Abn logo
Jun 16 2021 @ 04:26AM

భూహక్కులు నిర్ణయించే అధికారం హెచ్‌ఆర్సీకి ఎక్కడిది?

  • రాయదుర్గ్‌ భూముల కేసులో హెచ్‌ఆర్సీ 
  • ఆదేశాల నిలుపుదల: హైకోర్టు ధర్మాసనం

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): హైటెక్‌ సిటీకి అతి సమీపంలోని రాయదుర్గ్‌లో ఖరీదైన భూములకు సంబంధించి రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) ఉత్తర్వులు జారీచేయడం పట్ల హైకోర్టు ధర్మాసనం విస్మ యం వ్యక్తం చేసింది. హెచ్‌ఆర్సీకి భూములపై హక్కులు నిర్ణయించే అధికారా లు ఏ చట్టంప్రకారం సంక్రమించాయని నిలదీసింది. ఈ భూములకు సంబంధించిన వివాదాలు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా హెచ్‌ఆర్సీ హక్కులను నిర్ణయించడాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం  తప్పుపట్టింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌ గ్రామ సర్వే నెం.46లోని 84.30 ఎకరాల భూములను లార్వెన్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు చెందిన రహీముల్లా హుస్సేనీకి అప్పగించాలని సీసీఎల్‌ఏను ఆదేశిస్తూ ఏప్రిల్‌ 12న హెచ్‌ఆర్సీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ  హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న హోం శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్‌, డీజీపీ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌, రాయదుర్గ్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హె చ్‌ఓ, లార్వెన్‌ ప్రాజెక్ట్స్‌కు, రహీముల్లా హుస్సేనికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలన్న ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్‌ 13కి వాయిదా వేసింది.