Abn logo
Jun 2 2020 @ 00:38AM

సమగ్రాభివృద్ధి ఏది?

నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం


ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఉద్యమ ఆకాంక్షల సాధనకు అమరుల త్యాగాల స్మరణతో ఆనాటి ఉద్యమకారులందరు మరో ఉద్యమానికి శ్రీకారము చుట్టడం తప్ప ప్రత్యామ్నాయం లేదు.


స్వరాష్ట్రమేర్పడి ఆరు సంవత్సరాలు గడిచి ఏడవ సంవత్సరంలో అడుగిడుతున్నాము. స్వ రాష్ట్రసాధనలో అసువులుబాసిన అనేకమందికి, వీరకిశోరాలకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారాశించిన, ప్రజా ఉద్యమ ఆకాంక్షలు ఎంతమేరకు నెరవేరాయని నెమరు వేసుకోవలసిన సందర్భమిది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన నాటి-నేటి మన ప్రధాన నినాదాలు. ఇందులో అమలైనవి ఏవి అనేది సమీక్షించుకోవలసిన తరుణమిది. 


ఉద్యమ సెగ మూలంగా నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ఎల్లంపల్లి-–శ్రీపాద, ప్రాణహిత–-చేవెళ్ళ ప్రాజెక్టుల శంకు స్థాపనలు జరిగాయి. కొన్ని ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి. 2014 జూన్‌ 2వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో కెసిఆర్‌ ప్రభుత్వం చేపట్టిన ‘కాళేశ్వరం’ దగ్గర 88మీటర్ల ఎత్తు నుండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మేడారం, రామడుగు, మిడ్‌మానేరు గుండా, అనంతగిరి, ఇమామబాద్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ల ద్వారా కొండ పోచమ్మకు 618 మీటర్ల ఎత్తుకు (17 టియంసిలు) నీరు ఎత్తిపోస్తున్నారు. కెసిఆర్‌ సాధించిన ప్రగతి యిది.


1993 సంవత్సరంలో శంకుస్థాపన చేయబడిన పాత ప్రాజెక్టులుగా ఉన్న శ్రీరాంసాగర్‌ వరద కాలువ  ఇప్ప టికి పూర్తి కాలేదు. దేవాదుల, కాంతానపల్లి లాంటి ప్రాజెక్టులు నత్తనడకలో ఉన్నాయి. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఈ ప్రాజెక్టుల వేగం రెండడుగులు ముందుకు మూడడుగులు వెనుకకులాగుతున్నది. కల్వకుర్తి లిఫ్ట్‌ కెనాలు, బీమా, నెట్టెంపాడు, కోయిల సాగర్‌, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ ప్రాంతపు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు లాంటివి ఇప్పటికి పూర్తికాలేదు. అలాగే కేసిఆర్‌ కొత్తగా శంకుస్థాపన చేసిన డిండీ, నక్కలగండి ఎత్తిపోతల పథకము, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులలేమితో పనుల ప్రగతి నిలిచిపోయింది. సీతారామా ప్రాజెక్టు శీఘ్రగతిన పూర్తి చేస్తామని ప్రకటించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగానే ఉంది. కాళేశ్వరము ప్రాజెక్టు పైనున్న పట్టింపు శ్రద్ద బాగా వెనుకబడిన వలస జిల్లా ఐన మహబూబ్‌నగర్‌, కరువు జిల్లాలలైన నల్లగొండ, రంగారెడ్డిలపై ఎందుకు లేదనేది సహజంగానే చర్చనీయాంశముగా మారింది. ఎందుకు ఈ పక్షపాత వైఖరిని కేసిఆర్‌ ప్రభుత్వము ప్రదర్శిస్తుందనే చర్చసాగుతున్నది.


శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడుకు తీసుకపోయే కాలువ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుండి 80,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 203 జీవోను విడుదల చేయడం ఈ ప్రాంతవాసులకు అగ్గి మీద గుగ్గిలముగా మారింది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదమున్నదని తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతుంది. ఈ విషయంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు కూడ తమ గళం విప్పారు. ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను అందజేశారు. దక్షిణ తెలంగాణ మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు జరిగే ప్రమాదాన్ని హెచ్చరించారు. మేము వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం.  అందుకని తెలంగాణ ఉద్యమకారులందరు వెనుకబడిన ప్రాం తాలలో గోదావరి, కృష్ణా జలాల వినియోగానికై ప్రత్యేక ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవాల్సివుంది. ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలన్న కోర్కె పూర్తిగా నిర్వీర్యం చేయబడింది. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ను ప్రభుత్వం సాధించలేకపోయింది.నిధుల వినియోగంలో కేసిఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడల మూలంగా ఇప్పటికే రూ.3లక్షల కోట్ల అప్పులు తెలంగాణ పౌరులందరి మెడకు చుట్టుకున్నాయి. ఒక్క కాళేశ్వరానికి, మిషన్‌ భగీరథకు దాదాపు లక్షకోట్లు అప్పుతెచ్చారు. నిధుల వినియోగం ప్రభుత్వ పక్షపాత ధోరణిపై అందరూ యోచించాల్సిన సమయమిది.


కొత్త రాష్ట్రంలో కేసిఆర్‌ ప్రభుత్వం వింతపాలన సాగి స్తుంది. ఆత్మగౌరవ పాలన కాదు, ఆత్మవంచన పాలనగా సాగుతుంది. ‘‘ప్రజాస్వామ్యం’’ నిర్వచనం ప్రజల ద్వారా, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజా ప్రభుత్వం పని చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం, ఉద్యమం అనేవి నాణేనికి బొమ్మ, బొరుసులాంటివి. కాని కేసిఆర్‌ నిఘంటవులో నిక్షిప్తమై ఉన్నదేమిటి? ప్రజల ద్వారా ప్రజల చేత, ప్రజల కొరకు కాకుండా కేసిఆర్‌ కొరకు టిఆర్‌ఎస్‌ వారికే ప్రభుత్వము పనిచేస్తుందనే నిర్వచనాన్ని ఇవ్వడం ప్రజాస్వామాన్ని అపహాస్యం చేయడమే! ప్రతిపక్షాలు లేని తెలంగాణ అసాధ్యమని గత చరిత్ర తెలుపుతున్నది. పెరుగుట ఇరుగుట కొరకే అనే సామెతను గుర్తుచేస్తుంది.


గత ఆరు సంవత్సరాల నుండి ఏకపక్ష నియంతృత్వ పాలన సాగుతున్నది. ఈ విధానాలు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే విరుద్ధమైనవి. ఇచ్చిన హామీలు అమలు చేయరు. ప్రాతినిధ్యానికి తావులేదు. ప్రశ్నించే గొంతుకలను, మీడియాను నొక్కేస్తారు. చిరుద్యోగులు హక్కులు అడిగితే ఆగ్రహాంతో ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతారు. ఈ రకంగా స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాం క్షలు కనుమరుగైనాయి. మేధావులు, విద్యార్థులు, యువకులలో తీవ్ర అసంతృప్తులు నెలకొన్నాయి. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అర్థం లేకుండా పోయింది. 


ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భముగా తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఉద్యమ ఆకాంక్షల సాధనకు అమరుల త్యాగాల స్మరణతో ఆనాటి ఉద్యమకారులందరు మరో ఉద్యమానికి శ్రీకారము చుట్టడం తప్ప ప్రత్యామ్నాయం లేదు.               


చాడ వెంకటరెడ్డి

(సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement