ప్లాస్మా దాతలేరీ?

ABN , First Publish Date - 2020-07-29T08:57:37+05:30 IST

హైదరాబాద్‌లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 71 సంవత్సరాల వృద్ధుడికి

ప్లాస్మా దాతలేరీ?

  • అర్థం లేని అపొహలతో ముందుకు రాని వైనం.. 
  • ఇచ్చేవారు లేక అల్లాడుతున్న కొవిడ్‌ రోగులు

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 71 సంవత్సరాల వృద్ధుడికి కరోనా సోకింది! ప్రస్తుతం క్రిటికల్‌ కేర్‌లో ఉన్నారాయన. ఆయనకు అవసరమైన బీ పాజిటివ్‌  ప్లాస్మా కోసం మూడు రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా దొరకలేదు. ఆయనొక్కరే కాదు.. కరోనా బారిన పడి క్రిటికల్‌ కేర్‌లో చికిత్స పొందుతున్న చాలా మంది ప్లాస్మా దాతల కో సం ఎదురుచూస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమిస్తున్నా.. ప్లాస్మా దానం చేసేవారు లేక బాధతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలో సోమవారం వరకూ మొత్తం 55,532 కేసులు నమోదు కాగా.. అందులో  42,106 మంది కోలుకున్నారు.


అంతమంది రీకవరీ అయినా ప్లాస్మా దానం చేసేందుకు అత్యధికులు ముందుకు రావట్లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తమ ప్లాస్మాతో మరో ప్రాణం నిలుస్తుందన్న స్పృహ చాలామందిలో ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైర స్‌ బారిన పడి కోలుకున్నవారిలో చాలామంది ప్లాస్మా దానానికి ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం.. అర్థం లేని అపోహలే. ప్లాస్మా ఇస్తే తమలో ఉన్న రోగనిరోధక శక్తి తగ్గి.. ఎక్కడ కరోనా మళ్లీ వస్తుందోనన్న భ్రమలో వారు ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితి మనదగ్గరే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. 


ప్లాస్మా ఎవరికి అవసరం...

ప్రస్తుతం మన దగ్గర నమోదవుతున్న వైరస్‌ కేసుల్లో 80 శాతం మందికి ఎటువంటి లక్షణాలూ ఉండట్లేదు. లక్షణాలున్న మిగిలిన 20 శాతం మందిలో కూడా 17 శాతం మం దికి ఆక్సిజన్‌ అవసరం రావట్లేదు. 3 శాతం మందికే ఆక్సిజన్‌ కావాల్సివస్తోంది. వారిలోనూ కేవలం 2% మంది ఐసీయూకు వెళ్తుండగా.. ఒక శాతం మంది ఆక్సిజన్‌తో కోలుకుంటున్నారు. ఈ మూడు శాతం మందిలోనే కొందరికి ప్లాస్మా అవసరం ఏర్పడుతున్నట్లు ఇప్పటిదాకా వెలువడిన గణాంకాలు సూచిస్తున్నాయి. కరోనాబారిన పడి కోలుకున్నవారిలో కొందరు ప్లాస్మా దానానికి ముందుకొస్తున్నా.. వారిలో కొంతమందిలో తగినంత యాంటీబాడీస్‌ ఉండట్లేదని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకినా లక్షణాలు కనిపించనివారిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందట్లేదని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలున్న 20 శాతం మందిలోనే ఇతరులకు దానం చేసే స్థాయిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందుతున్నట్టు వారు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ప్లాస్మాకు అన్ని చోట్లా బాగా డిమాండ్‌ ఉంది. అవగాహన లేమి వల్ల చాలామంది ముందుకు రావట్లేదు. దీంతో.. ప్లాస్మా ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో  ప్రాధాన్యం ఇస్తామని అసోం సర్కారు ప్రకటించింది. 


ప్లాస్మా దానంతో పునర్జన్మ: నారాయణరెడ్డి

ప్లాస్మాదానంతో మరో ఇద్దరికి పునర్జన్మను ఇచ్చినట్లవుతుందని తెలంగాణ ప్లాస్మా డోనర్స్‌ అసోసియేషన్‌ (టీపీడీఏ) వ్యవస్థాపకుడు గూడురు నారాయణరెడ్డి అన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న ఆయన.. ప్లాస్మాదానం చేయడమే కాక, ఇతరులతోనూ చేయించేందుకు కృషి చేస్తున్నారు.

Updated Date - 2020-07-29T08:57:37+05:30 IST