1,31,000 కోట్లు ఎక్కడ?

ABN , First Publish Date - 2021-10-14T08:03:48+05:30 IST

1,31,000 కోట్లు ఎక్కడ?

1,31,000 కోట్లు ఎక్కడ?

ఖాతాలకు చిక్కని అప్పుల లెక్క

రెండున్నరేళ్లలో ఆదాయం 2,94,000 కోట్లు

ప్రభుత్వం చేసిన ఖర్చు 4,50,000 కోట్లు

ఈ లెక్కన రుణభారం 1,56,000 కోట్లే!

అంతకుమించి చేసిన అప్పు 1,31,000 కోట్లు

బడ్జెట్‌ పుస్తకాల్లోనూ లేని లెక్కలు

‘కాగ్‌’కూ చెప్పని ఈ అప్పుల వివరాలు

ఆ సొమ్ము ఎలా ఖర్చు పెట్టారనేదే మిస్టరీ


మీ ఆదాయం సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు! చేసిన ఖర్చు ఐదు లక్షలు! అంటే... మీ దగ్గర ఒక లక్ష రూపాయలు మిగిలి ఉండాలి!

లేదా...

మీ ఆదాయం సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు. మీరు  చేసిన ఖర్చు ఏడు లక్షలు. అంటే... మిగతా లక్ష రూపాయలు మీరు అప్పుగా తెచ్చి ఉండాలి! 

పై రెండు లెక్కల్లో ఎక్కడా తేడా లేదు. అంతా క్లియర్‌. కానీ... వైసీపీ సర్కార్‌ లెక్కల్లో ఎక్కడో తేడా కొడుతోంది. సొంత ఆదాయానికీ, తెచ్చిన అప్పులకు... చూపుతున్న ఖర్చులకూ పొంతన కుదరడంలేదు. వేలకు వేల కోట్లు తేడా వస్తోంది. ఆ మొత్తం ఎక్కడ ఖర్చు పెట్టారో, ఎలా పెట్టారో సర్కారు వారికే తెలియాలి! 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరోనా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం తగ్గలేదు. పైగా... పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇస్తోంది. అయినా సరే... ‘వారాలబ్బాయి’లాగా ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు తట్టి రూ.2వేల కోట్ల రుణం తెచ్చుకుంటున్నారు. అడ్డదారుల్లో వెళుతూ, ఆస్తులు - భవిష్యత్‌ ఆదాయాన్నీ తాకట్టు పెట్టి కొత్త అప్పులు తెస్తూనే ఉన్నారు. పోనీ... ఇలా తెచ్చిన అప్పులతో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేస్తున్నారా? ఆస్తులు సృష్టిస్తున్నారా? అప్పట్లో ‘అమరావతి’లాగా ఇప్పుడు ఎక్కడైనా, ఏదైనా కడుతున్నారా? అంటే ఏదీ లేదు! పేరు, తీరు మార్చి అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరి... ఎడాపెడా తెస్తున్న వేల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి? ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న అధికారిక లెక్కల ప్రకారమే... రెండున్నరేళ్లలో 1.31 లక్షల కోట్ల రూపాయలకు లెక్క తేలడం లేదు! అది ఏమైందో... ఎక్కడికి 

పోయిందో! ఈ మొత్తాన్ని రాష్ట్రం కోసం వినియోగించలేదని ప్రాథమికంగా అర్థమవుతోంది. గతంలో రూ.41,000 కోట్ల మేర బిల్లుల గోల్‌మాల్‌ జరిగిందని ప్రిన్సిపల్‌ అకౌంటింగ్‌ జనరల్‌ గుర్తించి రాష్ట్రాన్ని వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఇంతవరకు దానిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. అదే తరహాలో రూ.1,31,000 కోట్లకు కూడా గోల్‌మాల్‌ జరిగిందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.


ఎక్కడికి పోయినట్లు?

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు-ఆదాయం-ఖర్చు లెక్కల్లో ఏదో తెలియని గుట్టు దాగుందని బడ్జెట్‌ పుస్తకాలు చూస్తేనే తెలుస్తుంది.  అధికారిక లెక్కల ప్రకారమే... జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది, అంటే 2019-20లో ప్రభుత్వానికి రూ.1,11,000 కోట్లు వచ్చింది. ఆ ఏడాది పెట్టిన ఖర్చు రూ.1,74,000 కోట్లు. 2020-21లో ప్రభుత్వానికి రూ.1,18,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ సంవత్సరం పెట్టిన ఖర్చు రూ.1,86,000 కోట్లు. కాగ్‌ లెక్కల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల ఆదాయం (సెప్టెంబరు  వరకు) రూ.65,000 కోట్లు. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ప్రభుత్వ ఖర్చు రూ.77,124 కోట్లు. ఆగస్టు, సెప్టెంబరు నెలల ఖర్చుల వివరాలు కాగ్‌  ఇంకా వెల్లడించలేదు. మొదటి నాలుగు నెలల సగటు ప్రకారం లెక్కేస్తే... సెప్టెంబరు వరకు ఖర్చు రూ.90,000 కోట్లు. వెరసి... ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి అన్నిరకాలుగా వచ్చిన ఆదాయం రూ.2,94,000 కోట్లు! ప్రభుత్వం చేసిన ఖర్చు... రూ.4,50,000 కోట్లు! సింపుల్‌గా చెప్పాలంటే... ఆదాయాన్ని మించిన జరిగిన వ్యయమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. పై లెక్కల ప్రకారం అది రూ.1,56,000 కోట్లు! ఏం చెప్పినా, ఎలా చేసినా... ఈ రెండున్నరేళ్లలో ఇంతకుమించి అప్పు చేసి ఉండకూడదు. అలా చేయడానికి వీల్లేదు కూడా! కానీ... ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,87,000 కోట్లు. అంటే... రూ.1,31,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చారు. ఈ లెక్క గురించి బడ్జెట్‌ పుస్తకాల్లో రాయలేదు. ‘కాగ్‌’కు చెప్పలేదు. అంటే... అధికారికంగా ఖజానా (ట్రెజరీ)కు అందకుండానే, ఎక్కడో ఖర్చయిపోయింది. ఒకవేళ ఈ నిధులు ఖజానాలోనే ఉంటే ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు! రూ.1,56,000 కోట్ల అప్పునకు బడ్జెట్‌ పుస్తకాల్లో, కాగ్‌ నివేదిక ద్వారా సమాధానం చెప్పిన ప్రభుత్వం... ఈ రూ.1,31,000 కోట్ల అప్పును ఎందుకు దాచింది? ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేసింది? ఇది ఆర్థిక నిపుణులను వేధిస్తున్న ప్రశ్న!


ఇవీ లెక్కలు... 

రాష్ట్రానికి ప్రతి నెలా రూ.11,000 కోట్ల ఆదాయం వస్తోంది. జీతాలు, పెన్షన్లకు సుమారు రూ.5500 కోట్లు అవసరం. సామాజిక పింఛన్లకు రూ.1450 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుల తిరిగి చెల్లింపు, వడ్డీలకు ప్రతినెలా రూ.3500 కోట్లు చెల్లిస్తున్నారు. ఇవన్నీ తప్పనిసరి ఖర్చులు. అన్నీ కలిపి... 10,450 కోట్లు. అంటే... సర్కారుకు సొంతంగా వచ్చే ఆదాయంతోనే ఈ చెల్లింపులన్నీ జరిగిపోతాయి. అయినా సరే... ప్రతినెలా సగటున రూ.6వేల కోట్ల అప్పులు తెస్తున్నారు. వెరసి... సొంత ఆదాయం, అప్పులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.17వేల కోట్లు ఉంటున్నాయి. అయినాసరే... జీతాలు, పెన్షన్లు 15వరకు ఇవ్వలేకపోతున్నారు. కొత్త గా అప్పు చేస్తే తప్ప జీతాలకు సర్దుబాటు చేయలేని పరిస్థితి. జీతాలు పెన్షన్ల కోసం స్వల్పకాలిక రుణాలు (ఓడీ) తీసుకోవడం, ఆ ఓడీ చెల్లించేందుకు మంగళవా రం సెక్యూరిటీల వేలంద్వారా దీర్ఘకాలిక అప్పు చేయ డం! గత 14 నెలలుగా ఇదో నిరంతర ప్రక్రియలా సా గుతూనేఉంది. అప్పు తెచ్చి జీతాలు ఇస్తూ... ్ఞఅది తీర్చడానికి మళ్లీ అప్పు చేస్తున్నప్పుడు...వచ్చిన ఆదాయమంతా ఎక్కడికి పోతోంది? ఇది  తలపండిన ఆర్థిక నిపుణులకు కూడా అర్థంకాని విషయంలా మారింది.


లక్ష కోట్ల అప్పులు.. వేల కోట్ల బాదుడు

ఈ రెండున్నరేళ్లలో జగన్‌ సర్కారు ఏడాదికి సగటున రూ.1.14,000 కోట్ల అప్పులు చేసింది. ప్రతి ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంది. అయినా... ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వలేరు. రిటైర్డ్‌ ఉద్యోగులకు 10వ తేదీ దాటినా పూర్తిగా చెల్లింపులు చేయలేరు. డీఏలు, పీఆర్సీలు, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు... అన్నీ పెండింగ్‌. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని, రోడ్‌ డెవల్‌పమెంట్‌ సెస్‌ను, ఇంకా కేంద్రం పలురకాల అవసరాలకు ఇచ్చిన సొమ్ములనూ మళ్లిస్తున్నారు. అభివృద్ధి కుంటు పడింది. కాంట్రాక్టర్లు, సప్లయర్లకు దాదాపు రూ.80వేల కోట్ల బిల్లులు పెండింగ్‌! ఇది చాలదని... ఒకే చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి, మరో చేత్తో జనం నుంచి లాగేసుకుంటున్నారు. కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. కొత్తగా చెత్త పన్ను వేశారు. ఆస్తి పన్ను పెంచారు. మద్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి చొప్పున సెస్‌ వసూలు చేస్తున్నారు. ఇలా ఏటా రూ.10వేల కోట్లు బాదుతున్నారు. మద్యంపై అదనపు పన్ను ద్వారా ఐదు నెలల్లో రూ.1600 కోట్లు వచ్చిందని ప్రభుత్వమే కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పింది. ఇంత చేసినా... మళ్లీ అప్పులే అప్పులు! తెచ్చిన అప్పులకు సక్రమంగా లేని లెక్కలు!



Updated Date - 2021-10-14T08:03:48+05:30 IST