బ్రాండ్ మోదీ సరే, టీమ్ మోదీ ఏదీ?

ABN , First Publish Date - 2020-02-04T00:02:24+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను తాను ఒక కారణ జన్ముడుగా భావించుకుంటారు. భావితరాల భారతీయులు ఆయన్ని ఆ విధంగా గౌరవిస్తారా?...

బ్రాండ్ మోదీ సరే, టీమ్ మోదీ ఏదీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను తాను ఒక కారణ జన్ముడుగా భావించుకుంటారు.

భావి తరాల భారతీయులు ఆయన్ని ఆ విధంగా గౌరవిస్తారా? పాలనాదక్షత గల వ్యక్తులను మంత్రులుగా నియమించి, ఉద్ధండ ఆర్థిక వేత్తల, లోకహితులైన న్యాయకోవిదుల, శాస్త్ర సరిహద్దులను తరచి చూస్తున్న వైజ్ఞానికుల, నవీన సైనిక నిపుణుల, దౌత్యనీతి దురంధరుల సలహాలను మరింత శ్రద్ధతో విని, వారి సూచనలను పాటించివున్నట్టయితే మోదీ నేడు మరింత మెరుగ్గా వెలుగొందుతుండేవారు. భారతదేశమూ అనుపమానంగా అలరారుతుండేది.

 

ప్రజాస్వామ్యంలో ఎంతటి సమర్థ నాయకులనైనా ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. అయితే తిరస్కృత నాయకులు పాలనా దక్షత గల వారయినప్పుడు జాతి పురోభివృద్ధికి వారి సేవలను ఉపయోగించుకోవద్దూ? 2018 డిసెంబర్‌లో మిత్రుడైన ఒక పారిశ్రామిక వేత్తతో మాటా మంతీ జరిపాను. నా స్నేహితుడు కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితుడు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలయిన రోజులవి. ఆ ఓటమితో ముగ్గురు ముఖ్యమంత్రులు అధికారాన్ని కోల్పోయారు. వారి రాజకీయ ప్రాభవమూ తగ్గిపోయింది.

 

నా మిత్రునికి ఒక సూచన చేశాను: 2019 మే సార్వత్రక ఎన్నికలలో ప్రధానమంత్రి విజయం సాధించినప్పుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ముగ్గురు రాజకీయ వేత్తలను కేంద్ర కేబినెన్‌లోకి తీసుకోవాలి. ప్రస్తావిత ముగ్గురు రాజకీయవేత్తలూ వివాదరహితులేమీ కాదు. అయితే వారు పాలనా దక్షులు. సామాన్య ప్రజలకు చెప్పుకోదగ్గ శ్రేయస్సును సమకూర్చిన వారు . మహారాజా సింధియా వంశ సంజాతురాలైన వసుంధరా రాజె అహంకృత అయినప్పటికీ సంస్కృతి, లలిత కళల్లో శ్రద్ధాసక్తులున్న విద్యావతి. పర్యాటక మంత్రిగా దేశానికి ఆమె గొప్ప మేలు చేయగలరు.

 

శివరాజ్ సింగ్ చౌహాన్ పాలన వ్యాపమ్ కళంకితమైనప్పటికీ ఆయన విధానాలు మధ్యప్రదేశ్ రైతుల జీవితాలను గణనీయంగా మెరుగుపరిచాయని విమర్శకులు సైతం అంగీకరించారు. మోదీ రెండో ప్రభుత్వంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రభావశీలమైన పురోగతికి చౌహాన్ తోడ్పడేవారు కాదూ? ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన అప్రతిష్ఠను మూటగట్టుకున్నది. అయితే సమాజంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో మరే ఇతర రాష్ట్రంలో కంటే గణనీయమైన సత్ఫలితాలను ఆయన సాధించారు. మోదీ రెండో కేబినెట్ కు ఆయన ఉపయోగకరమైన అదనపు పాలనా సమర్థుడు కాడూ?

 

బీజేపీకి అనుకూలంగా వుండే నా మిత్రుడు నా అభిప్రాయంతో ఏకీభవించారు. మోదీ మొదటి ప్రభుత్వం సైతం ప్రతిభా సంపన్నులతో ఏమీ అలరారలేదు. ఉన్న కొద్ది మంది అనుభవజ్ఞులైన మంత్రులూ- మనోహర్ పారీకర్ , సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ- అనారోగ్య పీడితులే. రెండో కేబినెట్‌లో, ప్రస్తావిత ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను చేర్చుకుని వుంటే ప్రభుత్వ కార్యక్రమాలను మరింత ప్రభావశీలంగా అమలు చేయడానికి దోహదం జరిగివుండేది. అయితే నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన తరువాత ఆ నాయక త్రయాన్ని తన కేబినెట్‌లో చేర్చుకోలేదు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను, మతపరమైన మైనారిటీలను జాతి శత్రువులుగా చిత్రించే ప్రతిభాపాటవాలు ఉన్న రాజకీయవేత్తలకు మంత్రి పదవులను కట్ట బెట్టారు. మరింత శోచనీయమైన విషయమేమిటంటే జైట్లీ, సుష్మా, మనోహర్‌ల మరణంతో పాటు ప్రథమశ్రేణి వృత్తి నైపుణ్యాలు, జాతిహిత భావన పరిపూర్ణంగా గల వారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిష్క్రమించడం. దీంతో దేశ పాలనా పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి.

 

మోదీ మొదటి ప్రభుత్వానికి నలుగురు ఉద్దండ ఆర్థికవేత్తలు..రఘురామ్ రాజన్, అరవింద్ సుబ్రమణియన్, ఉర్జిత్ పటేల్, అరవింద్ పనగారియా - సలహాల లబ్ధి సమకూరుతుండేది. 2019 నాటికి వారు ప్రభుత్వం నుంచి వైదొలిగారు. వారి స్థానంలో నియమితులయినవారికి ఆ నలుగురికి ఉన్న వృత్తిగత విశ్వసనీయత కొరవడింది. మోదీ మొదటి ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోను, ప్రధానమంత్రి కార్యాలయంలోను దేశ శ్రేయస్సుకు అంకిత భావంతో పనిచేసే ఉత్కృష్ట సివిల్ సర్వెంట్స్ వుండేవారు విశేషపాలన అనుభవమూ, వివిధ రంగాలపై సమగ్ర అవగాహన వున్న ఆ అధికారులు స్వతంత్ర ఆలోచనాశీలురు. తమ మనస్సులోని మాటను నిర్భయంగా చెప్పగలిగేవారు. 2019 మేలో మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఈ అధికారులు సైతం ప్రభుత్వం నుంచి నిష్క్రమించారు.

 

ఈ పరిణామాలలో ఒక సామాన్య అంశం కనిపిస్తున్నది. సివిల్ సర్వెంట్స్ గానివ్వండి, ఆర్థిక వేత్తలు గానివ్వండి, సొంత పార్టీకి చెందిన ఇతర రాజకీయ వేత్తలు గానివ్వండి స్వతంత్ర వైఖరితో వ్యవహరించే వారితో నరేంద్ర మోదీ సన్నిహితంగా పనిచేయలేరు. ఒక వేళ కలసికట్టుగా పనిచేసినా అది ఎంతోకాలం సాగదు. ఇందుకు కనీసం మూడు కారణాలు చెప్పవచ్చు. ఒకటి,- స్వభావరీత్యా ప్రధానమంత్రి ఒంటరి వ్యక్తి. స్నేహితులు, కుటుంబం లేని మోదీ పూర్తిగా స్వయం కృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకుడు. అన్యోన్య భావంతో సంబంధాలు, అనుబంధాలు పెంపొందించుకునే సుగుణాన్ని ఆయన అలవర్చుకోలేదు. రెండు,- మోదీ స్వయం విద్యావంతుడు. తనకుతానుగానే అన్నీ నేర్చుకున్నారు.

 

ప్రతిష్ఠాత్మక విశ్వ విద్యాలయాలలో చదువుకున్న వారిని అనుమానించే తత్వం ఆయనలో ప్రబలంగా వున్నది. (తాను ఎప్పుడూ ‘హార్వర్డ్’ కంటే ‘హార్డ్ వర్క్’ కే, అంటే కష్టించి పనిచేసేందుకే ప్రాధాన్యమిస్తాను- అన్న ఆయన సుప్రసిద్ధ(ఒక విధంగా అపఖ్యాతికారకమైన) వ్యాఖ్యే- అందుకు నిదర్శనం). మూడు,- మోదీ స్వయం మోహితుడు. మోదీ ప్రపంచం సంపూర్ణంగా కాకపోయినప్పటికీ చాలా వరకు ఆయన చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. ఆయనే బీజేపీ, ఆయనే ప్రభుత్వం, ఆయనే కేంద్ర కేబినెట్, ఆయనే భారతదేశం. టీమ్ మోదీ అనేది లేదు. ఉండదు. ఎందుకంటే ఒక బ్రాండ్ మోదీ మాత్రమే ఉండి తీరాలి గనుక. పలు ప్రభుత్వాలకు సలహాదారు అయిన ఒక ఆర్థిక విశ్లేషకుడు ఒకసారి నాకు ఇలా చెప్పారు: ప్రస్తుత ప్రధానమంత్రితో కలిసి పనిచేయాలని ఎవరైనా ఆశిస్తుంటే అతడు లేదా ఆమె విధిగా ఒక నియమాన్ని పాటించితీరాలి. అది: సంపూర్ణ విధేయత చూపాలి; ఎలాంటి గుర్తింపునూ ఆశించకూడదు. ఈ నియమానికి ఒకే ఒక్కరు మాత్రమే మినహాయింపు- ప్రస్తుత హోంమంత్రి.

 

మోదీ పాలనలో దేశానికి అపార నష్టాన్ని కలుగజేసిన రెండు విధాన నిర్ణయాలు: పెద్ద నోట్ల రద్దు, పౌరసత్వ సవరణ చట్టం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సలహాకు విరుద్ధంగా మొదటి విధాన నిర్ణయాన్ని తీసుకున్నారు; రెండో దాన్ని హోం మంత్రి ద్వారా అమలు జరపడానికి పూనుకున్నారు. ఆకస్మికంగా, నిర్హేతుకంగా పెద్ద నోట్ల ను రద్దుచేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. దేశ ప్రజలు ఆ దెబ్బ నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇక పౌరసత్వ సవరణ చట్టం భారతీయ సమాజంలో చీలికలు సృష్టించింది. ఈ రెండు నిర్ణయాలను ఎవరితోనూ సంప్రదించకుండా, ఎటువంటి హెచ్చరిక లేకుండానే తీసుకున్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి గానీ, సందర్భం గానీ ఏ మాత్రం ఆ నిర్ణయాలను డిమాండ్ చేయలేదు. దేశ శ్రేయస్సు, భవిష్యత్తు గురించి సక్రమంగా ఆలోచించే ఎవరైనా సరే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు. అయితే ప్రధాన మంత్రి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేరు కూడా.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను తాను ఒక కారణ జన్ముడుగా భావించుకుంటారని ఆయనతో కలిసి పనిచేసిన పారిశ్రామిక వేత్తలు, సివిల్ సర్వెంట్స్ నాకు చెప్పారు. తనకు ముందున్న ప్రధానమంత్రులెవరూ సాధించలేకపోయిన రీతిలో భారతదేశాన్ని మరింత సమగ్రంగా , మౌలికంగా మార్చివేసేందుకు సంకల్పించిన మహోదాత్త నాయకుడుగా మోదీ తనను తాను పరిగణించుకుంటారని వారు తెలిపారు. చీలికలు, పేలికలయినా స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న ప్రతిపక్షాల పుణ్యమా అని నరేంద్రమోదీ మూడో పర్యాయం ప్రధానమంత్రి అయ్యే అవకాశమున్నది.

 

అదే జరిగితే ఆ అత్యున్నత పదవిలో నెహ్రూ, ఇందిర తరువాత అత్యధిక కాలం వున్న నాయకుడుగా మోదీ సుప్రసిద్ధుడవుతారు. మరి చరిత్రలో నెహ్రూ, ఇందిరల కంటే మోదీ స్థానం సమున్నతంగా వుంటుందా? 2014లో ఆయన మొదటి సారి ప్రధానమంత్రి అయినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా వున్నది. ఆయన మాటను గౌరవించేందుకు, ఆయన ఆదేశాన్ని పాటించేందుకు దేశ ప్రజలు వెనుకాడని సందర్భమది. వరుసగా రెండు సార్వత్రక ఎన్నికలలో మోదీ ఘన విజయం సాధించారు. ప్రజలు పూర్తి విశ్వాసంతో ఇచ్చిన అధికారంతో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సమృద్ధం చేసివుండాల్సింది; దేశ రాజకీయ పేరు ప్రతిష్ఠలను పెంపొందించి వుండాల్సింది; భారతీయ సమాజంలో సామాజిక సామరస్యాన్ని మరింతగా దృఢతరం చేసి వుండాల్సింది.

 

మరి జరిగిందేమిటి? మన ఆర్థిక వ్యవస్థ 2014 మేలో కంటే మరింత బలహీనంగా వున్నది. మన సమాజంలో కుల, మతాల విభజనలు పెచ్చరిల్లిపోయాయి. మన రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలు రాజీపడుతున్నాయి. క్రమంగా శిథిలమవుతున్నాయి. మన ప్రజాస్వామ్యానికి గౌరవ హాని జరుగుతోంది.

 

భావి తరాల భారతీయులు నరేంద్రమోదీని ఆయన ఆశిస్తున్న విధంగా కారణజన్ముడుగా, మహోదాత్త నాయకుడుగా చూస్తారా? అలా గౌరవించడం జరగక పోతే అందుకొక కారణం ఆయన తన సంకుచితత్వ గతంతో తెగతెంపులు చేసుకోలేక పోవడమే. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడి శ్రేయస్సుకు, జాతి సర్వతోముఖాభివృద్దికి తాను అంకితమయ్యాయనిమోదీ ఎంతగా చెబుతున్నప్పటికీ ఆయన కేవలం ఒక హిందూత్వ అధిక సంఖ్యాక వాదిగా మాత్రమే ప్రజలకు కనిపిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణకు అనుగుణంగా మాత్రమే ఆయన వ్యవహరిస్తున్నారు.

 

మోదీ వ్యక్తిత్వంలోని స్వయంప్రేమ కూడా ఆయన చారిత్రక ప్రతిష్ఠ సమున్నతికి అవరోధంగా వున్నది. పాలనాదక్షత గల వ్యక్తులను తన కేబినెట్‌లో నియమించి, ఉద్దండ ఆర్థిక వేత్తల, లోక హితులైన న్యాయకోవిదుల, శాస్త్ర సరిహద్దులను తరచి చూస్తున్న వైజ్ఞానికుల, నవీన సైనిక నిపుణుల, దౌత్యనీతి దురంధరుల సలహాలను మరింత శ్రద్ధతో విని, వారి సూచనలను పాటించివున్నట్టయితే మోదీ నేడు మరింత మెరుగ్గా వెలుగొందుతుండేవారు. భారతదేశమూ అనుపమానంగా అలరారుతుండేది.

రామచంద్ర గుహ 

(వ్యాసకర్త చరిత్రకారుడు)


Updated Date - 2020-02-04T00:02:24+05:30 IST