Advertisement
Advertisement
Abn logo
Advertisement

వట్టివాగు ప్రాజెక్టు కుడికాలువ గండి పూడ్చేదెన్నడు?

- తెగిన వట్టివాగు ప్రధాన కాలువ

- వృథాగా పోతున్న నీరు

- చేలకు అందని నీళ్లు.. రైతులకు కన్నీళ్లు

- ఎండిపోతున్న మిర్చి పంట

- నష్టపోతున్న రైతాంగం

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 7: ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో రైతన్నలు ఎంతో మురిసిపోయారు. ఈ ఏడాది వట్టివాగు ప్రాజెక్టు కింద రైతులు వరి, మిర్చి పంటను సాగు చేశారు. కానీ రైతుల ఆశలు అడియాశలయ్యాయి. వట్టివాగు ప్రధాన కుడికాలువ గతనెల 21న గండిపడింది. దీంతో పంటపొలాలకు అందాల్సిన సాగునీరు వృథాగా పోతోంది. సాగునీరందుతు న్నదన్న ఆశతో అయకట్టుదారులు వేసుకున్న పంటలకు గండితో నీరందక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. చేతికివచ్చే పంట సాగునీరందక కళ్ల ముందే ఎండిపోతుంటే రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గండి ఏర్పడి పక్షం రోజులు గడుస్తున్నా గండిని పూడ్చేందుకు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 

గండితో రైతుల ఆశలు గల్లంతు..

మండలంలోని 24,500ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో వట్టివాగు ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు కుడికాలువ కింద 21,800, ఎడమ కాలువ కింద 2,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉండగా కాలువ లైనింగ్‌ దెబ్బ తినడం, కొన్నిచోట్ల పూడిక, తుంగ పేరుకుపోవడంతో కుడి, ఎడమ కాలువల కింద కేవలం 10వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందుతోంది. కుడి కాలువ కింద సాగు చేసిన పంటలకు ఇటీవల ఏర్పడిన ప్రధాన కాలువ గండితో రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఇంకా కొన్ని రోజులైతే పంట చేతికి వస్తుందని అనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. బూర్గుడ గ్రామానికి చెందిన రైతులు మేకర్తి ప్రభా కర్‌, సుబ్బరావు తదితర రైతులు ఈదులవాడ శివారులో 20ఎకరాల మిర్చి పంటను వేశారు. ప్రతిఏటా పత్తిపంటను వేస్తున్న రైతులు ఈ ఏడాది పంట మార్పిడి చేసి మిర్చిపంటను వేశారు. ఒక్కో ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. తీరా కాత దశలో ఉన్న పంటకు నీరు అందకపోవడంతో పంట ఎండిపోతోంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుకు సాగని పనులు..

వట్టివాగు ప్రాజెక్టు ప్రధాన కుడికాలువ గండిపడి 15రోజులు గడుస్తున్నా నేటికీ ఎలాంటి మరమతు పనులు అధికారులు చేపట్టడంలేదు. దీంతో సాగు భూములకు నీరందడం లేదు. గండి ఏర్పడడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోయాయి. కాలువ మరమతు పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గండిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. గండిని వెంటనే పూడ్చి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 

పంట ఎండిపోతోంది..

మేకర్తి ప్రభాకర్‌, రైతు

వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈదులవాడ శివారులో 12ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి పంటను సాగుచేశాను. ఎకరానికి రూ.లక్ష ఖర్చయింది. పంట ఎదిగే సమయంలో గండి ఏర్పడంతో సాగునీరందడంలేదు. దీంతో పంట పూర్తిగా ఎండి పోతోంది. గండిని వెంటనే పూడ్చాలని కలెక్టర్‌తో పాటు నీటిపారుదలశాఖ అధికారులకు విన్నవించాం. అయినా ఇంతవరకు మరమతు పనులు చేపట్టలేదు. పంట నష్టపోయిన తనకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. 

త్వరలో మరమతు పనులు చేపడతాం.. 

గుణవంత్‌రావు, ఈఈ, నీటిపారుదలశాఖ

వట్టివాగు ప్రాజెక్టు కుడికాలువ గండి మరమతు పనులను త్వరలోనే ప్రారం భిస్తాం. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.44లక్షల అంచనాతో ప్రతిపాదనలు పంపించాం. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు రాగానే టెండర్‌ పిలిచి పనులను ప్రారంభిస్తాం.పనులను వెంటనే పూర్తిచేసి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు కృషిచేస్తాం.

Advertisement
Advertisement