సాయం ‘సందిగ్ధం’

ABN , First Publish Date - 2021-06-20T03:41:44+05:30 IST

సాయం ‘సందిగ్ధం’

సాయం ‘సందిగ్ధం’

కరోనా మృతుల కుటుంబాలకు ఊసులేని‘సాయం’ 

కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై స్పష్టత కరువు

ఆశతో కలెక్టర్‌ కార్యాలయాలకు వెళుతున్నబాధిత కుటుంబీకులు

తిరస్కరిస్తున్న అధికారులు

‘కరోనాతో మృతిచెందిన వారికి కేంద్రప్రభుత్వం డిజాస్టర్‌ మానేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద రూ.4లక్షలు మంజూరు చేస్తుందన్న వార్తలు ఇటీవల సామాజిక మాద్యమాల్లో ప్రచారమవుతున్న నేపధ్యంలో బాధిత కుటుంబాల సభ్యులు ప్రభుత్వం సహాయం కోసం ఆశగా వెళుతున్నా వారికి నిరాశే ఎదురవుతోంది. తన భర్త కరోనాతో చనిపోయాడంటూ.. ఓ భార్య, తన తండ్రి కొవిడ్‌తో మృత్యువాత పడ్డాడంటూ ఓ కుమారుడు. ఇలా ఎంతో మంది కరోనాకు బలైన కుటుంబాలు బధితులుగా ప్రఽభుత్వ ఆర్థిక సహాయం కోసం ఆశగా కలెక్టరేట్‌ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో, మునిసిపల్‌ కార్యాలయాల్లో కరోనాతో మృతి చెందిన కుటుంబీకులు  మరణ  ద్రువపత్రాల కోసం బారులు తీరుతున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఉత్తర్వులు కానీ, ఆదేశాలు కానీ రాలేదంటూ తిరస్కరిస్తున్నారు. ఫలితంగా దరఖాస్తుదారులు నిరాశగా వెనుదిరిగి పోతున్నారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 19: జాతీయ విపత్తుల కింద కేంద్ర ప్రభుత్వం 12రకాల నష్టాలను గుర్తించి వాటిని పరిహారానికి పరిగణిస్తోంది. కొండచరియలు విరిగిపడడం, హిమ ఉత్పాతాలు, భారీ వరదలు, తుఫానులు, సునామీ లు, ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు డిజాస్టర్‌ మానేజ్‌మెంట్‌ (విపత్తుల నిర్వహణ చట్టం) కింద పరిహారాన్ని అందిస్తోంది. ఇటీవలి కాలంలో పిడుగుపాటును కూడా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కిందికి తీసుకొచ్చి బాధితులకు పరిహారాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. 

కరోనా విపత్తు కాదా ?

కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కొవిడ్‌ నివారణ చర్యలను డిజాస్టర్‌ మానేజ్‌మెంట్‌ నిధుల నుంచి వినియోగిస్తోంది. కరోనాను దేశవ్యాప్తంగా ఓ పెద్ద విపత్తుగా గుర్తించి లాక్‌డౌన్‌ను కూడా అమలుచేస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన వారినుంచి భారీగా అపరాధరుసుములను కూడా వసూలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 18వేల 283కేసుల ద్వారా పోలీసు శాఖ ప్రజల నుంచి లక్షలాది రూపాయలను అపరాధ రుసుముగా  వసూలు చేసింది. మరి ఇలాంటి చర్యలు చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రక ృతి విపత్తుతో మరణించిన కరోనా కుటుంబాలను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావకపోవడం గమనార్హం.

కరోనాతో జిల్లాలో 520 మంది మృతి

కరోనా సెకండ్‌వేవ్‌లో ఈ ఏడాది మార్చి 1నుంచి శుక్రవారం నాటికి అంటే మూడునెలల 20రోజుల్లో 520మంది మృతి చెందారు. జిల్లాలో గత రెండేళ్లుగా కరోనా విలయతాండవం చేస్తోంది. దాదాపు 80శాతం కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. చాలా కుటుంబాల్లో కరోనా విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో వృద్ధులు, యువతీయువకులు కూడా కరోనాకు బలయ్యారు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులు అనాధలైన సంఘటనలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రప్రభుత్వం ప్రకటించినా అటువంటివారు కేవలం 2శాతం మంది కూడా ఉండరనేవి గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కేంద్రప్రభుత్వం ఆదుకుంటుదని సామాజికమాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో మృతుల కుటుంబీకులు దరఖాస్తులు చేసుకునేందుకు కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. పంచాయతీలు, నగరాలు, పట్టణాల్లో జనన మరణాల విభాగంలో దరఖాస్తుల కోసం కరోనా మృతుల కుటుంబీకులు బారులు తీరుతున్నారు. ద్రువీకరణ పత్రాల్లో కరోనాతో మృతి చెందినట్లు కూడా దృవీకరించకపోవడం గమనార్హం. దీంతో కరోనాతో మృతి చెందినట్లు ధ్రువపత్రాల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 

ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు

ఎన్‌ మధుసూదన్‌, ఖమ్మం అదనపు కలెక్టర్‌ 

కరోనా మృతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కేంద్రప్రభుత్వం ప్రకటించిందని చెబున్నా అందులో స్పష్టత ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డిజాస్టర్‌ మానేజ్‌మెంట్‌ కింద నిధులు ఖర్చుచేస్తున్నా, మృతుల కుటుంబాలకు మాత్రం పరిహారంపై ఎలాంటి దరఖాస్తులు తీసుకోవాలని సూచించలేదు. అందుకే దరఖాస్తుదారులు వచ్చినా తిరస్కరిస్తున్నాం. అయితే కరోనాతో మృతి చెందినట్లు ద్రువీకరణ పత్రాలను ప్రభుత్వ పరీక్షకేంద్రలో ఆన్‌లైన్‌లో పాజిటివ్‌ పరీక్ష చేయించుకున్న రిజిస్ర్టేషన్‌నెంబర్‌ను, ఆ తర్వాత చికిత్స పొందిన రశీదులను భద్రపరుచుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వం ఏమైనా సహాయాన్ని ప్రకటిస్తే ఉపయోగపడుతుంది. 



Updated Date - 2021-06-20T03:41:44+05:30 IST