కొవిడ్ విపత్తు వేళ పత్తాలేని వైసీపీ నేతలు..

ABN , First Publish Date - 2021-05-08T07:11:09+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ విపత్తుతో విలవిల్లాడుతున్న జనానికి ఆదుకునే నాయకుడు కరువయ్యాడు. కష్టకాలంలో ధైర్యం చెప్పి సాయం చేసే నాథుడు లేకపోవడంతో బాధితులు అల్లాడుతున్నారు.

కొవిడ్ విపత్తు వేళ పత్తాలేని వైసీపీ నేతలు..

  • కొవిడ్‌ విపత్తు వేళ జిల్లాలో ఎక్కడా పత్తాలేని అధికార పార్టీ నేతలు
  • ఒకపక్క పడకలు దొరక్క, ఆక్సిజన్‌ అందక, అంబులెన్స్‌ల దోపిడీతో నరకయాతన
  • ప్రైవేటు ఆసుపత్రుల నుంచి చివరకు పార్ధివదేహాల ఖననానికీ వేలల్లో పిండుడు
  • హోంఐసోలేషన్‌లో ఉన్న వారికీ వైద్యుల పర్యవేక్షణ కరువు
  • ఇంతజరుగుతున్నా ఎక్కడా ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ ఊసేలేదు
  • అనేక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలతో మమేకం
  • జిల్లాలో మాత్రం ఉలుకూపలుకూ లేని వైనం
  • కొందరు ఫోన్లలో కూడా దొరకని పరిస్థితి
  • పడక, వైద్యం గురించి అడిగితే ఫోన్‌ కట్‌
  • కొందరు ఎమ్మెల్యేలు సొంత పనుల జాబితాతో కలెక్టర్‌కు వచ్చి వెళుతున్న వైనం
  • ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేక అన్నీ సవ్యంగానే ఉన్నాయంటూ కలెక్టర్‌ స్వీయ కితాబు


తూర్పు జిల్లాలో కొవిడ్‌ విపత్తుతో విలవిల్లాడుతున్న జనానికి ఆదుకునే నాయకుడు కరువయ్యాడు. కష్టకాలంలో ధైర్యం చెప్పి సాయం చేసే నాథుడు లేకపోవడంతో బాధితులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం వేలాది పాజిటివ్‌లతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆక్సిజన్‌ బెడ్లు లేక, ఐసీయూలు, వెంటిలేటర్లు సరిపోక కొవిడ్‌ బాధితులు అల్లాడుతున్నారు. పడక కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తూ కొందరైతే మరణిస్తున్నారు. అటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ మొదలు, అంబులెన్స్‌ల పిండుడు, మృతదేహాల ఖననానికి వేలల్లో గుంజుడు ఇలా ఎక్కడికక్కడ దోపిడీయే కొనసాగుతోంది. ఇంతటి కష్టకాలంలో కాసింత అండగా నిలబడి సాయం చేయాల్సిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పత్తా లేరు. సమస్య చెప్పుకోవాలంటే కనీసం అందుబాటులో ఉండడం లేదు. కొందరు ఫోన్‌చేసినా దొరకడం లేదు. అనేక జిల్లాల్లో అధికార పార్టీ నేతలు కొందరు బాధితులకు అండగా ఉంటే ఇక్కడ మాత్రం అదేం లేదు. దీంతో ఆసుపత్రుల వద్ద జరిగే దోపిడి, వసతుల లేమి ఎవరికీ పట్టడం లేదు. అధికారులంతా తామే సర్వం నడిపిస్తూ ఎక్కడా సమస్యల్లేవంటూ కితాబునిచ్చుకుంటున్నారు. 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

నాయకుడంటే జనం బాధలు తనవిగా భావించాలి. కష్టమొస్తే నేనున్నానని నిలబడాలి. ప్రస్తుత కొవిడ్‌ విపత్తులో జనం నరకయాతన పడుతున్నారు. ఎక్క డికక్కడ మహమ్మారి వేలాది మందిని కమ్మేస్తూ నిలువునా ప్రాణాలు తీసేస్తోం ది. అటు 77 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. సామాన్యుడికి ఆసుపత్రిలో పడక దొరకడం గగనంగా మారింది. పోనీ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్సచేయించుకునే స్తోమత లేని పరిస్థితి. కానీ  సామాన్యుడి కష్టాలు పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. కొవిడ్‌కు గురై అత్య వసర పరిస్థితిలో అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే రాదు.. ప్రైవేటు అంబులెన్స్‌లు వేల ల్లో పిండేస్తున్నాయి. పీహెచ్‌సీలో కొవిడ్‌ టెస్ట్‌లు మొదలు, హోంఐసోలేషన్‌లో పర్యవేక్షణ లేమి, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి, ఆక్సిజన్‌ కొరతతో అగచాట్లు ఇలా ఎన్నో కష్టాలు వెన్నాడుతున్నాయి. కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, అమలాపురం కిమ్స్‌, ఏరియా ఆసుపత్రుల వరకు కొవిడ్‌ పడకలన్నీ నిండిపోయాయి. అనేకచోట్ల మంచంపై ఇద్దరేసి, ఆ కింద మరో ఇద్ద రితో వైద్యం కొనసాగుతోంది. మరికొందరు పడక దొరక్క ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తూ రోజూ పదుల్లో చనిపోతున్నారు. కొవిడ్‌ విలయంతో ఇంత జరుగుతున్నా ఎక్కడా జిల్లాలో అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పత్తా ఉండడం లేదు. ఆపదలో ఇంటికి వెళ్తే సార్లు లేరనే సమాధానం వస్తోంది. ఫోన్‌ చేసి బెడ్‌ గురించో లేదో ఆసుపత్రి దోపిడీ గురించో.. ఆక్సిజన్‌ సమస్య గురించో చెబితే కనీసం వినడం లేదు. అధికారులను ఆదేశించి సమస్య పరిష్కరించాలనే మాట ఉండడం లేదు. ఒకరకంగా విపత్తుతో తమకేం సంబంధం లేదన్నట్టు పలువురు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లో పీహెచ్‌ల్లో టెస్ట్‌లకు వేలల్లో పోటెత్తుతున్నారు. అక్కడ అనేక అసౌకర్యాలతో కూడిన సమస్యలు వేధిస్తున్నాయి. మొక్కుబడిగా వేసిన ఆక్సిజన్‌ బెడ్లలో ఆక్సిజన్‌ అయిపోతే పట్టించుకునే నాథుడు లేదు.


బయట దాతల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి. నియోజకవర్గాల్లో కొవిడ్‌ కష్టాలు, సమస్యలపై కనీసం ఒక్కటంటే ఒక్కసారి క్షేత్రస్థాయికి వెళ్లిన దాఖలాలు లేవు. చివరకు అంబులెన్స్‌ల దోపిడీ ఊసే పట్టడం లేదు. అనేక జిల్లాల్లో ఈ కష్టకాలంలో పలువురు ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. టెస్ట్‌లు ఎక్కువగా జరిగేలా, నియోజకవర్గంలో బాధితులకు పడకలు దొరికేలా ప్రయత్నించి అండగా ఉంటున్నారు. కొందరైతే కొవిడ్‌ మృతులకు స్వయంగా ఖననాలు చేయిస్తున్నారు. కానీ జిల్లాలో అధికారపార్టీ నేతల అడ్రస్సే లేదు. కొవిడ్‌ ఉప్పెన మొదలైంది తడవు ఎక్కడా నియోజకవర్గా ల్లో కేసుల నియంత్రణపై సమీక్ష, ఆసుపత్రుల్లో ఆర్తనాదాలు ఏవీ వీరికి కనిపించడం లేదు. వినిపించడం లేదు. ముఖ్యంగా ముగ్గురు మంత్రుల తీరు దారుణంగా ఉంది. మంత్రి కన్నబాబు జిల్లాలోనే ఉన్నా వ్యవసాయశాఖపై సమీక్ష మినహా ఏదీ పట్టించుకోవడం లేదు. ఒక్కరోజైనా జిల్లాలో కేసుల తీవ్రత, ఆసుపత్రుల్లో సమస్యలు, ప్రైవేటు దోపిడీ, కట్టడి చర్యలు, వ్యూహాలపై కలెక్టర్‌ ఇతర అధికారులతో సమీక్షించింది లేదు. ఒక్కరోజైనా జీజీహెచ్‌లో జనం కష్టాలు విన్నది లేదు. కోనసీమను కొవిడ్‌ కకావికలం చేస్తోంది.


రోజూ వేలాది కేసులు, పదుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఏ రోజూ అధికారులు ఏం చేస్తున్నారు? ఆసుపత్రుల్లో సమస్యలు? జనం అగచాట్లు? రెమ్‌డెసివిర్‌ దొరక్క, ఆక్సిజన్‌ అందక చనిపోతున్నా వాటిపై అధికారులను నిలదీసిన పాపానపోలేదు. అసలు ఆయన ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. మంత్రి వేణు కేవలం ప్రారంభోత్సవాలు మినహా కొవిడ్‌ నియంత్రణపై అధికారులతో సమీక్షలు లేవు. ఆసుపత్రుల అరాచకాలు, అధికారుల వైఫల్యాలపై చర్చించడం లేదు. జిల్లావ్యాప్తంగాను, నియోజకవర్గాల్లోను ప్రజల సాధకబాధలు, కష్టాలు కనీసం వీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి లోపాలు సరిచేసేలా ఆదేశాలు ఇవ్వడం లేదు.


మనకెందుకులే...

ఎక్కడ చూసినా నియోజకవర్గాల నుంచి కొవిడ్‌ బాధితులు జీజీహెచ్‌, డీహెచ్‌కు పడకలకోసం వెళ్లి పడిగాపులు కాస్తూ చనిపోతున్నారు. ఈ పరిస్థితిపై ఎక్కడా కలెక్టర్‌తో సహా ఎవరినీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిలదీయడం లేదు. జిల్లాలో అనేకమంది ప్రజాప్రతినిధులు తమకు బాగా కావలసిన వారికి పడక ఇప్పించడం, ఆక్సిజన్‌ బెడ్‌ అందేలా ఒత్తిడి చేయడం మినహా అంతకుమించి పనిచేయడం లేదు. దీంతో ప్రతిరోజూ కలెక్టర్‌ మాత్రం జిల్లాలో అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని, బెడ్లు కొరత లేదని, ఆక్సిజన్‌ కొరత లేదని, టెస్ట్‌లు ఎక్కువగా చేస్తున్నామని అంతా బయటకు బాగుందంటూ స్వీయ కితాబునిచ్చుకుంటున్నారు. వాస్తవానికి కాకినాడ జీజీహెచ్‌లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. టెస్ట్‌ల వద్ద వేలల్లో జనం, ఆసుపత్రి బయట, లోపల బాధితుల ఆర్తనాదాలు, అసౌకర్యాల లేమి? దేనీపైనా కాకినాడ సిటీ ఎమ్మెల్యే పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫోన్‌ చేస్తే మాత్రం అందుబాటులో ఉంటానని ప్రకటించి ఊరుకున్నారు. కొందరు నిత్యం కలెక్టరేట్‌కు వెళ్లి కావలసిన పనులు చేయించుకుంటున్నారు. కోనసీమలోను అనేకమంది ఎమ్మెల్యేలు పనులపై కలెక్టర్‌ను కలిసి వెళ్తున్నారేగానీ విపత్తుతో ప్రజలు పడుతున్న బాధపై నిలదీయడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే కొవిడ్‌పై అంతా కలెక్టర్‌, ఇతర అధికారులు తామై వ్యవహరిస్తున్నారు. వీరి లోపాలు, వ్యూహాల్లో వెనుకబాటుపై కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశ్నించడం లేదు. టెస్ట్‌లు తక్కువగా జరుగు తున్నాయి.. అటు అవసరమైన ఆక్సిజన్‌ కొరత. దీన్నేలా అధిగమిస్తారు? ఉన్న బెడ్లు చాలని నేపథ్యంలో అదనపు బెడ్లు ఎలా సిద్ధం చేస్తారు? అనే ఆలోచనే లేదు. మొన్న ఎన్నికల్లో అంతా తామై తిరిగిన నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు కొవిడ్‌ ఆపదలో మాత్రం తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.

Updated Date - 2021-05-08T07:11:09+05:30 IST