ఆచార్యా.. ఎక్కడ?

ABN , First Publish Date - 2021-06-18T09:33:12+05:30 IST

ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లోని దుస్థితి ఇది! ఎంతో కీలకమైన ఉన్నత విద్యపై సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమిది!

ఆచార్యా.. ఎక్కడ?

  • యూనివర్సిటీల్లో మూడు వంతులు ఖాళీలే
  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రొఫెసర్‌ పోస్టులు 2,979
  • విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులు ఏకంగా 2,152
  • నాలుగేళ్ల కిందట 1,061 పోస్టుల భర్తీకి ఓకే
  • అప్పటి నుంచి ముందుకు కదలని ప్రక్రియ
  • తక్షణం భర్తీ చేయాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లోని దుస్థితి ఇది! ఎంతో కీలకమైన ఉన్నత విద్యపై సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమిది! పదేళ్లుగా వీటిలో నియామకాల్లేవ్‌! నాలుగేళ్ల కిందట 1,061 పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు! నాలుగేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి! ఇటు నియామకాలూ లేవు. అటు ఉన్న వారికి పదోన్నతులూ లేవు. వెరసి, ఒక్క మాటలో చెప్పాలంటే, సిబ్బంది లేని యూనివర్సిటీలు ప్రస్తుతం నామ్‌కే వాస్తేగా నడుస్తున్నాయంతే! ఇదే పరిస్థితి కొనసాగితే ఉన్నత విద్య కాస్తా ఉత్త విద్యగా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఆగమేఘాలపై పోస్టులను సృష్టించగలదని, భర్తీ చేయగలదని, కానీ, ఉన్నత విద్యపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. విశ్వ విద్యాలయాల్లో పదేళ్లుగా కొత్త నియామకాల్లేవు. 


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో పెద్దఎత్తున అధ్యాపక పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో 2017లో ప్రభుత్వం 1,061 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. నిజానికి, అప్పటికి అన్ని వర్సిటీల్లో 1,700 వరకూ ఖాళీలున్నాయి. అన్నిటినీ భర్తీ చేయకపోయినా కనీసం 1,061 పోస్టులతో సమస్యలు పరిష్కారం అవుతాయని వర్సిటీలు భావించాయి. వీటిలో 99 ప్రొఫెసర్‌, 270 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 692 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆలోపు, వైస్‌ చాన్సలర్ల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయి వీసీలు లేరు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సర్కారు ఇన్‌చార్జిలుగా నియమించింది. కానీ, వాళ్లు పోస్టుల భర్తీపై దృష్టి సారించలేదు. ఈ నాలుగు సంవత్సరాల్లో మరో 400 మందికిపైగా బోధన సిబ్బంది పదవీ విరమణ చేశారు. ఇప్పుడు మొత్తం ఖాళీల సంఖ్య 2,152కి చేరింది. 


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో 2,979 బోధనా సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 827 మంది మాత్రమే ఉన్నారు. అంటే, మొత్తం పోస్టుల్లో కేవలం 28% మంది మాత్రమే బోధన సిబ్బంది ఉండగా.. 72ు ఖాళీయే. ప్రస్తుత పరిస్థితుల్లో 1,061 పోస్టులను భర్తీ చేసినా.. సమస్య పరిష్కారం కాదు. వాటిని కూడా భర్తీ చేయకపోవడంతో విశ్వవిద్యాలయాల పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాత్కాలికంగా కొంతమంది అధ్యాపకులను నియమించినా.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వారి సంఖ్య లేదు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత ఏడాదంతా విద్యా బోధన ఆన్‌లైన్‌లోనే సాగింది. అధ్యాపకులు లేక తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.


వీసీలను నియమించినా..

యూనివర్సిటీలకు వీసీలు లేకపోవడంతో ఖాళీల భర్తీ నిలిచిపోయిందని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత ప్రభుత్వం ఇటీవలే 10 యునివర్సిటీలకు ఉప కులపతులను నియమించింది. ఇక ఇప్పుడు ఖాళీలపై కూడా దృష్టి సారిస్తుందని భావించారు. కానీ, దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి కసరత్తు ప్రారంభం కాలేదు. వర్సిటీల్లో మూడు వంతుల మేర బోధన సిబ్బంది పోస్టులు ఖాళీ ఉంటే ఇక వాటిలో విద్యా నాణ్యత ఎలా సాధ్యమని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.


వర్సిటీల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ

యునివర్సిటీ టీచర్ల సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో గత పదేళ్లుగా నియామకాలు జరగలేదు. దీని ప్రభావం వర్సిటీల్లో విద్యా నాణ్యతపై పడుతోంది. ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందుతున్నా.. కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఏటా ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉన్న బోధన సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. నాలుగేళ్ల క్రితం ప్రకటించిన ఖాళీలతోపాటు ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమన్న వాస్తవాన్ని పాలకులు విస్మరించకూడదు.

- తూమాటి మాధవి కుమారి, ఉపాధ్యక్షురాలు, తెలంగాణ 


పీహెచ్‌డీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం

యునివర్సిటీల్లో నియామకాల ప్రక్రియ జరగకపోవడంతో ఎక్కువ నష్టం పీహెచ్‌డీ అభ్యర్థులకే జరుగుతోంది. పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ చేయాలంటే సీనియర్‌ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ.. కొత్త నియామకాలు జరగకపోవడం, ఉన్నవారికి పదోన్నతులు ఇవ్వకపోవడంతో పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ అర్హత ఉన్నవారు వర్సిటీల్లో చాలా తక్కువగా ఉన్నారు. ఉస్మానియాలో లింగ్విస్టిక్‌ డిపార్ట్‌మెంట్లో ఉన్న ఒక్కగానొక్క సీనియర్‌ ప్రొఫెసర్‌ రిటైర్‌ అయినా.. ఆయన వద్దే గైడ్‌షిప్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరతతో ఏటా వేయాల్సిన పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్లు గత ఏడేళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే వేశారు. దీంతో విద్యార్థులు పీహెచ్‌డీ చేయలేకపోతున్నారు.

- గద్దల అంజిబాబు, ఉస్మానియా జేఏసీ నాయకుడు

Updated Date - 2021-06-18T09:33:12+05:30 IST