ఎప్పుడు పూర్తవుతాయో..!

ABN , First Publish Date - 2021-05-05T06:18:14+05:30 IST

ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి.

ఎప్పుడు పూర్తవుతాయో..!
పగిడ్యాల మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న రైతు భరోసా కేంద్రం

  1. అభివృద్ధి పనుల నత్త నడక
  2. ముందుకు సాగని సీసీ రోడ్లు
  3. ఆగుతూ.. సాగుతున్న భవన నిర్మాణాలు
  4. ఆర్‌బీకే, క్లినిక్‌, పాలశీతలీకరణ.. అన్నీ ఇంతే
  5. 876 సచివాలయ భవనాల్లో.. 474 మాత్రమే పూర్తి
  6. బిల్లుల చెల్లింపులో జాప్యంపై కాంట్రాక్టర్ల అసంతృప్తి
     
    కర్నూలు(న్యూసిటీ), మే 4: ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. రైతు భరోసా, పాల శీతలీకరణ, హెల్త్‌ క్లినిక్‌, సచివాలయాలు.. ఇలా ఏ పని తీసుకున్నా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలతోపాటు పగిడ్యాల, కొత్తపల్లి, ఓర్వకల్లు, గూడూరు వంటి మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మార్చి నాటికి పూర్తి కావాల్సిన పనులు ఇవి. ఎప్పుడు పూర్తి అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనుల కాంట్రాక్టులను చోటా మోటా నాయకులు దక్కించుకున్నారు. వీరంతా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అనుచరులు. అందుకే అధికారులు గట్టిగా అడగలేకున్నారు. దీనికితోడు చేసిన పనులకి బిల్లులు సమర్పించినా చెల్లింపులు జరగలేదు. కానీ అందరూ అధికార పార్టీ నాయకులే కావడంతో ఈ విషయాన్ని బయట చెప్పుకోలేకపోతున్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకోవడంతో ఏఈలపై కలెక్టర్‌ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31కి లక్ష్యం పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం జిల్లాకు అదనంగా రూ.100 కోట్లు కేటాయించింది. అయినా ఫలితం లేకపోయింది.

    బిల్లులు చెల్లిస్తారా..?
    గ్రామ సచివాలయాలు, రైతు భరోసా  కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అమూల్‌ పాలశీతల కేంద్ర భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు పీఆర్‌ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. జాతీయ ఉపాధి హమీ పథకం కింద గడిచిన ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద జిల్లాకు రూ.210 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.110 కోట్లు వెచ్చించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులకు వెచ్చించిన నిఽధులు పోగా ఇంకా రూ.360 కోట్లు మిగిలాయి. ఈ నిధులను అన్ని జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోటాలో జిల్లాకు మరో రూ.15 కోట్లు అదనంగా వచ్చాయి. ఇలా నిధులు పుష్కలంగానే ఉన్నా.. సరైన సమయంలో చెల్లింపులు జరగడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అందుకే, పనులు జరగకపోయినా, అధికారులు గట్టిగా అడగలేకున్నారు. సాంకేతిక సమస్య కారణంగా చెల్లింపులు జరగడం లేదని అధికారులు అంటున్నారు. ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేసే బిల్లులలో చిన్న పొరపాటు జరిగినా, సర్వర్‌ తీసుకోదు. అందుకే, చిన్న చిన్న తప్పిదాలు జరిగిన ప్రతిసారీ చెల్లింపుల్లో అంతులేని జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాలేదని కొన్నిచోట్ల అధికారులను నాయకులు గట్టిగా నిలదీస్తున్నారు.

    సగం మందికీ చెల్లించలేదు..
    నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఐదు దశలలో జరుగుతాయి. పునాది వేసిన తరువాత బిల్లులను పీఆర్‌ ఏఈకి సమర్పించాలి. బేస్‌మెంట్‌, లింటెల్‌, రూఫ్‌, స్లాబ్‌.. ఇలా ఒక్కో దశ పూర్తయిన తరువాతనే బిల్లులు సమర్పించాలి. ఆ తరువాతే చెల్లింపులు జరుగుతాయి. కొన్ని గ్రామాల్లో చివరి దశకు వచ్చినా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు దక్కించుకున్న చోటా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పరువు కోసం అప్పులు తీసుకువచ్చి పనులు చేయిస్తున్నామని కొందరు వాపోతున్నారు. సచివాలయ భవన నిర్మాణాలను ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకూ 474 మాత్రమే పూర్తి చేశారు. ఇందులో సుమారు 200 సచివాలయాలకు  పూర్తిస్థాయి బిల్లులు చెల్లించారు. మిగిలినవారు ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

    ఇదీ పరిస్థితి..

    జిల్లాలో 876 గ్రామ సచివాలయ భవన నిర్మాణాల పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 474 భవనాలు పూర్తి అయ్యాయి. 402 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. వైఎస్సార్‌ క్లిన్లిక్‌లు 634 ప్రారంభించారు. 100 పూర్తి కాగా 534 నిర్మాణంలో ఉన్నాయి. 845 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించగా 211 పూర్తి అయ్యాయి, 634 నిర్మాణ దశలో ఉన్నాయి.  811 అమూల్‌ పాలశీతల కేంద్ర భవనాలు మంజూరు కాగా ఇప్పటి వరకు ఒక్కటీ మొదలవ్వలేదు. సీసీ రోడ్లు 870 మంజూరు కాగా, 120 పూర్తి అయ్యాయి. 750 నిర్మాణ దశలో ఉన్నాయి.  భవనాలను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సీసీ రోడ్ల నిర్మాణాలను నిలిపివేశారు.

    ఇంత ఖర్చు అయింది..

    గ్రామ సచివాలయ భవన నిర్మాణానాకి రూ.350 కోట్లు అంచనా వ్యయంగా కాగా ఇప్పటి వరకు రూ.103.42 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్సార్‌ క్లినిక్‌లకు అంచనా వ్యయం రూ.110 కోట్లు కాగా రూ.12 కోట్లు, రైతు భరోసా కేంద్రాలకు అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా రూ.23 కోట్లు ఖర్చు చేశారు. సీసీ రోడ్లకు అంచనా వ్యయం రూ.195 కోట్లు కాగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు. కొన్ని గ్రామాల్లో పూర్తి చేసిన పనులకు బిల్లులు ఇంకా చెల్లించలేదని నాయకులు మండిపడుతున్నారు.

    ఈ నెలలో పూర్తి చేస్తాం..
    గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మే నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాము. పనుల్లో వేగం పెంచాలని ఈఈ, డీఈ, ఏఈఈలను ఆదేశించాము. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాము. పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తాము. కొన్ని మండలాల్లో పురోగతి లేదనే విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. ఆ మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాము. చేసిన పనులకు త్వరగా బిల్లులు చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
    - సుబ్రమణ్యం, పీఆర్‌ ఎస్‌ఈ
     


Updated Date - 2021-05-05T06:18:14+05:30 IST