ఏదీ సీబీ‘ఐ’?

ABN , First Publish Date - 2021-01-18T07:44:20+05:30 IST

రాష్ట్రంలో కీలక కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు పోటీలు పడి మరీ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నాయి. అంతర్వేది రథం దగ్ధం నుంచి కర్నూలు జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్య, జడ్జిలపై సోషల్‌ మీడియాలో దూషణల వరకూ ఎన్నో కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాయి.

ఏదీ సీబీ‘ఐ’?

  • ఆర్భాటంగా కేసుల అప్పగింత 
  • తొమ్మిది కీలక కేసుల్లో సాగని దర్యాప్తు 
  • ఓవైపు హైకోర్టు, మరోవైపు ప్రభుత్వం నుంచి
  • కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసులు అప్పగింత
  • అలా ఇచ్చి చేతులు దులుపుకొంటున్న ప్రభుత్వం
  • సర్కారు ఇచ్చిన కేసుల్లో చేతులెత్తేస్తున్న వైనం
  • సిబ్బంది కొరతంటూ కోర్టుకు సీబీఐ జవాబులు
  • అయేషా మీరా హత్య కేసు ఇంకా దర్యాప్తులోనే 
  • న్యాయం కోసం బాధితుల పడిగాపులు 
  • ‘అంతర్వేది’పై తామే విచారణ చేస్తామన్న డీజీపీ


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కీలక కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు పోటీలు పడి మరీ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నాయి. అంతర్వేది రథం దగ్ధం నుంచి కర్నూలు జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్య, జడ్జిలపై సోషల్‌ మీడియాలో దూషణల వరకూ ఎన్నో కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది కీలక కేసులు సీబీఐకి అప్పగించగా ఒక్కదాంట్లోనూ అడుగు ముందుకు పడటం లేదు. సర్కారు ఇచ్చిన కేసుల్లో సీబీఐ చేతులెత్తేస్తుండటంతో ఈ పరిస్థితి తప్పడం లేదన్న వాదన వినిపిస్తోంది. సిబ్బంది కొరత ఉందని, కేసుల భారం ఎక్కువైందంటూ కోర్టుల్లో సీబీఐ అఫిడవిట్లు దాఖలు చేస్తోంది. దర్యాప్తులో జాప్యంతో న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం సీబీఐకి కేసులు అప్పగించడం ఓ ఉత్తుత్తి వ్యవహారంగా మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. 


అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధానికి సంబంధించిన కేసును గతేడాది సెప్టెంబరు మొదటి వారంలో జగన్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కానీ ఏడాది మారిపోయి కొత్త సంవత్సరంలోకి వచ్చినా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు, హిందూ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించినా దర్యాప్తులో మాత్రం పురోగతి లేదు. దీంతో ఆ కేసు దర్యాప్తు తామే చేస్తామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. 


జకర్నూలు జిల్లాకు చెందిన బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతిపై ప్రజాసంఘాలు గళం విప్పాయి. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌... దోషులెవరో తేల్చకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏడాది క్రితం జీవో జారీ చేసింది. అయితే ఇప్పటికీ కేసు తమ వద్దకు రాలేదని ఇటీవల సీబీఐ అధికారులు చెప్పడంతో తన బిడ్డకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి కన్నీటి పర్యంతమైంది. 


చిత్తూరు జిల్లాకు చెందిన ఓ దళిత న్యాయమూర్తి కేసులో హైకోర్టులో వాదనల సందర్భంగా తమకు సిబ్బంది కొరత ఉందని, కేసుల భారంతో ఉన్నామని హైకోర్టులో సీబీఐ సమాధానమిచ్చింది. అదే జిల్లాకు చెందిన ఒక దళిత మహిళా వైద్యురాలి విషయంలోనూ ఇలాగే చెప్పింది. 


విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) 2007 డిసెంబరు 27న దారుణ హత్యకు గురైంది. పలు మలుపుల అనంతరం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన ఆరోపణలపై విజయవాడ కోర్టు సిబ్బంది ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ... ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. 


గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్‌ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరింది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే కేబినెట్‌లో చర్చించి, అప్పటికే రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేసిన కేసును జగన్‌ సర్కారు తిరగదోడింది. దీంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 


2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెందారు. తన తండ్రి హత్యకు గురయ్యారని కుమార్తె సునీత ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో సీఐడీ ద్వారా దర్యాప్తు చేయించినా వైసీపీ మాత్రం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టింది. సునీత విజ్ఞప్తి మేరకు హైకోర్టు... వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించింది. 


రాజధాని భూముల కేటాయింపులో క్విడ్‌ ప్రో కో జరిగిందని జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆరోపించింది. మొత్తం బాగోతాన్ని వెలికి తీయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు జరుగుతుండగానే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసినా సీబీఐ పూర్తి స్థాయిలో కేసు తీసుకోలేదు. 


కరోనా రోగులకు వైద్యసేవలు అందించాలంటే నాణ్యమైన మాస్క్‌లు కావాలని బహిరంగంగా అడిగి సస్పెండైన డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం సంచలనం రేపింది. విశాఖంలో ఆయనపై పోలీసు లు దాడిచేయడంపట్ల మానవ హక్కుల సంఘాలు, డాక్టర్ల అసోసియేషన్లు మండిపడ్డాయి. ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో నిజానిజాలు నిగ్గుతేల్చాలని సీఐబీని ఆదేశించింది.

 

జడ్జిలకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ సోషల్‌ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో దర్యాప్తును తొలుత సీఐడీకి అప్పగించారు. అయితే నెలలు గడుస్తున్నా పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-01-18T07:44:20+05:30 IST