Abn logo
Apr 7 2021 @ 13:45PM

స్పీడ్ తగ్గించిన ఠాగూర్.. ఇంతకీ ఆయనెక్కడ?

టీకాంగ్రెస్‌ నేతలపై ఠా'గుర్రు'..! 


రాష్ట్రానికి రావడంతోనే దూకుడు ప్రదర్శించిన ఏఐసీసీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఇప్పుడు స్పీడ్ ఎందుకు తగ్గించారు? బలగాన్ని మొత్తం వెంటబెట్టుకుని వెళ్లి దుబ్బాకలో తిష్ట వేసి ప్రచారం చేసిన ఆయన సాగర్ ఉప ఎన్నికలను పట్టించుకోవడం లేదా? సభలు, సమావేశాలు, ప్రచారానికి ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఇంతకీ మాణికం ఠాగూర్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?అనే ఆసక్తికర అంశాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


సర్వశక్తులు ఒడ్డినప్పటికీ.. ఘోర పరాభవం

మాణికం ఠాగూర్‌ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకోవడంతోనే ఫుల్‌ యాక్టీవ్‌గా పనిచేశారు. గాంధీభవన్‌లో ఎక్కువ సమయం గడిపి పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. దుబ్బాక ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ బలగాలను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించారు. గ్రామానికి, మండలానికో సీనియర్ కాంగ్రెస్‌ నేతను ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేతను అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇలా మాణికం ఠాగూర్‌ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ దుబ్బాకలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదు. 


కీలక సమయంలో దూరం

అయితే మొన్నటి పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి మాణికం ఠాగూర్‌ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆయన పత్తాలేకుండాపోయారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీకి సాగర్‌ ఉప ఎన్నిక చావోరేవో అన్న పరిస్థితి. ఎందుకంటే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయాల్సిన కీలక సమయంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దూరంగా ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలుగా ఆయన తెలంగాణ వైపు కన్నెత్తిచూడకపోవడంతో అంతర్గతంగా ఏం జరిగిందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌గా చర్చలు సాగుతున్నాయి. 


ఐక్యత తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ

అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపట్ల ఠాగూర్‌ ఒకింత అసహనంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు, నేతల మధ్య వర్గపోరు తగ్గించేందుకు రాహుల్ గాంధీ దూతగా ఠాగూర్‌ను రాష్ట్రానికి పంపారన్న వాదన ఉంది. మొదట పార్టీ నాయకుల్లో ఐక్యత తీసుకురావడంపై మాణికం ఠాగూర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎవరూ హద్దు మీరకుండా కట్టడిచేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించకపోయినా.. నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఠాగూర్ సక్సెస్‌ అయ్యారన్న వాదనలు వినిపించాయి. దుబ్బాక తరహాలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టిసారించలేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల నాగార్జున సాగర్‌ పరిధిలో జరిగిన బహిరంగసభకు సైతం ఠాగూర్‌ హాజరు కాలేదు. 


ఫీల్ అయిన ఠాగూర్! 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఠాగూర్ రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. దాని ఆధారంగా రిపోర్ట్‌ను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. అయితే ఆ నివేదికలో రేవంత్ రెడ్డిని ఎంపిక చేయాలని ప్రతిపాదించినట్లు లీకులు బయటకు వచ్చాయి. దాంతో రేవంత్ వ్యతిరేక వర్గం ఠాగూర్‌పై విమర్శలు గుప్పించింది. వీహెచ్‌ లాంటి నేతలు ఇన్‌ఛార్జ్‌ డబ్బులకు అమ్ముడుపోయారంటూ బహిరంగ విమర్శలు చేశారు. అంతేకాదు ఠాగూర్‌కు వ్యతిరేకంగా కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు సైతం పంపించారు. తనను విమర్శించడంతో ఠాగూర్ ఫీల్‌ అయ్యారట. పార్టీలో గ్రూప్ తగాదాలను భరించలేక పట్టభద్రుల ఎన్నికలతో పాటు సాగర్‌ ఉప ఎన్నికను టీపీసీసీకి వదిలేశారన్న టాక్‌ వినిపిస్తోంది. 


ఆ హడావుడి ఎక్కడ?

అయితే మరికొందరు మాత్రం ఈ వాదనలు ఖండిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నందుకు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాలేదంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్లనే సాగర్ బైపోల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని వివరిస్తున్నారు. ఎప్పటికప్పుడు టీపీసీసీతో ఆయన మాట్లాడుతున్నారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. సోమవారం రాష్ట్ర ముఖ్యనేతలు, సాగర్‌ మండల ఇన్‌ఛార్జ్‌లతో ఠాగూర్‌ జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని..జానారెడ్డి విజయం కోసం అందరు పనిచేయాలని ఆదేశించారట. మొత్తంగా వచ్చిరావడంతోనే హడావుడి చేసిన మాణికం ఠాగూర్‌.. కీలక సమయంలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.  


Advertisement
Advertisement
Advertisement