టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందా? లేదా?

ABN , First Publish Date - 2021-01-21T06:41:06+05:30 IST

త్వరలో జరగనున్న శాసన మండలి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందా ? లేదా ? అనే సందేహాలు అధికార టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి

టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందా? లేదా?

రేపు గ్రాడ్యుయేట్‌ ఓటర్ల తుది జాబితా విడుదల

గులాబీ అభ్యర్థి ఖరారు అటుంచి..

సన్నాహక సమావేశాలూ లేవు

మంత్రులు, ఎమ్మెల్యేలూ ప్రచారానికి దూరం

అధికార పార్టీ శ్రేణుల్లో అయోమయం


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న శాసన మండలి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందా ? లేదా ? అనే సందేహాలు అధికార టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ, పోటీ విషయంలో అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు లేకపోవటం అయోమయం కలిగిస్తోందని ఆ వర్గాలు వాపోతున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి-టీఆర్‌ఎస్‌ (వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ), ఎన్‌.రాంచందర్‌రావు- బీజేపీ (మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌) పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈ రెండు నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైంది. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం (22న) ఓటర్ల తుది జాబితా అధికారికంగా వెలువడనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌, నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు రెండు స్థానాల్లోనూ ఓటర్ల నమోదు వరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు చురుగ్గానే పనిచేశాయి.


ప్రచారం వరకు వచ్చేసరికి అధిష్ఠానం.. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా వ్యవహరించటంపై అధికార పార్టీ ముఖ్యుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వరంగల్‌ స్థానం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని నియోజకవర్గంలోని మూడు ఉమ్మడి జిల్లాల టీఆర్‌ఎస్‌ నేతలకు స్పష్టత ఉంది. అక్కడ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అధిష్ఠానం కూడా వరంగల్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ముఖ్యులతో సమావేశాలు నిర్వహించింది. అధిష్ఠానం వద్ద ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్యుల భేటీ నేడు లేదా రేపు జరగనుంది. అదే రంగారెడ్డి (మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థి ఖరారు అటుంచి, టీఆర్‌ఎస్‌ ప్రచారం ఎక్కడా కనిపించటంలేదు. ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మండలి ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. 


అధిష్ఠానం ఆదేశాలు లేనందునే దూరం!

అధిష్ఠానం నుంచి తగిన ఆదేశాలు లేకపోవటం వల్లనే  టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో నిన్నమొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ తరఫున పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఉత్సాహం చూపిన పలువురు పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చారు. ఇక్కడి నుంచి తొలుత టీఆర్‌ఎస్‌ తరఫున పోటీకి సై అన్న ఆశావహులు కూడా దూకుడుగా ముందుకు వెళ్లటంలేదని అంటున్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి ఆర్థికంగా, ఇతరత్రా అన్ని రకాల అండదండలు అందిస్తే తప్ప, వారిలో ఎవరూ పోటీకి సిద్ధంగాలేరని తెలుస్తోంది. 


ప్రొ. నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు?

రంగారెడ్డి స్థానం నుంచి సిటింగ్‌ బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తిరిగి బరిలో నిలవటం ఖాయమైంది. ఆయన ప్రచారంలో దూసుకుకెళ్తు న్నారు. మరోవైపు స్వత్రంత అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు సీపీఎం, సీపీఐ మద్దతు ప్రకటించాయి. అయితే.. కె.నాగేశ్వర్‌కు తమ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, అందుకే పోటీ విషయంలో ఉద్దేశపూర్వక తాత్సరం జరుగుతోందనే చర్చ టీఆర్‌ఎ్‌సలో జరుగుతోంది. తొలుత నాగేశ్వర్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని తమ అధిష్ఠానం కోరిందని, అందుకు ఆయన నిరాకరించారనే అంశం కూడా ఆ చర్చల్లో ప్రస్తావనకు వస్తోంది. 

Updated Date - 2021-01-21T06:41:06+05:30 IST