కానుక ఎక్కడ?

ABN , First Publish Date - 2021-06-15T06:00:17+05:30 IST

‘అన్న వస్తాడు.. అన్నీ ఇస్తాడు’ అని నమ్మి ఓట్లు వేశారు.

కానుక ఎక్కడ?

  1. రెండేళ్లుగా వధువుకు అందని సాయం
  2. టీడీపీ హయాంలో పెళ్లి రోజే కానుక
  3. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొండిచేయి
  4. సాయం పెంచుతామని మరిచిన ప్రభుత్వం


కర్నూలు, ఆంధ్రజ్యోతి: ‘అన్న వస్తాడు.. అన్నీ ఇస్తాడు’ అని నమ్మి ఓట్లు వేశారు. అన్న అధికారంలోకి వచ్చాక వారి ఆశలు ఒక్కొక్కటి ఆవిరవుతున్నాయి. అర్హత ఉండి పథకాలకు దూరమవుతున్న వారు కొందరైతే.. గత ప్రభుత్వం హయాంలో అర్హులుగా గుర్తింపు పొందినా, లబ్ధి చేకూరని వారు మరికొందరు. కొన్ని పథకాలను అర్ధాంతరంగా ఆపేశారు. ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’ పథకం ఈ కోవలోకే వస్తుంది. పేదింటి వధువులకు వివాహ వేళ ఆర్థిక భరోసా అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో ‘చంద్రన్న పెళ్లికానుక’ పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు ఏడాదిపాటు ఈ మొత్తం అందించింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ‘పెళ్లి కానుక’ మొత్తాన్ని పెంచి ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’గా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. సొమ్మును వధువు ఖాతాకు జమ చేస్తామని కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎవరికీ పైసా ఇవ్వలేదు. కొవిడ్‌ నెపంతో పోయిన సంవత్సరం ఏప్రిల్‌ నుంచి రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేశారు. 2019 మార్చి నుంచి రావాల్సిన పెళ్లి కానుక బకాయిలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. పెళ్లి కానుక కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారు ఆ సొమ్ము కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. డబ్బులు ఇస్తారా.. లేదా అన్న విషయం కూడా ఎవరూ చెప్పడం లేదు. రిజిస్ట్రేషన్లు మళ్లీ మొదలు పెడతారా? అంటే తమకు తెలియదని అంటున్నారు. 


9,572 మంది ఎదురుచూపు


జిల్లాలో పెళ్లికానుక పథకం ప్రారంభించాక, గత ఏడాది మార్చి వరకు 18,691 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,119 మందికి తెలుగుదేశం ప్రభుత్వం రూ.32.42 కోట్లు అందజేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి లెక్కల ప్రకారం మరో 9,572 మందికి సొమ్ము అందాల్సి ఉంది. వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద వర్గాల వారీగా ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.75 వేలు, దుల్హన్‌(మైనారిటీ వధువు), గిరిపుత్రిక(గిరిజన వధువు), బీసీ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.50 వేలు, దివ్యాంగ వధువుకు రూ.లక్ష చొప్పున పెళ్లి కానుక ఇస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు ఇవే ప్రోత్సాహకాలు ప్రకటించిది. వైసీపీ ప్రభుత్వం హామీ మేరకు ప్రోత్సాహకాలు పెంచకపోగా, దరఖాస్తు చేసుకున్న వారికి సొమ్ము చెల్లించలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే లబ్ధిదారులకు సాయం చేస్తామని చెబుతున్నారు. 


కల్యాణ మిత్రల పరిస్థితి అగమ్యగోచరం


వధూవరుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయడం, పెళ్లి సమయంలో ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం కోసం అప్పటి ప్రభుత్వం కల్యాణమిత్రలను నియమించింది. మండలానికి ఇద్దరు కల్యాణమిత్రలు ఉన్నారు. వీరికి పెళ్ళికానుక వివరాలు రిజిస్ట్రేషన్‌ చేస్తే రూ.300, రాత్రి పూట జరిగే పెళ్లి ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే రూ.500, పగటి పూట జరిగే పెళ్ళి ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తే రూ.250 ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి నుంచి 2020లో పెళ్లికానుక ఆగిపోయే వరకు రావాల్సిన సొమ్ము కల్యాణమిత్రలకు రాలేదు. వారు విధుల్లో ఉన్నారా, లేదా..? అన్నది కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.


ఎదురు చూస్తున్నాం..


వైఎస్సార్‌ దుల్హాన్‌ పెళ్లి కానుక కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నాను. 15 నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. పెళ్లి రోజే ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అన్నారు. టీడీపీ హయాంలో దుల్హాన్‌ పథకం కింద పెళ్లి రోజే డబ్బులు పడేవి. వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు సాయం అందించలేదు. ప్రభుత్వం నుంచి సొమ్ము వస్తుందన్న నమ్మకంతోనే పెళ్లికి అప్పు చేశాం. దీనికి వడ్డీ తోడై భారంగా మారింది. నాలాగా చాలా మంది ముస్లిం యువతులు పెళ్లి కానుక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 

- జైబా కౌసర్‌, హొళగుంద

Updated Date - 2021-06-15T06:00:17+05:30 IST