Abn logo
Dec 1 2020 @ 00:22AM

ఈ పాడుకాలం పోయేదెన్నడు?

ఆర్థిక తిరోగమనం, ఆరోగ్య విపత్తు అతలాకుతలం చేస్తున్న రోజులివి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడీపీలో తగ్గుదల మన ఆర్థిక వ్యవస్థ కుంగుబాటును ధ్రువీకరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటూ ప్రగతిశీలంగా లేకపోవడం తాత్కాలికమేనని, త్వరలోనే ఆర్థిక పునరుత్తేజం ఖాయమని ఐఎమ్‌ఎఫ్ భావిస్తోంది. ఈ అంచనాకు విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థల ప్రతికూల పెరుగుదల మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని, 1930 దశకం నాటి మహామాంద్యం మళ్ళీ ఆవరించనున్నదని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు (–)24శాతం మేరకు ప్రతి కూలంగా ఉంది. రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) లోనూ ఈ వృద్ధిరేటు (–) 8 నుంచి 10 శాతం మేరకు ప్రతికూలంగా ఉండగలదని అంచనా (ఈ రెండో త్రైమాసికంలో మన ఆర్థిక ఉత్పత్తి 7.5 శాతం మేరకు తగ్గిపోయిందని జాతీయ గణాంకాల సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది). ఈ ఆర్థిక వైపరీత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
జీడీపీ ప్రతికూల వృద్ధిరేటు కేవలం ఒకే ఒక నెలకు మాత్రమే పరిమితమయితే అసలు పట్టించుకోవలసిన అవసరం లేదు. అయితే ఆ ప్రతికూల పెరుగుదల ఆ త్రైమాసికం అంతా కొనసాగిన పక్షంలో ఆర్థికవ్యవస్థ అల్ప మాంద్యం లేదా వ్యాపారమాంద్యం (రిసెషన్)లోకి ప్రవే శించినట్టు ఆర్థిక వేత్తలు పరిగణిస్తారు. అల్పమాంద్యం అనేది వ్యాపార చక్ర దశలలో ఒకటి. ఆర్థిక కార్యకలాపాల స్థాయిలోని వృద్ధి క్షయాలే వ్యాపార చక్రం. అల్ప మాంద్య దశలో పెట్టుబడులు, ఆదాయాలు, వినియోగం తగ్గుతాయి. నిరుద్యోగిత పెరుగుతుంది. ప్రతికూల వృద్ధిరేటు వరుసగా రెండు త్రైమాసికాలు కొనసాగిన పక్షంలో ఆర్థిక వ్యవస్థ ‘టెక్నికల్ రిసెషన్’ (ఆర్థిక తిరోగమనం)లోకి ప్రవేశించినట్టే. మరింత స్పష్టంగా చెప్పాలంటే అంగీకార యోగ్యమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి ప్రమాణాల ప్రకారం ఒక ఆర్థిక వ్యవస్థ పెరుగుదల సంకోచించడమే ఆర్థిక తిరోగమనం. కొన్నిసార్లు ఈ ప్రతికూల వృద్ధిరేటు వరుసగా నాలుగు త్రైమాసికాలే కాదు, పలు సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఉదాహరణకు 1929లో సంభవించిన మహామాంద్యం. అమెరికాను అల్లకల్లోల పరిచిన ఈ మాంద్యం దేశదేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపివేసి వరుసగా ఏడెనిమిది సంవత్సరాల పాటు కొనసాగింది. ప్రతికూల వృద్ధిరేట్లు ఇలా అనేక సంవత్సరాలపాటు కొనసాగడాన్నే ‘డిప్రె షన్’ (ఆర్థిక మాంద్యం) అంటారు. వ్యాపార చక్రపు ఈ దశలో వ్యాపారస్థులు, పారిశ్రామిక సంస్థలలో నైరాశ్యం నెలకొంటుంది. వ్యాపార లావాదేవీల రేటు, క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక మాంద్యం ఆవహించినప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా నిరుద్యోగిత పెరుగుతుంది. రుణ సదుపాయాలు క్షీణిస్తాయి. వస్తువుల ధరలు, షేర్ల ధరలు విపరీతంగా పడిపోతాయి. జాతీయాదాయం, దానితో పాటు ప్రజల ఆదాయాలు తగ్గిపోతాయి. ఆర్థిక వ్యవస్థ అంతటా నిరుత్సాహ పూరిత వాతావరణం నెలకొంటుంది. 

ఆర్థిక రంగంలో ఈ ప్రతి కూల పరిస్థితి గురించి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సంస్థ, ప్రపంచ బ్యాంకు అంచనాలు భిన్నంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థల ప్రస్తుత మందగమనం కేవలం ఒక ‘ఆర్థిక తిరోగమనం’ మాత్రమేనని, సత్వరమే ఈ ప్రతి కూల వృద్ధిరేట్లు ప్రగతిశీల వృద్ధి రేట్లుగా పరిణమిస్తాయని ఐఎమ్‌ఎఫ్ గట్టిగా విశ్వసిస్తోంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ‘ఆర్థిక మాంద్యం’లోకి ప్రవేశించిందని ప్రపంచ బ్యాంకు ఘంటాపథంగా చెబుతోంది. ప్రతికూల వృద్ధిరేటు పలు సంవత్సరాల పాటు ఖాయంగా కొనసాగుతుందని బ్యాంక్ స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంకోచించిందనే విషయాన్ని ఈ రెండు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలూ అంగీకరిస్తున్నాయి. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సౌష్ఠవం శీఘ్రగతిన పునరుద్ధరణ సాధ్యపడగలదని ఐఎమ్‌ఎఫ్ దృఢంగా నమ్ముతోంది. ప్రపంచ బ్యాంకులో ఈ ఆశాభావం కొరవడింది. 1930 దశకంలో అమెరికా ఆర్థికవ్యవస్థలో సంభవించిన పరిణామాలు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా పునరావృతమవనున్నాయని ప్రపంచబ్యాంకు హెచ్చరిస్తోంది. 

కొవిడ్–19 మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ సత్వరమే అందుబాటులోకి రాగలదనే ఆశాభావం సమస్త మానవాళిలోనూ నిండుగా వ్యక్తమవుతోంది. తాము అభివృద్ధి పరుస్తున్న వ్యాక్సిన్లు మహమ్మారిని నిరోధించడంలో 90 శాతం మేరకు సఫలమయినట్టు పలు కంపెనీలు వెల్లడించాయి. ఈ సంవత్సరాంతానికి లేదా మరి కొద్ది నెలల్లో వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురాగలమని దేశ దేశాల ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఈ శుభ పరిణామం తప్పక వస్తుందనే పరిపూర్ణ విశ్వాసం ప్రాతిపదికనే ‘ఆర్థిక తిరోగమనం’ సత్వరమే సమాప్తమవగలదని ఐఎమ్‌ఎఫ్ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. అయితే కరోనా వైరస్ వేగవంతంగా ఉత్పరివర్తన (మ్యుటేషన్) చెందే విషక్రిమి కనుక అది సత్వరమే కొత్త రూపాలను సంతరించుకుని మానవాళికి సోకే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. ఉత్పరివర్తన చెందిన కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో వ్యాక్సిన్లు విఫలమయ్యే అవకాశం ఉందనే భయాన్ని ప్రపంచ బ్యాంకు వ్యక్తం చేస్తోంది. కొవిడ్ మహమ్మారి మరోసారి విరుచుకుపడడమే కాదు, ఇప్పటికే దాని బారినపడి కోలుకున్న అసంఖ్యాక ప్రజలు మళ్ళీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎంతైనా ఉందనే జాగృత వాణిని నిపుణులు వినిపిస్తున్నారు. శారీరక అలసట, తలనొప్పి, శ్వాస సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తాయి. ఇటువంటి రుజాగ్రస్తుల ఉత్పాదక సామర్థ్యం అనివార్యంగా సుదీర్ఘకాలం పాటు అల్పస్థాయిలో ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితిలో వృద్ధిరేటు తక్కువ స్థాయిలో ఉంటుంది. వ్యాక్సిన్లు తుది ఆమోదాన్ని పొంది, పూర్తిస్థాయిలో వాణిజ్య సరుకుగా మారి, 700 కోట్ల ప్రపంచ జనాభాకు అందడానికి హీనపక్షం మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ ఘోర వాస్తవాల దృష్ట్యా ప్రస్తుత అల్ప మాంద్యం, ఐఎమ్‌ఎఫ్ విశ్వసిస్తున్నట్టుగా ‘ఆర్థిక తిరోగమనం’గా మాత్రమే ఉంటుందా లేక ప్రపంచ బ్యాంకు హెచ్చరిస్తున్నట్టు ‘మహా ఆర్థిక మాంద్యం’గా పరిణమిస్తుందా అన్నది కచ్చితంగా చెప్పలేము. 

కొవిడ్ విరుచుకు పడిన తరుణంలో భారీ రుణాలు తీసుకుని ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా చేసి ఆర్థిక వ్యవస్థల పతనాన్ని నివారించడంలో అన్ని దేశాలు దాదాపుగా విజయవంతమయ్యాయని ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంకు అంగీకరించాయి. ఇదొక సంతోషప్రదమైన స్థితి. అయితే పెద్ద ఎత్తున తీసుకున్న రుణాలను నైపుణ్యాల, సాంకేతికతల మెరుగుదలకే వినియోగించడం జరిగిందా? ఒక విద్యార్థి తాను తీసుకున్న రుణాన్ని ఒక కొత్త కోర్సును అభ్యసించడానికి వినియోగిస్తే అది అతని, ఆమె విద్యా వికాసానికి, ఉద్యోగ విజయానికి తప్పక దోహదం చేస్తుంది. అలా కాకుండా ఆనంద విహారాలకు వినియోగిస్తే అతని, ఆమె భవిష్యత్తు బాధలమయం కావడం ఖాయం. ఇటీవల దసరా, దీపావళి పండుగల సందర్భంలో తనకు మంచి వ్యాపారం జరిగిందని ఫరీదాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి ఎంతో ఆనందంగా చెప్పాడు. అసలే ఆర్థిక వ్యవస్థ కుదేలై, ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోతే మీ వ్యాపారం సజావుగా ఎలా ఉందని నేను విస్మయపడుతూ ప్రశ్నించాను. ప్రభుత్వోద్యోగులకు మంచి సుస్థిర ఆదాయం ఉన్నందున వారు తమ వద్ద భారీ కొనుగోళ్లు చేశారని ఆ వ్యాపారి చెప్పాడు. ఆ వ్యాపారి మాటల్లో దాగి ఉన్న వాస్తవం అర్థమయిందా? కొవిడ్ ఆపత్కాలంలో తీసుకున్న రుణాలను ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టుల్లో మదుపు చేయలేదు. సరికాదా వినియోగ వ్యయాలకు ఉపయోగించింది! ఈ ఆర్థిక అవివేకం దేశ శ్రేయో సాధనకు ఎంత మాత్రం శుభ శకునం కాదు. 

భరత్ ఝున్‌ఝున్‌వాలా
(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...