తొలగించిన చోటనే.. దర్జాగా వెంచర్‌

ABN , First Publish Date - 2021-02-25T05:26:13+05:30 IST

తునికిళ్ల తండాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం అక్రమంగా వెంచర్‌ నిర్మాణం చేపట్టడంతో అధికారులు తొలగించారు. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో అక్రమంగా వెంచర్‌ను ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు.

తొలగించిన చోటనే.. దర్జాగా వెంచర్‌
తునికిళ్ల తండాలో తొలగించిన చోటనే వెంచర్‌ను ఏర్పాటు చేసి హద్దురాళ్లు పాతిన దృశ్యం

 కలెక్టర్‌ ఆదేశాలూ బేఖాతర్‌

 ప్లాట్ల అమ్మకానికి షెడ్డు ఏర్పాటు

 తునికిళ్ల తండాలో రెచ్చిపోతున్న రియల్టర్లు

 పట్టించుకోని అధికారులు


కంది, ఫిబ్రవరి 24: తునికిళ్ల తండాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం అక్రమంగా వెంచర్‌ నిర్మాణం చేపట్టడంతో అధికారులు తొలగించారు. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో అక్రమంగా వెంచర్‌ను ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. తునికిళ్ల తండాలో సర్వే నంబర్‌ 63, 64లో అక్రమంగా వేసిన వెంచర్‌ను కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశాల మేరకు గతేడాది సంవత్సరం ఆగస్టు 4న డీఎల్పీవో సతీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో తొలగించారు. వెంచర్‌లో పాతిన హద్దురాళ్లను ట్రాక్టర్‌ సహాయంతో తొలగించారు. పక్కనున్న ఆక్రమణలను తొలగించి నోటీసులు జారీ చేశారు. కానీ వాటిని బేఖాతర్‌ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కూల్చిన చోటనే రియల్టర్లు వెంచర్‌ నిర్మాణం చేపట్టారు. ఎక్స్‌కవేటర్‌తో ప్లాట్లలో చెత్తను తొలగించి హద్దురాళ్లను పాతారు. బుధవారం కూలీలను పెట్టి హద్దురాళ్లకు సున్నం వేయించారు. ప్లాట్ల అమ్మకాల కోసం వెంచర్‌ ఏర్పాటు చేసిన చోట షెడ్డును కూడా నిర్మించారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. ఇదే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి వివేక్‌ను వివరణ కోరగా తాను గమనించలేదని ఒకసారి, నోటీసులు ఇచ్చామని మరోసారి చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




Updated Date - 2021-02-25T05:26:13+05:30 IST