ఎప్పుడు చెబుతారో..!

ABN , First Publish Date - 2021-05-11T05:25:54+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌ సెంటర్‌ నుంచి వచ్చే కొవిడ్‌ అనుమానితుల శాంపిల్స్‌ ఫలితాలు రెండు రోజుల తర్వాత వస్తున్నాయి.

ఎప్పుడు చెబుతారో..!

  1. కొవిడ్‌ నిర్ధారణ ఫలితాల్లో జాప్యం
  2. ఆర్టీపీసీఆర్‌కు కేఎంసీ ల్యాబే దిక్కు
  3. రోజుకు 5 వేల నమూనాల పరీక్ష
  4. రెండు రోజుల తరువాత ఫలితాలు
  5. ల్యాబ్‌కు ఆలస్యంగా నమూనాలు

    కర్నూలు, మే 10(ఆంధ్రజ్యోతి):

      ఆళ్ళగడ్డ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు రోజూ దాదాపు వంద కొవిడ్‌ అనుమానితుల శాంపిల్స్‌ వస్తుంటాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే అక్కడ పరీక్షించి, అదే రోజున ఫలితాలు తెలియజేస్తారు. మిగతా వాటిని కర్నూలు జీజీహెచ్‌ ల్యాబ్‌కు పంపిస్తుంటారు. వీటి ఫలితాలు మూడు రోజులకుగానీ రావడం లేదు.

     

ఎమ్మిగనూరు హెల్త్‌కేర్‌ సెంటర్‌, చుట్టు పక్కల పీహెచ్‌సీల నుంచి రోజుకు వంద వరకు శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ట్రూనాట్‌ పరీక్ష ద్వారా 60 మందికి ఫలితాలను ఆ రోజే తెలియజేస్తున్నారు. మిగిలిన వాటిని కర్నూలు ల్యాబ్‌కు పంపుతున్నారు. ఈ ఫలితాలు రెండు రోజులకు గానీ రావడం లేదు.
 

ఆదోని ఏరియా ఆస్పత్రికి పెద్ద హరివాణం, పెద్ద తుంబళం పీహెచ్‌సీల పరిధిలో రోజుకు దాదాపు వంద శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. వీటిలో 70 నుంచి 80 నమూనాల ఫలితాలు అదే రోజు వస్తున్నాయి. మిగిలిన వాటి ఫలితాలు రెండు రోజులకు గానీ రావడం లేదు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌ సెంటర్‌ నుంచి వచ్చే కొవిడ్‌ అనుమానితుల శాంపిల్స్‌ ఫలితాలు రెండు రోజుల తర్వాత వస్తున్నాయి. దీంతో తమకు వైరస్‌ సోకిందో లేదో తెలుసుకునేందుకు ప్రజలు ఎదురు చూడాల్సి వస్తోంది. రోజుల తరబడి ఫలితాలు ప్రకటించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వైరస్‌ ఉధృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. మరోవైపు జ్వరాలు తగ్గడం లేదు. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు.  ఫలితాలు వచ్చేదాకా తమకు కొవిడ్‌ సోకిందే లేదోనని బాధితులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఫలితాలు ఏ రోజుకు ఆరోజు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించినా, ఫలితం కనిపించడం లేదు. టెస్టుల సామార్థాన్ని పెంచడంతో పాటు, ల్యాబ్‌లు కూడా పెంచితే ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రోజుకు ఐదు వేలే..
ప్రస్తుతం కర్నూలు ల్యాబ్‌లో మాత్రమే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఈ ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుందని అధికారులు, వైద్యులు విశ్వసిస్తున్నారు. కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు పెరిగాయి. వారి ప్రైమరీ కాంటాక్ట్‌లు, కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారు ఎక్కువ కావడంతో అధిక సంఖ్యలో నమూనాలను సేకరించి, పరీక్షించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని బోధానస్పత్రిలో మాత్రమే ఆర్టీపీసీఆర్‌ కిట్లను పరిక్షించే వీలుంది. ఇక్కడ ఉన్న యంత్రాలపై సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తే 5 వేల నుంచి 7 వేల శాంపిల్స్‌ పరీక్షించి, ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరగడంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శాంపిల్స్‌ సమయానికి రాకపోవడం వల్లే ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని సమాచారం.

సేకరణ పెరగాలి..
జిల్లాలో రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో దాదాపు 10 వేల కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన కాంటాక్ట్‌ కేసులను గుర్తించి, టెస్టుల సంఖ్యను పెంచాలి. ఒక్కో పాజిటివ్‌ వ్యక్తికి సంబంధించి పదిమంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి, పరీక్షించాలని అనుకున్నా, రోజుకు పదిహేను వేల నుంచి ఇరవై వేల శాంపిల్స్‌ సేకరించాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్‌లో బాధితుడి కుటుంబ సభ్యులే అధికంగా ఉంటున్నారు. ఫలితంగా కాంటాక్ట్స్‌ తగ్గారనుకున్నా కనీసం రోజుకు 10 వేల టెస్టులు చేయాలి. లక్షణాలు బయటపడడం వల్ల పరీక్షించుకునే వారు దీనికి అదనం. కానీ జిల్లాలో ఇన్ని పరీక్షలు జరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం రోజవారీ టెస్టుల సంఖ్య  సరాసరి 5 వేలు ఉంటోంది. అంటే కాంటాక్ట్స్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ సక్రమంగా జరగడం లేదని స్పష్టమవుతోంది. ఈ ఉదాసీనతే కేసులు పెరగడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరి సంజీవని బస్సుల ద్వారా నమూనాల సేకరణ గణనీయంగా పెంచితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జాప్యానికి కారణాలివే..
జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పూర్తిస్థాయి ల్యాబ్‌లు లేవు. ఇక్కడ ట్రూనాట్‌ పరీక్షలే ఎక్కువగా చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ ద్వారా నిర్ధారణ కావాలంటే శాంపిల్స్‌ను కర్నూలు జీజీహెచ్‌ ల్యాబ్‌కు పంపాల్సిందే. పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌ సెంటర్ల నుంచి శాంపిల్స్‌ రావడానికి చాలా సమయం పడుతోంది. శ్రీశైలం వంటి దూర ప్రాంతాల నుంచి నమూనాలను కర్నూలు జీజీహెచ్‌ ల్యాబ్‌కు పంపాలంటే కనీసం ఒక రోజు పడుతుంది. ఫలితం కోసం మరో రోజు నిరీక్షించాల్సి వస్తోంది. రోజుకు సగటున 5 వేల నమూనాల పలితాలకే రెండు రోజుల పడుతుంటే.. మునుముందు కేసుల సంఖ్య మరింత పెరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. కేవలం జీజీహెచ్‌ మీదనే ఆధారపడకుండా జిల్లాలో మరో రెండు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే ఫలితాల విషయంలో జాప్యం జరగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బయట తిరగొద్దు
నమూనాలు ఇచ్చిన వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు బయట తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు. పాజిటివ్‌ వస్తే కుటుంబం పరిస్థితి ఏమిటని ఆలోచించేవారు కనీసం 15 రోజులకు సరిపడా వస్తువులు, మందులు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పలు దుకాణాలు తిరుగుతున్నారు. మరికొందరు తమకు లక్షణాలు లేవని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. పది రోజుల క్రితం నగరానికి చెందిన ఓ వ్యక్తి శాంపిల్‌ ఇచ్చి వెళ్లాడు. అధికారులు ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి ‘పాజిటివ్‌ వచ్చింది, బయట తిరగొద్దు’ అని సూచించారు. ఆ వ్యక్తి ఆ సమయంలో తాను సినిమా థియేటర్‌లో ఉన్నానని సమాధానం ఇవ్వడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఇలాంటి వారివల్ల కాంటాక్ట్స్‌ను కనుగొనడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అనుమానిత లక్షణాలున్న వారు శాంపిల్స్‌ ఇచ్చి ఫలితాలు వచ్చేవరకు ఇంటిపట్టునే ఐసోలేషన్‌లో ఉండటం మంచిదని వైద్యుల చెబుతున్నారు. అనవసరంగా బయట తిరగవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

మా వద్ద జాప్యం లేదు..

టెస్టుల విషయంలో మా వద్ద ఎలాంటి జాప్యం జరగడం లేదు. ల్యాబ్‌కు శాంపిల్స్‌ వచ్చిన 24 గంటల్లో ఫలితాలను అధికారులకు తెలియజేస్తున్నాం. శాంపిల్స్‌ వివరాలు నమోదు చేసుకోవడానికి సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. అన్ని వివరాలు నమోదు చేసుకుని టెస్టుల వివరాలు పక్కాగా వెలువరిస్తున్నాం. మూడు షిఫ్టులలో పనిచేస్తూ రోజుకు 5 వేల టెస్టులు చేస్తున్నాం. అప్పుడపుడు వీటి సంఖ్య 6 వేలు దాటుతోంది. ల్యాబ్‌కు శాంపిల్స్‌ లేటుగా వస్తే మేమేమీ చేయలేం. అది మా పరిధిలో లేదు.
- డాక్టర్‌ జిక్కి, ప్రిన్సిపాల్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ



Updated Date - 2021-05-11T05:25:54+05:30 IST