వార్డు కమిటీలెక్కడ?

ABN , First Publish Date - 2022-01-18T05:00:35+05:30 IST

మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం వార్డు కమిటీలను నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది.

వార్డు కమిటీలెక్కడ?
మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయం

ప్రగతిలో కానరాని భాగస్వామ్యం 

నామమాత్రంగా కమిటీల నియామకం 

మెదక్‌ మున్సిపాలిటీ, జనవరి 17: మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం వార్డు కమిటీలను నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సూచనల మేరకు పాలకవర్గాలు వార్డు కమిటీలను ఎంపిక చేశారు. ఈ కమిటీలు వార్డులలో జరిగే అభివృద్ధి పనులు, అక్రమ భవన నిర్మాణాలు, ప్లాస్టిక్‌ కవర్ల నిషేధంపై పర్యవేక్షణ చేయాలి. కాని జిల్లాలోని మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు వార్డు కమిటీలు సమావేశమైన దాఖలాలు లేవు. కమిటీ సభ్యులు వార్డు పరిధిలో సమస్యలను గుర్తించి పాలకవర్గం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పలు సూచనలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పట్టణప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఆయా పనులపై కూడా కమిటీ సభ్యుల పర్యవేక్షణ కొరవడింది. వార్డులలో కౌన్సిలర్‌తో కలిసి కమిటీ సభ్యులు పర్యటించి పారిశుధ్యం, వీధి దీపాలు, తాగు నీరు తదితర సమస్యలను గుర్తించి అధికారులకు ప్రతిపాదన ఇవ్వాల్సి ఉంటుంది. వార్డు కమిటీలు ఇచ్చే సూచనలు అధికారులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

కాగితాలకే పరిమితం

పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటైన వార్డు కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాటీల్లో ఏ ఒక్క రోజు సలహాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కౌన్సిలర్లు సైతం వార్డు కమిటీలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌

మున్సిపాలిటీల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అభివృద్ధితో పాటు సమస్యలను గుర్తించడానికి వార్డు కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక వర్గంలో సైతం వార్డు కమిటీల ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రధానంగా పారిశుధ్యం, హరితహారం, తాగునీటి సరఫరా, ఉద్యానవనాల పన్నుల వసూళ్లపై కమిటీలు సూచనలు అందించాలని పేర్కొంది. అంతేకాకుండా ప్రగతి పనులు ఎక్కడ..? ఎప్పుడు..? చేపట్టాలనే వివరాలను కమిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కమిటీలను నామమాత్రంగా ఎంపిక చేయడంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కనిపించడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీలలో కమిషనర్లు, వార్డు కమిటీలతో సమావేశాలు నిర్వహించాలి. కానీ ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేయకపోడం గమనార్హం. పురపాలక సంఘం ఆదేశాలు అమలు కావడం లేదంటూ వార్డు కమిటీసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో మున్సిపాలిటీలలో ఎంపిక చేసిన వార్డు కమిటీల ద్వారా సూచనలు తీసుకుంటే క్షేత్ర స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2022-01-18T05:00:35+05:30 IST