అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2020-06-02T10:02:44+05:30 IST

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మిస్తున్న అంతర్గత రహదారుల నిర్మాణం ఆగిపోయింది. గత ప్రభుత్వ

అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తయ్యేనా?

ముత్తుకూరు, జూన్‌1 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మిస్తున్న అంతర్గత రహదారుల నిర్మాణం ఆగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో మండలంలోని మల్లూరు నుంచి గుంటకట్ట వరకు, నెల్లూరు ప్రధాన రహదారి నుంచి కుమ్మరమిట్ట గ్రామం మీదుగా మల్లూరు రహదారిని కలిపేందుకు రెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ రహదారిని విస్తరిస్తూ దువ్వూరుపాళెం వరకు నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


ముత్తుకూరు నుంచి బోడిస్వామికండ్రిగ మీదుగా కావలి దళితవాడ వరకు రహదారి నిర్మాణం కోసం రూ. కోటీ 88 లక్షల మంజూరయ్యాయి. ఏళ్ల తరబడి రహదారి సౌకర్యం లేని మల్లూరు, కావలి దళితవాడ గ్రామాలకు రహదారి నిర్మాణ పనులు రెండేళ్ల  క్రితం ప్రారంభించారు. మద్దిమాను వద్ద కుమ్మరమిట్ట గ్రామానికి వెళ్లే రహదారిలో కల్వర్టు పనులు పూర్తయ్యాయి. రహదారుల నిర్మాణం 70 శాతం పూర్తయ్యింది.


ఈ రహదారులు పూర్తయితే  మండలంలోని అన్ని గ్రామాలకూ అంతర్గత రహదారి సౌకర్యం కల్పించినట్లే. కావలి దళితవాడకు రహదారి సౌకర్యం లేనందున గతంలో ఉన్న బస్సు సర్వీసును రద్దు చేశారు. దాంతో అక్కడి వారు ముత్తుకూరుకు పనులపై రావాలంటే ఆటోలు లేదా కాలినడకే శరణ్యంగా మారింది. గత ఏడాది ఎన్నికల సందర్భంగా అంతర్గత రహదారుల పనులు నిలిపివేశారు. కావలి దళితవాడ రహదారికి కంకర తోలి చదును చేశారు.


అప్పటి నుంచి ఈ రహదారి నిర్మాణం పనులు జరగలేదు. వేసిన కంకర కాస్త తేలిపోయి ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటివరకు ఈ రహదారుల నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున పనులు అపివేసి ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద మంజూరైన పనులను కొనసాగిస్తారా, లేదా అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-06-02T10:02:44+05:30 IST