ఆంగ్ల బోధన అమలయ్యేనా

ABN , First Publish Date - 2022-01-28T05:42:12+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన అమలు చేయాలని నిర్ణయించడంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.

ఆంగ్ల బోధన అమలయ్యేనా
పేట ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల

- సర్కారు బడుల్లో మౌలిక వసతులు కరువు

- ఇది వరకే జిల్లాలో 26 సక్సెస్‌ పాఠశాలల్లో ఆంగ్ల బోధన 

- ఉపాధ్యాయుల కొరతతో పలు పాఠశాలల్లో  నిలిపివేసిన వైనం

- 17 ప్రాథమిక పాఠశాలలోనూ ఇంగ్లిష్‌ బోధన 

నారాయణపేట, జనవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన అమలు చేయాలని నిర్ణయించడంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. కాగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 334 ప్రాథమిక పాఠశాలలు, 89 ప్రాథమికోన్నత పాఠశాలలు, 76 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 128 ప్రైవేటు పాఠశాలలు ఇలా మొత్తం 623 పాఠశాలల్లో 98 వేలకుపై చిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. 2009లో ప్రభుత్వం ఆరు నుంచి పదో తరగతి వరకు పలు పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 26 సక్సెస్‌ పాఠశాలలను ఎంపిక చేసి ఆంగ్ల బోధనను అందించారు. ఉన్న ఉపాధ్యాయులే ఆంగ్ల బోధన చేయాల్సి రావడంతో అదనపు భారంతో కొన్ని పాఠశాలల్లోనే నెట్టుకొచ్చారు. మరికొన్ని పాఠశాలల్లో ఆంగ్లబోధనకు స్వస్తి పలకడంతో జిల్లాలో సగం సక్సెస్‌ పాఠశాలలో ఆంగ్ల బోధనకు బ్రేక్‌ పడింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనపు భారా న్ని మోస్తూ ఆంగ్ల బోధనను నెట్టుకొస్తున్నారు. అదే విధంగా 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి ఐదోతరగతి వరకు ఆంగ్లబోధన అందిస్తూ వస్తున్నారు. జిల్లాలో 17 పాఠశాలల్లో ఆంగ్ల బోధన కొనసాగుతోంది. నారాయణపేట శివాజీనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల బోధన కొన సాగుతుండగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 311 మంది విద్యార్థులు ఆంగ్ల బోధనను అభ్యసిస్తున్నారు. ఎనిమిది మంది ఉపాధ్యాయులతో పాఠశాల కొనసాగుతుంది. జాజాపూర్‌ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఆంగ్ల బోధ న కొనసాగుతుండగా ఉన్న ఉపాధ్యాయులతోనే ఆంగ్లబోధన అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వక పోవడం, ఉన్న పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు కల్పించకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు సమ స్యలతో సతమతమౌతూ విద్యాభ్యాసం నెట్టు కొస్తున్నారు. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఆంగ్ల బోధన అమలు చేయడంతో పాటు మౌలిక వసతులను కల్పించి, మెరుగైన బోధన కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థులకనుగుణంగా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభిమానులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-28T05:42:12+05:30 IST