Abn logo
May 7 2021 @ 04:04AM

భూములెప్పుడు కౌలుకిచ్చారు?

శిస్తు, కౌలు వసూలు చేశారా? 

వందల్లో షెడ్లు, గోదాములు ఏమిటి? 

ఆలయ భూముల్లో 4వ రోజు విచారణ

క్షేత్రస్థాయిలో నాలుగోరోజూ విచారణ.. 4 గంటల పాటు అక్కడే


మేడ్చల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): దేవరయాంజాల్‌ భూములపై నాలుగో రోజూ విచారణ కొనసాగింది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం దేవరయాంజాల్‌లోని భూములపై ప్రభుత్వం నియమించిన ఐఏఎ్‌సల కమిటీ గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఐఏఎస్‌ అధికారులు రఘునందన్‌రావు, శ్వేతామహంతి, భారతీ హోళీకేరి, ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ సీతారామచంద్రస్వామి దేవాలయం భూములను, రికార్డులను పరిశీలించారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఈవో కార్యాలయంలోనే ఉండి రికార్డులను పరిశీలించారు. దేవాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, తదితర అధికారులతో సమీక్షించారు.


ఈ సందర్భంగా సంబంధిత అదికారులపై ఐఏఎ్‌సల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. సీతారామచంద్రస్వామి భూములను రైతులు ఎప్పటినుంచి సాగుచేసుకుంటున్నారు? ఈ భూమిని రైతులకు దేవాదాయ శాఖ ఎప్పుడు కౌలుకు ఇచ్చింది? రైతుల వద్ద శిస్తు, పన్నులు, కౌలు ఏమైనా వసూలు చేశారా? వసూలు చేస్తే  సంబంధిత రశీదులెక్కడ? రామచంద్రస్వామి ఆలయం ఏ సంవత్సరంలో నిర్మించారు? ఎప్పుడు రిజిస్ట్రేషన్‌ చేశారు? ఎప్పటి నుంచి ఈవో విధులు నిర్వర్తిస్తున్నారు? ఈ గుడి ప్రభుత్వ జాబితాలో ఎప్పటి నుంచి ఉంది? అంటూ ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించారు. దేవాలయ భూమలుగా పహాణీల్లో, రికార్డుల్లో ఎప్పటి నుంచి నమోదు చేశారు? ఆలయం పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు.


ఈ ఆలయ భూములపై కోర్టు కేసులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా? ఎన్నిరోజుల నుంచి వాదనలు జరుగుతున్నాయి? అన్న వివరాలను కూడా సేకరించారు. మరోవైపు అక్కడ 8 ప్రత్యేక రెవెన్యూ బృందాలతో సర్వే కొనసాగుతోంది. భూమి యజమానులే స్వయంగా తమ వద్ద ఉన్న భూములకు  సంబంధించిన డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకు అందజేశారు. భూములను ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు? అంతకు ముందు భూమి ఎవరి పేరు  మీద ఉంది? కొనుగోలు చేసి ఎన్ని రోజులు అవుతుంది?  అన్న పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.  

Advertisement