మర ఆడించేదెప్పుడు?

ABN , First Publish Date - 2022-07-05T06:04:48+05:30 IST

వివిధ కారణాలతో సీఎంఆర్‌ను నిలిపివేసిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో రైస్‌ మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

మర ఆడించేదెప్పుడు?

- ఎఫ్‌సీఐ ఆదేశాలతో 28 రోజులుగా నిలిచిన సీఎంఆర్‌

- వర్షాలతో ఆరుబయట ఉన్న ధాన్యం తడుస్తుందని మిల్లర్ల ఆందోళన

- రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు సమర్పించినా తుది ఆదేశాలివ్వని ఎఫ్‌సీఐ 


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వివిధ కారణాలతో సీఎంఆర్‌ను నిలిపివేసిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో రైస్‌ మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సీఎంఆర్‌ కింద రైస్‌ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించుకుని పక్కదారి పట్టిస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు ఎఫ్‌సీఐ అధికారులు మే నెలాఖరులో జిల్లాలోని అన్ని రైస్‌మిల్లుల్లో సోదాలు నిర్వహించారు. మిల్లులో పెద్దగా ధాన్యం నిల్వలు లేవని, ఉన్న చోట్ల లెక్కించేందుకు అనువుగా లేవని, కరోనా నేపథ్యంలో కేంద్రం పేదలకు ఇవ్వదలిచిన ఉచిత బియ్యం పంపిణీ జరగడం లేదన్న కారణాలతో సీఎంఆర్‌ సేకరణను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఎఫ్‌సీఐ అధికారులు జూన్‌ మొదటి వారంలో ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 7వ తేదీ నుంచి మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్‌ నిలిచి పోయింది. 28 రోజులు గడుస్తున్నా ఎఫ్‌సీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కావడం లేదు. సీఎంఆర్‌కు సంబంధించిన రిపోర్టుతో పాటు ఉచిత బియ్యం పంపిణీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అందజేసింది. గడిచిన యాసంగి సీజన్‌, వానాకాలం, అంతకు ముందు యాసంగి సీజన్‌లకు సంబంధించిన ధాన్యం నిల్వలు జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో ఉన్నాయి. ఇది వర్షాకాలం కావడంతో ధాన్యం తడిస్తే తమకు పెద్ద ఎత్తున నష్టం వస్తుందని మిల్లర్లు వాపోతున్నారు. 

- జిల్లాలో 198 రైస్‌ మిల్లులు..

జిల్లాలో మొత్తం 198 రైస్‌ మిల్లులు ఉండగా ఇందులో 136 పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులు, 72 రారైస్‌ మిల్లులు ఉన్నాయి. 2020-21 యాసంగికి సంబంధించి ఇంకా ఎఫ్‌సీఐకి ఐదు వేల టన్నులు, 2021-22వానాకాలం సీజన్‌లో సేకరించిన ధాన్యం ద్వారా ఇంకా 1,80,000 టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌ కింద మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నది. గడిచిన యాసంగి సీజన్‌లో 2,74,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొని మిల్లర్లకు సీఎంఆర్‌ కింద అప్పగించింది. అయితే సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ నిలిపి వేయడంతో ఆ ధాన్యం నిల్వలన్నీ మిల్లుల్లోనే ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఆదేశాల కోసం ప్రభుత్వం వేచి చూస్తున్నది. గడిచిన యాసంగి సీజన్‌ నుంచి ఉప్పుడు బియ్యాన్ని సేకరించమని, రా రైస్‌ ఇచ్చినా, ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఇచ్చినా తీసుకుంటామని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయమని, రైతులు వరి సాగు చేయవద్దని ప్రకటించింది. అయినా వెనక్కి తగ్గని రైతులు వరి పంటనే వేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సీఎం కేసీఆర్‌ ధర్నా చేశారు. అయినా కేంద్రం దిగి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఆ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చాలా, రా రైస్‌ పట్టించి ఫోర్టిఫైడ్‌ రైస్‌గా మార్చాలా అనే డైలామాలో ప్రభుత్వం ఉన్నది. ఈ తరుణంలో ఇప్పటి వరకు సీఎంఆర్‌ కింద ఇచ్చిన ధాన్యాన్ని కూడా మర ఆడించడాన్ని నిలిపి వేయాలని ఆదేశించడం వల్ల పుండు మీద కారం చల్లినట్లయ్యింది. మిల్లుల్లో గత సీజన్ల ధాన్యం నిల్వలతో పాటు యాసంగి సీజన్‌ ధాన్యం నిల్వలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు కురిస్తే మాత్రం ధాన్యం తడిసి నష్టం చేకూరుతుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యానికి తమను బాఽధ్యులను చేస్తుందని మిల్లర్లు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి సీఎంఆర్‌ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మిల్లర్లు కోరుతున్నారు. 

- సీఎంఆర్‌ను నిలిపివేశాం

- బి ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి

ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు జిల్లాలోని రైస్‌ మిల్లుల నుంచి సీఎంఆర్‌ను సేకరణను జూన్‌ 7వ తేదీ నుంచి నిలిపివేశాము. సీఎంఆర్‌ సేకరణపై స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. మిల్లులకు ధాన్యం కేటాయింపులు పూర్తి చేశాము. సీఎంఆర్‌ను ఎంత పూర్తి చేశారు.. ఎంత వరకు అప్పగించారన్న వివరాలను, ఉచిత బియ్యం పంపిణీ వివరాలను కూడా ఎఫ్‌సీఐకి పంపించాం. ఆదేశాలు వస్తేనే సీఎంఆర్‌ చేపట్టాల్సి ఉంటుంది.


Updated Date - 2022-07-05T06:04:48+05:30 IST