టౌన్‌షిప్‌కు భూములివ్వం

ABN , First Publish Date - 2021-06-19T05:13:33+05:30 IST

కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం టౌన్‌షిప్‌ కోసం తమ భూములను ఇచ్చేది లేదని కొండములగాం రైతులు తేల్చిచెప్పారు. టౌన్‌షిప్‌ కోసం కేటాయించిన ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 2లోని స్థలాలను ఆర్డీవో కిశోర్‌ శుక్రవారం పరిశీలించారు. రైతులు సహకరించాలని, భూములు కోల్పోయిన వారికి పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నామని వివరించారు.

టౌన్‌షిప్‌కు భూములివ్వం
కొండములగాంలో భూ సర్వే చేయవద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న రైతులు

 తేల్చిచెప్పిన కొండములగాం రైతులు

 సర్వేను అడ్డుకోవడంతో వెనుదిరిగిన అధికారులు

 సహకరించాలన్న ఆర్డీవో కిశోర్‌

రణస్థలం, జూన్‌ 18: కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం టౌన్‌షిప్‌ కోసం తమ భూములను ఇచ్చేది లేదని కొండములగాం రైతులు తేల్చిచెప్పారు. టౌన్‌షిప్‌ కోసం కేటాయించిన ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 2లోని స్థలాలను ఆర్డీవో కిశోర్‌ శుక్రవారం పరిశీలించారు. రైతులు సహకరించాలని, భూములు కోల్పోయిన వారికి పరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ భూములపైనే ఆధారపడి బతుకుతున్నామని వివరించారు. ఇక్కడ టౌన్‌షిప్‌ కోసం సర్వే చేస్తే ఊరుకొనేది లేదని రైతులు హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దపెద్ద లోయలు, కొండలను చదును చేసుకొని పంటలు సాగు చేస్తున్నామని, ఇప్పుడు వచ్చి తమ కడుపుపై కొట్టవదని రైతులు వేడుకున్నారు. 1970లో దళితులు, కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన రైతులకు ఈ స్థలాల్లో  డిపట్టాలు ఇచ్చారన్నారు. వాటిలో జీడి మామిడి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని రైతులు రెడ్డి వాసు, దన్నాన సత్తిబాబులు ఆర్డీవోకు వివరించారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని,  సర్వే చేసేందుకు సహకరించాలని ఆర్డీవో కోరారు. అయినా రైతులు అంగీకరించకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.సుధారాణి, ఆర్‌ఐ శర్మ,  సర్వేయర్‌ రెడ్డి పాల్గొన్నారు.


మూడు దశాబ్దాల నుంచి..

మూడు దశాబ్దాల నుంచి కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ, జిరా యితీ భూములు 2,054 ఎకరాల్లో అణు ప్లాంటును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  కొందరు రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అణువిద్యుత్‌ కేంద్రంలో పని చేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాసం కోసం టౌన్‌షిప్‌ నిర్మాణానికి గతంలో కొచ్చెర్ల పంచాయతీ పరిధి కొల్లిభీమవరంలో 200 ఎకరాలను గుర్తించారు. ఈ భూమి అటవీశాఖది  కావడంతో అధికారుల దృష్టి ఇప్పుడు కొండములగాం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 2పై పడింది. ఇక్కడ సుమారు 1000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సర్వే చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2021-06-19T05:13:33+05:30 IST