Hyderabad సిటీ టూర్‌ బస్సులు ఎక్కడ.. ఎవరూ పట్టించుకోరేం!?

ABN , First Publish Date - 2021-07-31T17:12:24+05:30 IST

భాగ్యనగర పర్యాటకాన్ని అన్ని వర్గాల ప్రజలు సులువుగా సందర్శించేందుకు...

Hyderabad సిటీ టూర్‌ బస్సులు ఎక్కడ.. ఎవరూ పట్టించుకోరేం!?

  • అందుబాటులోకి రాని ‘హాఫ్‌ ఆన్‌-హాఫ్‌ ఆఫ్‌’ బస్సులు
  • కొవిడ్‌ మొదటి దశ నుంచే మూలకుపడిన వైనం
  • కేసులు తగ్గినా.. పట్టించుకోని టూరిజంశాఖ ఉన్నతాధికారులు

హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగర పర్యాటకాన్ని అన్ని వర్గాల ప్రజలు సులువుగా సందర్శించేందుకు తీసుకొచ్చిన ‘హాఫ్‌ ఆన్‌-హాఫ్‌ ఆఫ్‌’ బస్సులు మూలకుపడ్డాయి. మాయదారి కరోనా నేపథ్యంలో పదహారు నెలలుగా అందుబాటులోకి రాకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు వివిధ జిల్లాల నుంచి వస్తున్న కొందరు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేట్‌ వాహనాలకు అధిక ఛార్జీలు వెచ్చిస్తూ కుటుంబసభ్యులతో నచ్చిన ప్రదేశాలను తిలకి స్తున్నారు. మరికొందరు బస్సులు లేకపోవడంతో టూరిజం సందర్శనలకు వెనకంజ వేస్తున్నారు.  


2015లో బస్సులు ప్రారంభం..

హైదరాబాద్‌ మహానగరంలో నిజాం కాలం నాటి కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, గార్డెన్లు, హుస్సేన్‌సాగర్‌ సందర్శకులను ఆకట్టుకుంటాయి. ప్రధానంగా గోల్కొండ, చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, జూపార్కు, బిర్లామందిర్‌, చౌమహల్లా ప్యాలెస్‌లు ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్దులను చేస్తుంటాయి. అయితే హైదరాబాద్‌ నగరంతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు పండగలు, సెలవు రోజుల్లో సిటీ టూరిజాన్ని తిలకించేందుకు వస్తుంటారు. వీరితోపాటు వివిధ పనుల నిమిత్తం భాగ్యనగరానికి వచ్చే పొరుగు రాష్ర్టాల ప్రజలు, విదేశీయులు సైతం పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. సందర్శకుల సౌకర్యార్థం 2015 జూన్‌లో తక్కువ టికెట్‌ ఛార్జీలతో కూడిన ‘హాఫ్‌ ఆన్‌-హాఫ్‌ ఆఫ్‌’ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఒకే బస్సు ద్వారా వివిధ పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను తిలకించే వెసులుబాటు కల్పించారు.


16 నెలలుగా బంద్‌..

మాయదారి కరోనా నేపథ్యంలో తెలంగాణ పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. మొదటి దశ కొవిడ్‌ కేసుల కారణంగా గతేడాది మార్చి 16 నుంచి పర్యాటక ప్రాంతాలను మూసివేయాలని ప్రభుత్వం ప్రకటింది. ఆ తర్వాత కరోనా ఆంక్షలకు లోబడి 2020 సెప్టెంబర్‌ 27 నుంచి పార్కులు, పర్యాటక ప్రాంతాలు, గార్డెన్లు తెరుచుకున్నప్పటికీ తక్కువ ధరతో కూడిన సిటీ టూరిజం బస్సులు అందుబాటులోకి రాలేదు. కాగా, రెండో దశ లాక్‌డౌన్‌  జూన్‌ 21 నుంచి ఎత్తివేసినప్పటికీ బస్సుల నిర్వహణను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతంలో అన్ని ప్రాంతాలను సరదాగా చుట్టేసిన వారు.. ప్రైవేట్‌ వాహనాల ఛార్జీల భారంతో ఒకటి, రెండు ప్రదేశాలను మాత్రమే సందర్శిస్తున్నారు. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన తరుణంలో ఇప్పటికే హైదరాబాద్‌లో అన్ని రకాల రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ  సిటీటూర్‌ బస్సులను రోడ్లపైకి తీసుకురాకపోవడంపై పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.


బస్సులను నడిపించాలి.. 

నగర పర్యాటకాన్ని తిలకించేందుకు అనుకూలంగా ఉండే ‘హాఫ్‌ ఆన్‌-హాఫ్‌ ఆఫ్‌’ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలి. కొవిడ్‌తో ఏడాదిన్నర కాలంగా ఎక్కడికి వెళ్లలేకపోయాం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా వార్తలు వస్తున్నందున మధ్య తరగతి ప్రజలు చార్మినార్‌, గోల్కొండ లాంటి ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పర్యాటకశాఖ అధికారులు వెంటనే టూర్‌ బస్సులను నడిపించాలి. లేకుంటే ఆటోలు, క్యాబ్‌ల్లో అధిక ఛార్జీలు పెట్టి వెళ్లలేని పరిస్థితి ఉంది. - కె. వీరయ్య, బాగ్‌లింగంపల్లి

Updated Date - 2021-07-31T17:12:24+05:30 IST