ధాన్యానికి చోటేది?

ABN , First Publish Date - 2022-04-22T05:38:51+05:30 IST

జిల్లాలోని రైస్‌మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లిడ్‌ రైస్‌) కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి.

ధాన్యానికి చోటేది?
రైస్‌మిల్లుల్లో గుట్టలుగా పేరుకపోయిన ధాన్యం నిల్వలు

- రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలకు చోటు కరువు

- ఎఫ్‌సీఐ గోదాంలు ఖాళీ లేవు.. మిల్లుల్లో చోటు లేదు

- గత యాసంగి, వానాకాలం సీజన్‌ల సీఎంఆర్‌ రైస్‌ మిల్లుల్లోనే..

- సరిపడా గోదాంలు లేక ఎదురవుతున్న సమస్య

- ఈ యాసంగిలో కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ దింపుకోవాలంటున్న మిల్లర్లు

- ఇప్పటికే మొదలైన యాసంగి కొనుగోళ్లు

- 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైస్‌మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లిడ్‌ రైస్‌) కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. సీఎంఆర్‌పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో వ్యాగన్లు రాక ఎఫ్‌సీఐ గోదాంల్లో బియ్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. ఎఫ్‌సీఐ గోదాంలు ఖాళీ కాకపోవడంతో మిల్లుల్లో కస్టం మిల్లింగ్‌ బియ్యం సంచుల నిల్వలు అలాగే ఉండిపోవడంతో ఈ యాసంగి సీజన్‌ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లుల్లో చోటు లేకుండా పోతోంది. ఈ సీజన్‌లో కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ దింపుకోవాలంటూ మిల్లర్లు తర్జన భర్జన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నుంచి వ్యాగన్లు రాక మిల్లుల్లో, గోదాంల్లో గత సీజన్‌లకు సంబంధించి సీఎంఆర్‌ తరలించడంలో అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్‌లో రా రైస్‌ ఇవ్వలేమని మిల్లర్లు పలుమార్లు ఉన్నతాధికారులకు వినతులు విన్నవిస్తూనే వస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం రా రైస్‌ మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

జిల్లాలో 200లకు పైగా రైస్‌మిల్లులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడి ్డ, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో 200లకు పైగా రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇందులో 135 రా రైస్‌మిల్లులు ఉండగా 35 పైగా బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో ఎక్కువగా రాష్ట్రప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు కేటాయిస్తోంది. జిల్లాలో 35కు పైగా మాత్రమే బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులో ఇప్పటికే గత యాసంగి, వానాకాలం సీజన్‌లకు సంబంధించి సీఎంఆర్‌ నిల్వలు అలాగే ఉండిపోయాయి. బాయిల్డ్‌ రైస్‌మిల్లులు తక్కువగా ఉండడం ఈ సీజన్‌లో కొనుగోలు చేసే ధాన్యాన్ని మిల్లులకు తరలించలేని పరిస్థితి ఎదురవుతోంది. గత సీజన్‌లకు సంబంధించి సీఎంఆర్‌ను వెంటనే గోదాంలకు తరలించాలని రైస్‌మిల్లర్లు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు గోదాంలు కూడా ఖాళీగా లేవు.  జిల్లాలో రెండు చోట్ల మాత్రమే ఎఫ్‌సీఐ గోదాంలు ఉన్నాయి. ఈ గోదాంల్లో సైతం సీఎంఆర్‌ నిల్వలు పేరుకుపోయాయి. ఎఫ్‌సీఐ నుంచి సకాలంలో వ్యాగన్లు రాకపోవడంతో ఈ గోదాంల్లో నిల్వలు ఖాళీ కావడం లేదని సంబంధితశాఖ అధికారులు చెబుతున్నారు. 

గత యాసంగి, వానాకాలం సీఎంఆర్‌ మిల్లుల్లోనే..

జిల్లాలో గత యాసంగి, వానాకాలం సీజన్‌లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఇప్పటికీ రైసుమిల్లుల్లోనే ఉండిపోయింది. కామారెడ్డి జిల్లాలో గత యాసంగిలో రైతుల నుంచి 4.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆయా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు కేటాయించారు. రైస్‌ మిల్లర్లు మిల్లింగ్‌ చేసి తిరిగి ప్రభుత్వానికి 3.19 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 3.02 లక్ష మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. మిగతా 16వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఈ సీఎంఆర్‌ను ఇప్పటికే మర ఆడించి సిద్ధంగా ఉంచారు. ఎఫ్‌సీఐ మిల్లుల్లోని ఈ బియ్యాన్ని తీసుకెళ్లకపోవడంతో మిల్లుల్లో ఎక్కడికక్కడే పేరుకుపోతోంది. గత వానాకాలం సీజన్‌లో 4లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని ఆయా రైస్‌మిల్లులకు కేటాయించారు. ఇందులో 3.24లక్షల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 25,375 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను మాత్రమే తిరిగి ఎఫ్‌సీఐకి ఇచ్చారు. దాదాపు 3లక్షల మెట్రిక్‌ టన్నుల వానాకాలం సీఎంఆర్‌ ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోయింది. ఇందులో లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు మర ఆడించి సీఎంఆర్‌ను మిల్లర్లు సిద్ధంగా ఉంచారు. ఎఫ్‌సీఐ గోదాంలు ఖాళీలేక వ్యాగన్లు రాక గోదాంల్లోనే కుప్పలు తెప్పలుగా నిల్వలు ఉండిపోతున్నాయి.

ఖాళీగా లేని ఎఫ్‌సీఐ గోదాంలు

జిల్లాలో ఎఫ్‌సీఐ గోదాంతో పాటు సాధారణ గోదాంలు సుమారు 35కు పైగానే ఉన్నాయి. ఈ గోదాంలో ఎఫ్‌సీఐ సంస్థయే అధిక కెపాసిటీ గల ధాన్యం నిల్వలే ఉంటాయి. జిల్లాలోని కామారెడ్డి శివారులోని గత కలెక్టరేట్‌ సమీపంలో 15వేల మెట్రిక్‌ టన్నుల, నర్సన్నపల్లి వద్ద 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఎఫ్‌సీఐ గోదాంలు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు బాన్సువాడలో ఎఫ్‌సీఐ గోదాంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సీఎంఆర్‌ బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఇక మిగతా గోదాంలు ఎరువుల నిల్వలతో నిండిపోయాయి. కామారెడ్డిలోని 4 ఎఫ్‌సీఐ గోదాంలు గత కొన్నిరోజుల నుంచి ఖాళీగా లేవు. ఈ గోదాంలోని సీఎంఆర్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొన్ని రోజులుగా వ్యాగన్లు రాక అలాగే ఉండిపోతున్నాయి. దీంతో మిల్లుల్లోని సీఎంఆర్‌ను గోదాంలకు తరలించలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్య వల్ల కేంద్రాల్లోనూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు తరలించలేని పరిస్థితి ఎదురవుతుందని అధికారులు, మిల్లర్లు పేర్కొంటున్నారు.

ఈ యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లపై అధికార యంత్రాంగం సైతం యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ సీజన్‌లో 4.5లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు తరలించే అవకాశం ఉంది. కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 314 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే బాన్సువాడ, నస్రూల్లాబాద్‌, బీర్కూర్‌ తదితర మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. అయితే కేంద్రాల నుంచి ఽధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడంపై అధికారులు మిల్లర్లు తర్జనభర్జన పడుతున్నారు. మిల్లుల్లో ధాన్యాన్ని దింపుకునేందుకు చోటు లేకపోవడం, గోదాంలు ఖాళీ లేకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచేదనే దానిపై సందిగ్ధత నెలకొంటుంది.

Updated Date - 2022-04-22T05:38:51+05:30 IST