బీమా ఏమాయె..

ABN , First Publish Date - 2022-01-17T06:01:49+05:30 IST

రైతులకు ప్రస్తుతం పంట బీమా పథకాలేవి అమలు కావడం లేదు. అకాల వర్షాల వల్ల పంటలు కోల్పోయిన అన్నదాతలకు పరిహారం లభించే అకాశమే లేకుండా పోయింది. వారు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులొచ్చినా రైతులు పంట నష్టపోతున్నారు. సీజన్లన్నీ అతలాకుతలం అవుతున్నాయి.

బీమా ఏమాయె..

అటకెక్కిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పథకాలు
ముఖం చాటేస్తున్న ప్రైవేటు కంపెనీలు
అకాల వర్షంతో అన్నదాత ఆగమాగం
దెబ్బతిన్న పంటలకు అందని పరిహారం
రైతు యూనిట్‌ బీమా ప్రతిపాదనతోనే సరి
మొన్నటి అకాల వర్షాలకు రూ.105 కోట్ల పంట నష్టం


హనుమకొండ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ప్రస్తుతం పంట బీమా పథకాలేవి అమలు కావడం లేదు. అకాల వర్షాల వల్ల పంటలు కోల్పోయిన అన్నదాతలకు పరిహారం లభించే అకాశమే లేకుండా పోయింది. వారు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులొచ్చినా రైతులు  పంట నష్టపోతున్నారు. సీజన్లన్నీ అతలాకుతలం అవుతున్నాయి. వర్షాకాలం, చలికాలం, ఎండా కాలం అంటూ స్పష్టంగా గీతలు గీయలేని పరిస్థితి ఏర్పడుతోంది. కరువు, వర్షాభావ పరిస్థితులు,  తక్కువ వర్షాలు, భారీ వర్షాలు, వడగండ్ల వానలు, బీకర గాలులు,  వడగాల్పులు, వరదలు, తుఫాన్లు ఒకటేమిటి, ఒక్కోసారి అన్నీ ఒకే సీజన్‌లో కనిపిస్తూ రైతులకు నష్టం కలుగ చేస్తున్నాయి. ప్రభుత్వాలు దయదలచి, జరిగిన నష్టాన్ని లెక్కిస్తేనే రైతులకు పరిహారం, పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అంతుంది.  వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతుకు పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతివైపరీత్యాల వల్ల నోటికంద కుండా పోయేసరికి ఆర్థికంగా చితికి పోతున్నారు.

అకాల వర్షం అపార నష్టం
గత మంగళవారం  కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ. 105 కోట్ల మేర పంట నష్టం జరిగింది. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్‌ జిల్లాలో పంటలు తీవ్రంగా  దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లాలో 83 గ్రామాలలో 2500 మంది రైతులకు చెందిన రూ.14 కోట్ల విలువైన 4760 ఎకరాల మిర్చి, మొక్కజొన్న, పసుపుతో పాటు అరటి, పుచ్చ తదితర పండ్ల  తోటలు దెబ్బతిన్నాయి. వరంగల్‌ జిల్లాలో 18946 మంది రైతులకు చెందిన 24005 ఎకరాల మేర పంటలు దెబ్బతింది. సుమారు రూ. 81 కోట్లు, జనగామ  జిల్లాలో 1147 ఎకరాల మేర పంటలు దెబ్బతిని రూ. 2 కోట్ల నష్టం వాటిల్లింది. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రూ. రెండేసి కోట్ల మేరకు పంట నష్టం జరిగింది. ఫసల్‌ బీమా యోజన పథకం అమలులో లేకపోవడం వల్ల బాధిత రైతులకు పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది.

గతంలో ఆలస్యంగానైనా వచ్చేవి..
గతంలో పంటల బీమా అమలైనప్పుడు నష్టపోయిన రైతులకు కాస్త ఆలస్యంగానైనా ఎంతోకొంత పరిహారం దక్కేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా లేకుండా పోయే సరికి అన్నదాత అభద్రతా భావానికి లోనవుతున్నాడు. పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు భయం భయంగా బతుకుతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పంటలకు గత రెండేళ్లుగా బీమా పథకాల అమలు నిలిచిపోయింది. పంటల బీమాకు చెల్లించే  ప్రీమియం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడం, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చెల్లించాల్సిన ప్రీమియంను చెల్లించక పోవడంతో రాష్ట్రంలో బీమా పథకాలు అటెకెక్కాయి. ప్రైవేటు బీమా కంపెనీలు కూడా పంటల బీమాకు ముందుకు రావడం లేదు.

ఆర్భాటంగా..

జాతీయ వ్యవసాయ బీమా పథకం కొంత కాలం అమలైనా, దానిలో ఉన్న నిబంధనల వల్ల ఎక్కువ మంది రైతులు బీమా పరధిలోకి రాలేకపోయారు. మొత్తం రైతులలో బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య ఎప్పుడూ పది శాతం దాటలేదు. పరిహారం పరంగా ఈ పథకం రైతులను పెద్దగా ఆదుకోలేదు.  

నిలిచిన ఫసల్‌ బీమా..

ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం రైతులకు క్రమంగా దూరమైంది. బీమా  ప్రీమియంను రైతు సగం చెల్లిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన సగం ప్రీమియంను బీమా అమలు కంపెనీలకు చెల్లించేవి. బ్యాంకు నుంచి పంట రుణం తీసుకున్న ప్రతీ రైతు వద్ద నుంచి ప్రీమియంను తప్పనిసరిగా తీసుకునేవారు. కాగా, కిందటేడాది నుంచి ప్రీమియం చెల్లింపును రైతుల ఐచ్ఛికానికి వదిలేశారు. దీంతో పాటుగా కేంద్రం తన వాటాను తగ్గించుకోగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఫసల్‌ బీ మా పథకానికి, పంట కోత పరీక్షల ఆధారంగా వచ్చే సగటు దిగుబడులు మాత్రమే ఆధారం. ఈ పంట కోతల పరీక్షల ఫలితాలు పారద్శకంగా లేవు. పైగా జిల్లాలు, మండలాల విభజన జరిగిన తర్వాత గత అయిదు సంవత్సరాల పంట కోత పరీక్షల వివరాలు గందరగోళంగా తయారయ్యాయి.

12 పంటలకు..
గతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రైతులు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా 12  పంటలకు లబ్దిపొందారు. ఇందులో వరికి గ్రామం యూనిట్‌గా, మక్క, కంది, పెసర,  మినుము, సోయా, పసుసు, వేరుశనగ, నువ్వు పంటలకు మండలం యూనిట్‌గా బీమా ఉండేది. పత్తి, మిరప, మామిడికి వాతావరణ పంటల బీమాను అమలు చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం వానా కాలం పంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనందు వల్ల రైతులు వీటికి ప్రీమియంను చెల్లించలేకపోయారు. కేవలం బీమా సంస్థ ద్వారా జిల్లాలో పత్తి, మిరపలకు వాతావరణ పంటల బీమాను అమలు చేస్తుండగానే రైతులు ప్రీమీయం  చెల్లించారు. అది కూడా ఇప్పుడు లేకుండా పోయింది.

ప్రీమియం చెల్లించినా..

గత సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 25 వేలకుపైగా ఎకరాల్లో వరి, మొక్క, పత్తి,  పసుపు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కానీ బీమా లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం రైతువారీ నష్టాన్ని లెక్కించకపోవడంతో పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. బీమా అమల్లోకి వచ్చిన 2000 సంవత్సరం నుంచి అన్ని రకాల పంటల బీమా కలిపి రూ. 108 కోట్ల వరకు రైతులు ప్రీమియం చెల్లించగా ప్రభుత్వం కూడా ఇంతే మొత్తంలో ప్రీమియంను కంపెనీలకు చెల్లించింది. కానీ అన్ని సీజన్లలో కలిపినా కంపెనీల ద్వారా వచ్చిన పరిహారం రూ. 108 కోట్లు దాటలేదు. ఉమ్మడి జిల్లా అన్ని రకాల పంటలు కలిపి రూ. 350 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.

బీమా పథకాల కింద పంటలకు జరిగిన నష్టాన్ని లెక్కించడానికి ప్రస్తుతం మండలా న్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు. దీని వల్ల జరిగిన నష్టాన్ని మొత్తంగా లెక్కిస్తే సరాసరి కన్నా తక్కువగా ఉండడంతో పరిహారం ని జంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని బీమా పథకాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఎ ప్పటి   నుంచో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప టి వరకు జిల్లాకు ఒక్క పంటను మాత్రమే గ్రామ యూనిట్‌గా అమలు చేస్తున్నాయి. మిగిలిన  పంటలన్నీ మండలం యూనిట్‌గా ఉన్నాయి. ఫలితంగా రైతులకు సరైన పరిహారం అందడం లేదు.

Updated Date - 2022-01-17T06:01:49+05:30 IST