ఇసుక ఎక్కడుంది?

ABN , First Publish Date - 2020-06-06T09:16:50+05:30 IST

రాష్ట్రంలో ఇసుక సరఫరా తీరుపై పాలక పక్ష ప్రజాప్రతినిధుల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. ‘ఇళ్ల నిర్మాణాలకు

ఇసుక ఎక్కడుంది?

  • నేను ఆర్డర్‌ చేసి 3 రోజులైనా అందలేదు
  • సరఫరాలో ఏపీఎండీసీ పూర్తిగా విఫలం
  • ఇసుక దొరక్క ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
  • పొలాల్లో మట్టి తరలిస్తుంటే బెదిరింపులా?
  • రైతులపై కేసులు పెడితే ముందు నాపై పెట్టండి
  • ఇటుక బట్టీల నిర్వాహకులపైనా వేధింపులు
  • కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫైర్‌


రావులపాలెం రూరల్‌, జూన్‌ 5: రాష్ట్రంలో ఇసుక సరఫరా తీరుపై పాలక పక్ష ప్రజాప్రతినిధుల్లో  రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారులపై మండిపడ్డారు. ‘ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ రేవుల నిర్మాణం కోసం రెండు ట్రాక్టర్ల ఇసుక కోసం నేను స్వయంగా ఆర్డర్‌ చేసి మూడు రోజులైనా అందలేదు. ఇసుక సరఫరాలో ఏపీఎండీసీ పూర్తిగా విఫలమైంది’ అని ధ్వజమెత్తారు. శుక్రవారం రావులపాలెంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారి గరుడ సుమీత్‌ సునీల్‌ ఆధ్వర్యంలో ఇసుక, బొండుమట్టి, పంట పొలాల మట్టి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఎదురవుతున్న ఇసుక ఇబ్బందులను వివరించారు. ‘పొడగట్లపల్లిలో కాల్వ రేవుల నిర్మాణం నిమిత్తం రెండు ట్రాక్టర్ల ఇసుక అవసరమై నేనే స్వయంగా ఆర్డర్‌ చేసి మూడు రోజులైనా  అందలేదు. నా నియోజకవర్గంలో 10 ర్యాంపులు ఉన్నా అధికారులు వాటిని తెరిచి ఇసుకను అందుబాటులోకి తేవడం లేదు. దీంతో దూరప్రాంతాల నుంచి ఇసుకను తెప్పించుకోవలసి వస్తోంది. వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఏపీఎండీసీ అధికారిక వెబ్‌సైట్‌ సర్వర్‌ 5 నిమిషాల్లో నిలిచిపోతోంది. దీనివల్ల జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని తెలిపారు. రైతు తన పంట పొలంలో మెరక తీసి మట్టిని బయటకు తరలించుకుంటుంటే ఏదో పాకిస్థాన్‌కు మట్టిని తరలిస్తున్నట్లుగా బెదిరిస్తున్నారని తప్పుబట్టారు. తమ పంట పొలాల్లోని మట్టిని తరలించుకునే హక్కు రైతులకు ఉందని, అలా తరలించుకునేవారిపై కేసులు పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. రైతులపై కేసులు పెట్టదలచుకుంటే ముందు తనపై పెట్టాలన్నారు. ఇటుక తయారీ రంగంలోనూ అధికారుల తీరు కారణంగా గడ్డు పరిస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు. అనుమతుల పేరిట ఇటుకబట్టీల నిర్వాహకులను వేధిస్తున్నారని.. వారికి అవసరమైన బొండు మట్టిని తరలించుకోవడానికి వెంటనే అనుమతులివ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-06-06T09:16:50+05:30 IST