దళితుల త్యాగాలకు దక్కిన విలువేది?

ABN , First Publish Date - 2021-06-03T05:55:16+05:30 IST

తెలంగాణ సమాజంలో గణనీయమైన జనాభా కలిగిన మాదిగలకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నది. రాష్ట్ర సాధనకు జవజీవాలను అందించిన వారిని గౌరవించుకోవాల్సింది పోయి, సింహభాగంగా...

దళితుల త్యాగాలకు దక్కిన విలువేది?

తెలంగాణ సమాజంలో గణనీయమైన జనాభా కలిగిన మాదిగలకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నది. రాష్ట్ర సాధనకు జవజీవాలను అందించిన వారిని గౌరవించుకోవాల్సింది పోయి, సింహభాగంగా ఉన్న మాదిగలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. దీనిపై మాదిగ మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నది.


1969 తొలిదశ ఉద్యమంలో మాదిగల వైపు నుండి ఎంతోమంది ఉద్యమంలో ముందు నిలిచారు. టీ.ఎన్‌.సదాలక్ష్మి నాటి జేఏసీని నడపడానికి తన ఇంటినే పోరాటక్షేత్రంగా మార్చింది. ఒంటి మీది నగలను సైతం అమ్మి ఉద్యమాన్ని కాపాడింది. తెలంగాణ ఆవిర్భావ అనంతరం సదాలక్ష్మికి దక్కిన గౌరవం ఏది? తొలిదశ ఉద్యమంలోనే తన మెడిసిన్‌ చదువును, వైద్యవృత్తిని వదులుకొని తెలంగాణ సాధనకోసం ముందు నిలిచిన నాయకుడు డా.కొల్లూరి చిరంజీవి. ఈ నేల విముక్తి కోసం తన భవిష్యత్‌ను సైతం లెక్క చేయని త్యాగమది. ఇక, మలిదశలో ఊరూర పోరుముగ్గులు పోసి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన కవులు కళాకారుల్లో సింహభాగం మాదిగ సామాజిక వర్గంవారే. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మాదిగల పాత్ర అద్వితీయమైంది. మలిదశ ఉద్యమనాయకునిగా కేసీఆర్‌ ఆమరణ దీక్షకు కూర్చుంటే ఊరూర ప్రజాప్రతినిధుల ఇంటి ముందు చావుడప్పు కొట్టింది మాదిగ సామాజికవర్గం కాదా? కేసీఆర్‌కు అండగా నిలబడి, నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేసింది మాదిగ నాయకత్వం కాదా? ఆత్మ బలిదానమిచ్చిన పదమూడు వందలమంది బిడ్డల్లో సగానికి పైగా మాదిగలే. మరి వారికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం దక్కింది? 


ఆంధ్రా అగ్రవర్ణాల నుండి తెలంగాణ అగ్రవర్ణాలకు అధికారం మారిందే తప్ప, మాదిగల జీవితం ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. చదువు లేదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. మద్యం అమ్మి సర్కార్‌ మాదిగల ప్రాణాలు మాత్రం తీస్తున్నది. లక్షల అకాల మరణాలు మాదిగల్లో మద్యం వల్లే సంభవించాయి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. అధికారాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి పాలకులు మాదిగ సామాజిక వర్గాన్ని అణచివేయడానికి కుట్రలు చేస్తూనే ఉన్నారు. మొదటి ఉపముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నారు. ఒక్క మాదిగకు మంత్రి పదవి కాదుగదా, కనీసం జనాభాకు తగినట్టుగా రిజర్వుడు స్థానాల్లో సైతం టిక్కెట్లు ఇవ్వలేదు. మాదిగ రిజర్వేషన్‌ కోసం ఏర్పాటైన ఎమ్మార్పీఎస్‌ను ముక్కలు చేసి, గ్రూపులుగా విభజించారు. దానిని బలహీన పరచడానికి చేయాల్సిన కుట్రలు, కుయుక్తులన్నీ చేశారు.


ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌తో పాటు యూనివర్సిటీలకు వీసీలను నియమించారు. ఇక్కడ కూడా మాదిగలకు కనీసం ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వలేదు. టీఎస్‌పీఎస్సీ అయినా, వీసీల నియామకంలోనైనా తెలంగాణలో ఒక మేజర్‌ కమ్యూనిటీగా ఉన్న మాదిగ సమూహాన్ని విస్మరిం చడం క్షమించరానిది. మాదిగలకు జనాభాకు అనుగుణంగా తెలంగాణ ఫలాలు దక్కాలంటే పోరాటం ఒక్కటే మార్గం. మాదిగ ప్రజాప్రతినిధులు తమ పనికిమాలిన పదవుల కోసం కాచుకొని కూర్చోకుండా వెంటనే రాజీనామా చేయాలి. మాదిగల వాటా మాదిగలకు దక్కే వరకు సర్కార్‌ మీద చావుడప్పు కొట్టాలి. హక్కులు అడుక్కుంటే వచ్చేవి కావు, పోరాడి సాధించుకోవాలన్న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మాటల్ని గుర్తు తెచ్చుకోవాలి.



-డా. పసునూరి రవీందర్‌

Updated Date - 2021-06-03T05:55:16+05:30 IST