

ABN , First Publish Date - 2022-01-24T04:25:48+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ మెరుగైన వైద్య సేవలు అందించడంలో విఫలమైంది.

ప్రారంభమెప్పుడో?
ప్రారంభానికి నోచుకోని మద్దూర్‌ ప్రభుత్వాసుపత్రి భవనం

- పాత భవనాల్లోనే కొనసాగుతున్న కోస్గి, మద్దూర్‌ ఆసుపత్రులు    

- అరకొర వసతుల మధ్య వైద్య సేవలు 

- ఆరేళ్లు గడుస్తున్నా పూర్తికాని కోస్గి ఆసుపత్రి భవనం  

- నిర్మాణం పూర్తైనా ప్రారంభానికి నోచుకోని మద్దూర్‌ ఆసుపత్రి  

కోస్గి, జనవరి 23 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ మెరుగైన వైద్య సేవలు అందించడంలో విఫలమైంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న లాక్ష్మారెడ్డి కోస్గిలో 50 పడకల ఆసుపత్రి, మద్దూర్‌లో 30 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినా నేటి వరకు కోస్గి ఆస్పత్రి భవనం పూర్తి కాకపోవడం శోచనీచయం. దీంతో కోస్గి, మద్దూర్‌కు చెందిన ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మద్దూర్‌లో రూ.3,20,2811 కోట్లతో పనులు జరుగుతుండగా తుది దశలో ఫినిషింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. కాగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అదే విధంగా కోస్గి ప్రభుత్వాసుపత్రి భవనాన్ని దాదాపు రూ.5.30 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా తొలి దశలోనే ఉన్నాయి. ఉన్న భవనాలను తొలగించి కొత్త భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసినా ప్రస్తుతం వైద్య సేవలు పాత భవనాల్లోనే అరకొర సదుపాయాలతో కొనసాగుతున్నాయి. పాత భవనాలు శిథిలావస్థలో ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మద్దూర్‌, కోస్గి మండలాలకు సంబంధించి దాదాపు 70 గ్రామాలకు పైగా ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రాలకు వస్తుంటారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సేవలు లేకపోవడంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి నెలకొంది. రెండు మండల కేంద్రాల్లో ఏక కాలంలో భవన నిర్మాణాల కోసం శంకుస్థాపనలు చేసి మద్దూర్‌లో భవనం పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. కోస్గిలో భవనం నిర్మాణ దశలోనే ఉండటంతో ఎప్పుడు పూర్తవుతుందోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కొవిడ్‌ పరీక్షల నిర్వాహణ సైతం ప్రభుత్వాసుపత్రుల్లో సరైన పద్ధతిలో జరగడం లేదు. పరీక్షలు నిర్వహించేందుకు ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో కోస్గి మండల ప్రజలు సమీపంలోని గుండుమాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుంటున్నారు. వ్యాపారపరంగా అతి పెద్ద పట్టణాలైన కోస్గి, మద్దూర్‌ మండల కేంద్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ క్రమంలో వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తే జనాభాకనుగుణంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది లేకపోవడం, అరకొర వసతుల మధ్య వైద్య సేవలు అందడంతోజిల్లా కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి దాపు రించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి ఆసుపత్రి భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.



Updated Date - 2022-01-24T04:25:48+05:30 IST