ప్రభుత్వ వైద్య కళాశాల లేనట్లేనా?

ABN , First Publish Date - 2020-09-24T07:01:34+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే తప్ప

ప్రభుత్వ వైద్య కళాశాల లేనట్లేనా?

 ఆటంకంగా మారిన కేంద్రం నిబంధనలు

 రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తేనే అవకాశం

 సీఎం కేసీఆర్‌ హామీపై ప్రజల ఆశలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే తప్ప కేంద్ర సాయం అందందని తేలిపోయింది. ఒక పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాల ఒక్కటి కూడా లేనప్పుడు మాత్రమే కొత్త వాటికి అనుమతిస్తామని కేంద్రం నిబంధనలు విధించడంతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు ఇక లేనట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రాయోజిత పథకం కింద మంజూరయ్యే వైద్య కళాశాలలకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తాయి. ఈ పథకం కింద రాష్ట్రంలో ఏడు వైద్య కళాశాలలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో కరీంనగర్‌ వైద్య కళాశాల కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనల కారణంగా రాష్ర్టానికి ఒక్క కళాశాల కూడా మంజూరు కాలేదు. వైద్య కళాశాల ఏర్పాటుకు సుమారు 600 కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకం కింద కళాశాల మంజూరైతే 60 శాతం నిధులు కేంద్రం ఇచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకునే నిర్ణయంపైనే కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం ఆధారపడి ఉన్నది. 


ఇద్దరు ముఖ్యమంత్రుల హామీ

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ముల్కనూరులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికి స్పందనగా కిరణ్‌ కుమార్‌రెడ్డి కళాశాల ఏర్పాటుకు హామీ ఇస్తూ ఆ సభలోనే ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళాశాల ఏర్పాటు విషయంలో కదలిక కూడా వచ్చింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో కలెక్టర్‌ లోయర్‌ మానేరు డ్యాం వద్ద ఉన్న పీజీ సెంటర్‌కు సంబంధించిన 25 ఎకరాల భూమిని వైద్య కళాశాలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో ఈ ప్రతిపాదన అక్కడికే ఆగిపోయింది. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడి ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 ఆగస్టు 5వ తేదీన ఆయన కరీంనగర్‌ పర్యటనకు వచ్చారు.


ఈ సందర్భంగా కరీంనగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ర్టానికి ఏడు మెడికల్‌ కళాశాలలను మంజూరు  చేయాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ కాని, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ కాని ఉన్నట్లయితే కొత్త కళాశాలలను మంజూరు చేయవద్దని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం మేరకు రాష్ర్టానికి ఒక్క కళాశాల కూడా మంజూరు కాలేదు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కరీంనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలోనే రెండు ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉండడంతో కరీంనగర్‌కు అవకాశం దక్కలేదు.


దీంతో కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అంశం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర సాయం అందే అవకాశం లేనందున రాష్ట్ర ప్రభుత్వమే 600 నుంచి వెయ్యి కోట్ల రూపాయలు భరించడానికి ముందుకు వస్తే తప్ప కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలపై ఆశలు వదులుకోవాల్సిందే.స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అయినందువల్ల దానిని నెరవేర్చడానికి కేసీఆర్‌ వెనకాడరనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఇప్పటికే ఇక్కడ రెండు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉండడంతో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్న విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంపైనే కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం ఆధారపడి ఉన్నది. 


రామగుండంలోనూ ప్రశ్నార్థకమే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు సందర్భాల్లోనూ రామగుండంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి కరీంనగర్‌కు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌, రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు విషయం చర్చకు రావడంతో కళాశాలలను ఏర్పాటు చేస్తామని, అందుకు సింగరేణి, ఎన్‌టీపీసీ సంస్థల సహకారం  తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ తర్వాత ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రామగుండంలో వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో సింగరేణి, ఎన్‌టీపీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ వైద్య కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడంతోపాటు వసతుల కల్పనకు అంగీకరిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నది.


ఈ కళాశాలను మంచిర్యాలలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తెరపైకి తెచ్చారు. రామగుండంలో 300 పడకల సింగరేణి ఆస్పత్రి, 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. దీంతో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు చేయాల్సిన అవసరం ఉండదని, రామగుండంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు బలం చేకూరింది. వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న ఈ రెండు ప్రాంతాలు పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రాయోజిత పథకం నిబంధనలు ఆటంకంగా ఏమి ఉండవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో ఈ కళాశాల కూడా ఉన్నదని తెలిసింది. ఈ కళాశాల ఎందుకు మంజూరి కాలేదన్న విషయం తెలియాల్సి ఉన్నది. కరీంనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తుందా, రామగుండం, మంచిర్యాలలో ఏదో ఒక ప్రాంతంలో కేంద్రం సాయంతో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తుందా అన్న విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నది. 

Updated Date - 2020-09-24T07:01:34+05:30 IST